నేరం.. పిల్లలచే టాయిలెట్స్ క్లీన్ చేయించారు

గుర్గావ్ : ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల చేత పని చేయించడం నేరమని విద్యాహక్కు చట్టం 2009 చెబుతుంది. కానీ ఈ చట్టాన్ని ఏ ఒక్కరూ అమలు చేయడం లేదు. సాక్షాత్తూ విద్యార్థులకు పాఠాలు బోధించే.. పాఠశాల ఉపాధ్యాయులే తుంగలో తొక్కుతున్నారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. గుర్గావ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏడేళ్ల విద్యార్థిని చేత టాయిలెట్స్ శుభ్రం చేయించడం వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం స్కూల్‌కు వచ్చిన విద్యార్థినులకు టీచర్లు పని చెప్పారు. టాయిలెట్స్‌లో దుర్వాసన వెదజల్లుతుంది.. వాటిని క్లీన్ చేయండి అంటూ టీచర్లు విద్యార్థులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు విద్యార్థినులు టాయిలెట్స్‌ను క్లీన్ చేశారు. ఇదే విషయాన్ని ఓ విద్యార్థిని(రెండో తరగతి) తన తల్లిదండ్రలకు చెప్పింది. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని విద్యార్థిని తండ్రి నిలదీశాడు. దీంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వీణ శర్మ స్పందించారు. పిల్లలచే టాయిలెట్స్‌ను శుభ్రం చేయించలేదని స్పష్టం చేశారు. మరో టీచర్ శోభ శర్మ మాట్లాడుతూ.. ఉదయం ప్రార్థన అయిపోయిన తర్వాత టాయిలెట్స్‌ను దుర్వాసన వస్తుండటాన్ని గమనించి.. కొంతమంది విద్యార్థినులకు పని చెప్పారు. దీంట్లో తప్పేముందని ప్రశ్నించారు. పరిశుభ్రత విషయంలో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. తమకు పూర్తిస్థాయి స్వీపర్ లేనందునే సమస్యలు వస్తున్నాయన్నారు. మొత్తానికి ఈ ఘటన విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. జిల్లా విద్యాధికారి ప్రేమ్ లత మాట్లాడుతూ.. పిల్లలచే టాయిలెట్స్ క్లీన్ చేయించిన ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం