మనుషులే కాదు.. ఆవులూ ముఖ్యమే!

లక్నో: గోరక్షణ పేరుతో పెరిగిపోతున్న మూక దాడులపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మనుషులు ముఖ్యమే.. అదే సమయంలో ఆవులు కూడా అని ఆయన అన్నారు. ప్రకృతిలో మనుషులు, ఆవులు.. ఎవరి పాత్ర వారికుంది. అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది అని యోగి స్పష్టంచేశారు. ప్రభుత్వం అందరికీ రక్షణ కల్పిస్తుందని చెప్పారు. అయితే ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించాల్సిన అవసరం ప్రతి వ్యక్తి, మతం, సామాజికవర్గంపై ఉన్నదని యోగి అభిప్రాయపడ్డారు. మూక దాడులకు లేని ప్రాధాన్యతను కాంగ్రెస్ ఇస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా 1984 సిక్కుల ఊచకోతను గుర్తుచేశారు. ఇలాంటి అంశాలకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు. మూక దాడుల గురించి మాట్లాడుతున్నారు మరి 1984లో జరిగింది ఏంటి? శాంతిభద్రతలు కాపాడతాం. కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం మానుకోవాలని యోగి అన్నారు.

యోగి అధికారంలోకి రాగానే యూపీలోని అక్రమ కబేళాలను మూయించిన సంగతి తెలిసిందే. ఆవులను రక్షించడం రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా చాలా అవసరమని అన్నారు. గ్రామీణాభివృద్ధికి ఆవులు ఎంతగానో తోడ్పడతాయని, అందుకే ఆవుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని యోగి చెప్పారు. ఇక లోక్‌సభలో ప్రధాని మోదీని రాహుల్ హగ్ చేసుకోవడాన్ని పిల్ల చేష్టగా యోగి అభివర్ణించిన విషయం తెలిసిందే.

Related Stories: