తమన్నా పోరాటాలు

పాత్రల పరంగా ప్రయోగాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు నవతరం కథానాయికలు. కథ నచ్చితే చాలు ఎలాంటి సాహసానికైనా సిద్ధపడుతున్నారు. కథానాయకులతో ధీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటించి తెగువను చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. తాజాగా తమన్నా యాక్షన్ బాట పట్టబోతున్నది. వివరాల్లోకి వెళితే...విశాల్ కథానాయకుడిగా సుందర్.సి దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం తెరకెక్కనున్నది. పూర్తిస్థాయి యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా ఓ హీరోయిన్‌గా నటించనున్నది. ఈ సినిమాలో తమన్నాపై రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ దర్శకుడు సుందర్‌తో పనిచేయాలని కెరీర్ ప్రారంభం నుంచి ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్లకు ఆ కల తీరింది. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. సూపర్ హీరో చిత్రాల తరహాలో శక్తివంతంగా నా పాత్ర ఉంటుంది. సినిమాలో నాపై క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలుంటాయి. ఈ పోరాట ఘట్టాల కోసం డూప్‌లపై ఆధారపడకుండా మార్షల్ ఆర్ట్స్‌తో పాటు యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను. నా కెరీర్‌లో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడూ చేయలేదు. అవన్నీ కొత్త అనుభూతిని పంచుతాయి అని తెలిపింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఎఫ్-2 చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.