వాట్సాప్‌కు భారత ప్రభుత్వం మరో వార్నింగ్!

న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం మరో హెచ్చరిక జారీ చేసింది. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. స్థానికంగా ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి.. నకిలీ వార్తల ప్రవాహానికి ఓ సాంకేతిక పరిష్కారాన్ని చూపించాలని సూచించింది. వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్‌తో కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం సమావేశమయ్యారు. దేశంలో విద్య, ఆరోగ్యం, కేరళకు సాయం విషయంలో వాట్సాప్ భాగస్వామ్యాన్ని తాను అభినందించినట్లు రవిశంకర్ చెప్పారు. అయితే అదే సమయంలో వాట్సాప్ వల్ల నేరాలు కూడా జరిగాయి. మూక దాడులు, ప్రతీకారాలు తీర్చుకోవడంలాంటి నేరాలు వాట్సాప్ కారణంగా జరుగుతున్నాయి. ఇవి కచ్చితంగా భారత చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. వీటికి అడ్డుకట్ట వేయడానికి ప్రధానంగా మూడు పాయింట్లను నేను సూచించాను అని ఆయన మీడియాకు వెల్లడించారు.

అందులో మొదటిగా భారత్‌లో ప్రత్యేకంగా వాట్సాప్ ఓ ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించాలి. రెండోది భారత చట్టాల గురించి వాట్సాప్‌కు పూర్తిగా తెలిసి ఉండాలి. ఇక మూడోది భారత డిజిటల్ స్టోరేజ్‌లో వాట్సాప్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నందున ఓ కార్పొరేట్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని వాట్సాప్ సీఈఓకు సూచించినట్లు రవిశంకర్ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా క్రిస్ డేనియల్స్ ఇండియాకు వచ్చారు. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి గత నెలలో వాట్సాప్ సీవోవోతోపాటు పలువురు ఉన్నతాధికారులు కేంద్ర సమాచార కార్యదర్శిని కలిశారు. ఇప్పటికే నకిలీ వార్తలకు చెక్ పెట్టడానికి ఫార్వర్డెడ్ మెసేజ్ లేబుల్‌తోపాటు ఇలాంటి మెసేజ్‌లను ఐదుగురి కంటే ఎక్కువ మందికి పంపే వీలు లేకుండా పరిమితి విధించిన విషయం తెలిసిందే.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య