జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగుతేజాలు

-టాప్ టెన్‌లో ఆరుగురు మనోళ్లే రిజర్వుడ్ క్యాటగిరీలోనూ తెలుగు విద్యార్థులే నంబర్ వన్ -ఆలిండియా టాపర్‌గా పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్ -360 మార్కులకుగాను 337 మార్కుల స్కోర్ -బాలికల్లో మీనాల్ పరేఖ్‌కు ఫస్ట్ ర్యాంక్ -ఎస్టీ విభాగంలో హైదరాబాదీ ఆణిముత్యం జాటోత్ శివతరుణ్‌కు తొలి ర్యాంక్ -ఓబీసీ నాన్‌క్రీమీలేయర్ విభాగంలో విజయవాడకు చెందిన శివకృష్ణ మనోహర్‌కు ఫస్ట్ ర్యాంక్ -ఈ నెల 15 నుంచి ప్రవేశాల ప్రక్రియ -టాప్ టెన్‌లో ఆరుగురు మనోళ్లే.. -రిజర్వుడ్ క్యాటగిరీలోనూ తెలుగు విద్యార్థులే నంబర్‌వన్ -ఆలిండియా టాపర్‌గా ప్రణవ్ గోయల్.. బాలికల్లో మీనాల్ పరేఖ్‌కు ఫస్ట్ ర్యాంక్ -ఎస్టీ విభాగంలో హైదరాబాదీ ఆణిముత్యం జాటోత్ శివతరుణ్‌కు తొలి ర్యాంక్ -ఓబీసీ నాన్‌క్రీమీలేయర్ విభాగంలో శివకృష్ణ మనోహర్‌కు ఫస్ట్ ర్యాంక్
న్యూఢిల్లీ/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2018 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచూపారు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్ విభాగంలో, రిజర్వుడ్ క్యాటగిరీలో టాప్ ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ఆరింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. అన్ని క్యాటగిరీల్లో కలిపి టాప్-100 ర్యాంకుల్లో సుమారు 70 ర్యాంకుల్ని మనవాళ్లు కొల్లగొట్టారు. టాప్ ర్యాంకుల్ని రాష్ట్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు సాధించగా, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా అత్యుత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఆదివారం విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హర్యానాలోని పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్ అఖిల భారత స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మొత్తం 360 మార్కులకుగానూ ప్రణవ్ 337 మార్కులు స్కోర్ చేశాడు. రాజస్థాన్‌లోని కోటకు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకును, ఢిల్లీకి చెందిన కైలాస్ గుప్తా మూడో ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో రాజస్థాన్‌లోని కోటాకు చెందిన మీనాల్ పరేఖ్ 318 మార్కులతో తొలి స్థానం దక్కించుకున్నారు. ఎస్టీ విభాగంలో హైదరాబాద్ ఆణిముత్యం జాటోత్ శివ తరుణ్ తొలి ర్యాంకును కొల్లగొట్టారు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్ విభాగంలో తెలుగు విద్యార్థి విజయవాడకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు.

అలాగే తెలుగు విద్యార్థులు అన్ని క్యాటగిరీల్లో కలిపి జీవీ శ్రీవర్ధన్ 3వ ర్యాంకు, గట్టు సాయిభాస్కర్ 5వ ర్యాంకు, కంటె వినీష్ 6వ ర్యాంకు, కేవీఆర్ హేమంత్‌కుమార్ చౌడిపల్లి 7వ ర్యాంకు, ఎంఎల్ సాయివర్థన్ 9వ ర్యాంకు, ఎల్ శ్రీనాథ్ 10వ ర్యాంకు సాధించారు. ఎస్సీ క్యాటగిరిలో రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఆయుష్ కదమ్ తొలి ర్యాంకును సాధించారు. మే 20న దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.55 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 18,138 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2076 మంది బాలికలున్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో అన్ని ఐఐటీల్లో కలిపి 11,279 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జనరల్ క్యాటగిరిలో 8,794, ఓబీసీలో 3,140, ఎస్సీలో 4,709, ఎస్టీ కోటాలో 1,495 మంది అర్హత సాధించినట్లు ఐఐటీ కాన్పూర్ అధికారులు ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభచూపిన విద్యార్థులకు ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్ సహా దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ప్రవేశం కల్పిస్తారు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, బ్యాచిలర్ మాస్టర్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) తొలిసారిగా ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో రెండు దఫాలుగా నిర్వహించింది. ర్యాంకులకు సంబంధించిన వివరాల్ని అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపినట్టు అధికారులు చెప్పారు.

గిరిజన విద్యార్థి కార్తీక్‌కు 15వ ర్యాంకు

జేఈఈ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన బానోత్ వెంకటేశ్వర్లు, సుశీల కుమారుడు కార్తీక్ ఆల్‌ఇండియా స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. ఖమ్మంలోని శ్రీచైతన్య కళాశాలలో కార్తీక్ ఇంటర్ చదివాడు. అలాగే ఇదే కళాశాలకు చెందిన బుచ్చారావు-29వ ర్యాంకు, మిలీన-32వ ర్యాంకు సాధించారు. కృష్ణవేణి కళాశాలకు చెందిన కే దిలీప్-69వ ర్యాంకు, న్యూవిజన్ కళాశాలకు చెందిన భూక్యా వసంతి-86వ ర్యాంకు, రెజొనెన్స్ కళాశాలకు చెందిన క్రాంతికిరణ్-182వ ర్యాంకు, ఖమ్మం పీఆర్టీయూ నేత సోమ్లా కుమారుడు గిరిధర్-45వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను అభినందించాయి.

సత్తాచాటిన గురుకుల విద్యార్ధులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గురుకుల విద్యాలయాల విద్యార్థులు అన్నిపోటీ పరీక్షల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆదివారం విడు దలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాల్లో గురుకుల విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారు. గౌలిదొడ్డి ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థుల్లో బీ భాస్కర్ 449, చంద్రం రమేశ్ 567, రోహిత్‌రాజ్ 950, బీ భరత్ 1013, జే పాండు 262, డీ వినయ్ 1279, ఎం అశ్విన్ 1484, ఎస్ మధు 1812, కే కావ్య 2165వ ర్యాంకు సాధించారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను గౌలిదొడ్డి ఐఐటీ ప్రిన్సిపాల్ సత్యనారాయణరావు అభినందించారు.

15 నుంచి ఐఐటీ కౌన్సెలింగ్ ప్రారంభం

-ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీట్ల భర్తీకోసం ఏడు విడుతలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -15 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం -19న సీట్ల కేటాయింపునకు సంబంధించి తొలి నమూనా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ -24న సీట్ల నమూనా-2 వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ -25న రిజిస్ట్రేషన్‌తో పాటు అప్షన్ల ఎంపిక ప్రక్రియ ముగింపు -26న విద్యార్థుల అప్షన్లు, వివరాలు, సీట్ల వివరాల సవరణ -27న తొలి విడత సీట్ల కేటాయింపు -28 నుంచి 2 వరకు సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలలో రిపోర్టు చేయడం, వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ -జూలై 3న ఉదయం 10 గంటలకు మిగిలిన సీట్ల ప్రకటన. అదే రోజు సాయంత్రం 5 గంటలకు రెండో విడత సీట్ల కేటాయింపు -జూలై 6న మూడో విడుత సీట్ల కేటాయింపు, 9న నాల్గో విడుత, 12న ఐదో విడుత, 15న ఆరో విడుత, 18న ఏడో విడుత సీట్ల కేటాయింపు

జేఈఈలో మెరిసిన సూపర్-30 విద్యార్థులు

30 మందిలో 26 మందికి ర్యాంకులు ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో బీహార్‌కు చెందిన సూపర్-30 ఇన్‌స్టిట్యూట్ నుంచి 26 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి ఆశ్చర్యానికి గురిచేశారు. గణిత మాంత్రికుడు ఆనంద్‌కుమార్ 2002లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసుకుని జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించేలా ఆయన ఉచితంగా శిక్షణ ఇస్తారు. అభివృద్ధి జాడ కానరాని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పోటీపడుతుంటే నాకు ఎంతో సంతృప్తి కలుగుతుందని ఆనంద్‌కుమార్ చెప్పారు. గత 16 ఏండ్లలో ఆనంద్‌కుమార్ వద్ద శిక్షణ పొందిన దాదాపు 500 మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలు పొందారు.

Related Stories: