దక్షిణ చైనా సముద్రం మాదే!

బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో మిస్సైల్ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని చైనా సమర్థించుకుంది. ఈ సముద్రంపై తమకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉన్నదని స్పష్టంచేసింది. యాంటీ షిప్ క్రూజ్ మిస్సైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్‌ను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. దీనిపై వ్యతిరేకత రావడంతో చైనా ఇలా స్పందించింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల విషయంలో చైనాతో పొరుగు దేశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్ ఫైట్ చేస్తున్నాయి. అయితే దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా వాదిస్తున్నది. స్పార్ట్‌లీ, దాని అనుబంధ దీవులపై చైనాకు పూర్తి అధికారం ఉంది అని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ స్పష్టంచేశారు. ఇదే స్పార్ట్‌లీ దీవుల్లో తమకూ హక్కు ఉందని వియత్నాం, తైవాన్ వాదిస్తున్నాయి. మా సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుకోవడానికే దక్షిణ చైనా సముద్రంలో చైనా క్షిపణి వ్యవస్థలను మోహరించింది. ఇది మా హక్కు. ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా చేస్తున్న పని కాదు. దీనిపై సంబంధిత దేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆమె అన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని మూడు ఔట్‌పోస్ట్‌లలో చైనా క్షిపణి వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు అంతకుముందే యూఎస్ మీడియా బయటపెట్టింది. గత నెల రోజుల వ్యవధిలోనే ఫియరీ క్రాస్ రీఫ్, సుబి రీఫ్, మిస్‌ఛీప్ రీఫ్‌లలో ఈ క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. గత ఏప్రిల్ నెలలో ఇదే దక్షిణ చైనా సముద్రంలో అతి పెద్ద డ్రిల్ నిర్వహించింది. ఈ సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రపంచానికి పరిచయం చేసింది.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య