మాల్యాను ఇందులోనే ఉంచుతాం చూడండి.. లండన్ కోర్టుకు జైలు వీడియో

లండన్: బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లికర్ కింగ్ విజయ్ మాల్యాను ఉంచబోయే జైల్లోని సెల్ వీడియోను లండన్ కోర్టు ముందు ఉంచింది సీబీఐ. ముంబై ఆర్థర్ రోడ్ జైల్లోని బరాక్ నంబర్ 12కు సంబంధించిన వీడియో అది. మాల్యాను ఉంచబోయే సెల్‌లో టీవీ, వెస్టర్న్ టాయిలెట్, బెడ్, వాషింగ్ ఏరియా, బయట తిరిగే ప్రదేశం, తగినంత సూర్యకాంతి.. ఇలా అన్నీ ఉన్నాయని చెప్పేలా ఆ వీడియో రూపొందించారు. 6 నిమిషాల నిడివి గల వీడియో ఇది. జైల్లో ఉన్న వసతులను ఇందులో చూపించారు. ఇండియన్ జైళ్లలో సూర్య కాంతి పడదని, స్వచ్ఛమైన గాలి లోనికి రాదు అని మాల్యా ఫిర్యాదు చేయడంతో లండన్ కోర్టు జైలుకు సంబంధించిన వీడియో ఇవ్వాలని భారత అధికారులను ఆదేశించింది.

దీంతో సీబీఐ అధికారులు ఈ వీడియోను రూపొందించి కోర్టుకు సమర్పించారు. మాల్యాను ఉంచబోయే బరాక్ తూర్పుముఖంగా ఉన్నదని, దీంతో సూర్యకాంతి బాగా పడుతుందని కూడా అధికారులు చెప్పారు. ఇక ఈ జైల్లో భద్రత కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ మధ్యే కేంద్ర హోంశాఖ జైల్లో నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్‌ను కూడా కోర్టుకు అందజేశారు. జైల్లో నాలుగుసార్లు ఆహారం ఇస్తారని కూడా చెప్పారు. ఆర్థర్‌రోడ్ జైల్లోని బరాక్ 12లో కాస్త హై ప్రొఫైల్ ఉన్న ఖైదీలను ఉంచుతారు.

× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం