అవమానం.. ఇంటి పార్టీకి మొండి చేయి

హైదరాబాద్ : మహాకూటమిలో తెలంగాణ ఇంటి పార్టీకి ఘోర అవమానం కలిగింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు సీట్లు కేటాయించినప్పటికీ ఇంటి పార్టీకి మాత్రం కోరుకున్న ఒక్క సీటును కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఇంటి పార్టీ ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తీరుపై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క తమను మహాకూటమిలోకి ఆహ్వానించారు. ఆహ్వానించి సీట్లు ఇవ్వకుండా అవమానించడంలో అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. తమ పార్టీకి ఒక సీటు కేటాయిస్తానన్న కుంతియా.. మొహం చాటేశారని పేర్కొన్నారు. తమను ఢిల్లీకి పిలిచి అవమానించారే తప్ప పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు హైదరాబాద్‌లో అమరవీరుల స్తూపం వద్ద దీక్షకు దిగుతామని ఆయన తెలిపారు. దీక్ష తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న చెరుకు సుధాకర్.. అవసరమైతే స్వతంత్రంగా బరిలో దిగుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు ఇవ్వాలని మొదట కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినప్పటికీ.. కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన లాబీయింగ్ వల్ల వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ స్థానాన్ని కేటాయించారు. నకిరేకల్ లింగయ్యకు ఇస్తే మహబూబ్‌నగర్ స్థానాన్ని కేటాయించాలని ఇంటి పార్టీ నేతలు కోరారు. ఆ స్థానం కూడా టీడీపీ అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు కేటాయించడంతో.. ఇంటి పార్టీ దిక్కు తోచని పరిస్థితిలో ఉండిపోయింది.

Related Stories: