చరిత్రాత్మకమైన తీర్పు.. 377పై సెలబ్రిటీల మాట ఇదీ!

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమా.. కాదా.. చాన్నాళ్లుగా జరుగుతున్న చర్చ ఇది. అయితే ఈ చర్చకు సుప్రీంకోర్టు తన చరిత్రాత్మకమైన తీర్పు ద్వారా తెరదించింది. స్వలింగ సంపర్కం నేరం కాదని కోర్టు తేల్చి చెప్పింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కులను శిక్షించలేదని సీజేఐ దీపక్ మిశ్రా స్పష్టంచేశారు. ఎల్‌జీబీటీ కమ్యూనిటీ హక్కులను సుప్రీంకోర్టు గౌరవిస్తుందని ఆయన అన్నారు. ఈ చరిత్రాత్మక తీర్పు వెలువడగానే పలువురు సెలబ్రిటీలు దీనికి మద్దతుగా ట్వీట్లు చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ నేత శశి థరూర్ తీర్పుపై స్పందించిన వాళ్లలో ఉన్నారు. వీళ్లంతా సుప్రీం తీర్పును స్వాగతించారు. సెక్షన్ 377పై తన వాదననే సుప్రీం కూడా వినిపించిందని, తనను వ్యతిరేకించిన బీజేపీ ఎంపీలు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇక వంద కిలోమీటర్లకోసారి సంస్కృతి మారిపోయే భారతదేశంలో భిన్నత్వాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉన్నదని, సెక్షన్ 377 రద్దు ఆ దిశగా ఓ ముందడుగేనని ప్రముఖ రచయిత చేతన్ భగత్ ట్విటర్‌లో అభిప్రాయపడ్డాడు. ఇక బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా దీనిపై ట్విటర్‌లో స్పందించాడు. ఇది చరిత్రాత్మకమైన తీర్పు.. చాలా గర్వంగా ఉంది. దేశానికి మళ్లీ ఆక్సిజన్ అందడం ప్రారంభమైందని కరణ్ అన్నాడు. నటుడు ఆయుష్మాన్ ఖురానా స్పందిస్తూ.. రిప్ 377 అంటూ ట్వీట్ చేశాడు.

Related Stories: