రేపే ఎస్‌ఐ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఎస్‌ఐ(సబ్ ఇన్‌స్పెక్టర్) రాత పరీక్షను ఈ నెల 26(ఆదివారం)న నిర్వహించనుంది. వివిధ డిపార్ట్‌మెంట్‌లలో కలిపి మొత్తం 1217 ఎస్‌ఐ పోస్టులకు రేపు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. 1,88,715 మంది అభ్యర్థులు ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతింబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్‌లో రెండు వైపులా వచ్చేలా ప్రింట్ అవుట్ తీసుకొని పాస్‌పోర్టు సైజ్ ఫోటోను సూచించిన డబ్బాలో గమ్‌తో అంటించాలని, పిన్నులు కొట్టవద్దని అధికారులు సూచించారు. ఎగ్జామ్ హాల్‌లోకి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ పరికరాలు, చేతి గడియారాలు, క్యాలికులేటర్స్, పర్సులను అనుమతించరు. బ్లూ లేదా బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్‌ను అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు చెప్పారు.

Related Stories: