అమేథీ ఓట‌మిని అంగీక‌రించిన రాహుల్‌

హైద‌రాబాద్‌: యూపీలోని అమేథీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓడిపోయిన‌ట్లు రాహుల్ తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాతీర్పును గౌర‌విస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌చారంలో ప్ర‌జ‌ల ముందుకు వెళ్లాన‌ని, ఆ ప్ర‌జ‌లే ఇవాళ త‌మ తీర్పును వెలువ‌రించార‌న్నారు. ప్ర‌ధాని మోదీకి, బీజేపీకి కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు రాహుల్ తెలిపారు. అయితే ఎక్క‌డ లోపం జ‌రిగింద‌న్న‌ అంశంపై ఇవాళ చ‌ర్చించ‌లేమ‌ని ఆయ‌న చెప్పారు. మోదీయే ప్ర‌ధాని అని ప్ర‌జ‌లు నిర్ణ‌యించార‌ని, ఒక భార‌తీయుడిగా ఆ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాన‌న్నారు. అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓట‌మిపాలైన‌ట్లు రాహుల్ అంగీక‌రించారు. ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఓట‌మిని ఒప్పుకుంటున్న‌ట్లు తెలిపారు. అమేథీలో ఓడిన రాహుల్‌.. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి ల‌క్ష‌ల ఓట్ల‌ మెజారిటీతో నెగ్గారు.