కేంద్ర‌మంత్రిని చెంపదెబ్బ కొట్టిన యువ‌కుడు: వీడియో

థానే కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రామ్‌దాస్ అథవాలే రామ్ అథవాలేకు మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. థానేలోని అంబర్ పట్టణంలో శనివారం రాత్రి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగించిన తర్వాత వేదికపై నుంచి కిందికి దిగి వస్తుండగా ఓ వ్యక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఆయన ముఖంపై దాడి చేశారు. మంత్రిని వెనక్కి తోసేసి చేతితో చెంపపై కొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తర్వాత అక్కడే ఉన్న మంత్రి అనుచరులు దాడి చేసిన దుండగుడిని చితక్కొట్టారు. అతడు దాడి చేయడానికి గల కారణాలు తెలియలేదు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్త ప్రవీణ్ గోసావీగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతనిపై ఎఫ్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అథవాలే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాదరణ కలిగిన తనపై దాడి చేయాలని ఎవరో కుట్రచేశారని మంత్రి ఆరోపించారు. భద్రతా ఏర్పాట్లు సరిగ్గాలేవని.. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ కలుస్తానని.. దీనిపై విచారణ జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అథ‌వాలే అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. ఆ పార్టీ ప్రస్తుతం ఎన్డీయే స‌ర్కార్‌లో భాగస్వామిగా ఉన్న విష‌యం తెలిసిందే.

Related Stories: