ఏసీబీ వలలో అవినీతి చేప..

భీమదేవరపల్లి : పట్టాదారు పాస్‌పుస్తకం కోసం రైతు నుంచి రూ.ఐదు వేలు లంచం పుచ్చుకున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు బొల్లవేన రవి తన తాత కొమురయ్య పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తండ్రి మల్లయ్య పేరుమీద మార్పిడి చేయాలని ఆర్‌వోఆర్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. సర్వేనెంబర్ 766/డి1లో 3.16 ఎకరాల వ్యవసాయ భూమి బొల్లవేన కొమురయ్య పేరుమీద ఉంది. ఈ భూమిని తన తండ్రి మల్లయ్య పేరుమీదుగా ఆర్‌వోఆర్ ద్వారా విరాసత్ చేయాలని రవి ఆరునెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇందుకు రూ.15 వేలు ఇవ్వాలని వీఆర్వో గుమ్మడి రమేశ్ డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేమి లేక రూ. ఐదువేలు ఇస్తానని రవి విజ్ఞప్తి చేయడంతో రమేశ్ అంగీకరించాడు. దీనిపై రవి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో రవి వీఆర్వో రమేశ్‌ను కలిసి రూ.5 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా వీఆర్వో రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ కడారి భద్రయ్య విలేకరులకు తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వాసాల సతీశ్, క్రాంతికుమార్, పులి వెంకట్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories: