కామన్ సిలబస్‌పై కసరత్తు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ కోర్సుల సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కసరత్తు మొదలుపెట్టింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కామన్ సిలబస్‌ను అమలుచేయడం ద్వారా దేశవ్యాప్తంగా యువతకు ఒకే రకమైన పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల మధ్య సిలబస్‌లో తేడాల కారణంగా జాతీయస్థాయి పోటీపరీక్షల్లో కొన్ని రాష్ట్రాలవారికే అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ప్రస్తుతమున్న మూస చదువుల విధానానికి స్వస్తిపలికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి కామన్ సిలబస్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో యూజీసీ చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో కామన్ సిలబస్‌ను తీసుకువచ్చింది. ఫలితంగా ఇంజినీరింగ్ కోర్సులు పూర్తిచేసినవారికి ఐటీ కంపెనీలు, ఇతర మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో కామన్ సిలబస్‌పై త్వరలో జాతీయస్థాయిలో వైస్‌చాన్స్‌లర్లతో సమావేశం ఏర్పాటుచేసి తుదినిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయని తెలిపారు.

Related Stories: