మద్దతు ధరకు పీఎం-ఆశ

-ప్రధానమంత్రి అన్నదాత సంరక్షణ్ అభియాన్ పేరిట కొత్త విధానం -రూ.15,053 కోట్ల కేటాయింపు -నష్ట పరిహారం చెల్లించే పథకాలను రాష్ర్టాలు ఎంపిక చేసుకొనే అవకాశం -ఇథనాల్ ధర 25 శాతం పెంపు -కేంద్రమంత్రివర్గ నిర్ణయాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.15,053 కోట్లతో పంట ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ప్రకటించింది. రైతులకు పరిహారం చెల్లించేందుకు ఒక పథకాన్ని ఎంపిక చేసుకోవడంతోపాటు ధాన్యం సేకరణలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే అవకాశాన్ని రాష్ర్టాలకు కల్పించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా దిగువకు నూనె గింజల రేట్లు పడిపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లించే కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్పీకి దిగువకు పంట ఉత్పత్తుల రేట్లు పడిపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లించేందుకు అమలు చేస్తున్న పలు పథకాలలో ఒకదానిని ఎంపిక చేసుకొనే అవకాశం రాష్ర్టాలకు కల్పించారు. అలాగే ధాన్యం సేకరణలో ప్రైవేటు సంస్థలను అనుమతించనున్నారు.

కొత్త విధానం ప్రధానమంత్రి అన్నదాత సంరక్షణ్ అభియాన (పీఎం-ఆశ)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తుల ధరలు ఎంఎస్పీ కన్నా దిగువకు పడిపోయినప్పుడు రాష్ర్టాలు రైతులకు పరిహారం చెల్లించేందుకు పీఎం-ఆశ కింద మూడు పథకాల నుంచి ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. అవి ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్), కొత్తగా రూపొందించిన ధరల లోటు చెల్లింపు పథకం (పీడీపీఎస్), పైలట్ ప్రాతిపదికన అమలయ్యే ప్రైవే టు సేకరణ స్టాకిస్టు పథకం (పీపీపీఎస్). రెండేండ్ల పాటు పీఎం-ఆశ అమలు కోసం ప్రభుత్వం రూ. 15,053 కోట్లను మంజూరు చేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ చెప్పారు. పంట ఉత్పత్తుల సేకరణ సంస్థలకు ఇచ్చే రుణ పరిమితిని మరింత పెంచామని తెలిపారు. మరో రూ.16,550 కోట్లకు ప్రభుత్వం గ్యారంటీని ఇచ్చేందుకు అంగీకరించిందని, దీంతో పంట ఉత్పత్తుల సేకరణకు కేటాయించిన మొత్తం వ్యయం రూ.45,550 కోట్లకు చేరిందని మంత్రి చెప్పారు. పీఎం-ఆశ కింద అమలు చేయనున్న మూడు పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.పీఎస్‌ఎస్: పప్పు దినుసులు, నూనెగింజలు, కొబ్బెరను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర సంస్థలు సేకరిస్తాయి. సేకరణ వ్యయం, సేకరణ వల్ల కలిగే నష్టాలను కేంద్రం 25 శాతం వరకు భరిస్తుంది.

పీడీపీఎస్: ఈ పథకం కింద హోల్‌సేల్ మార్కెట్‌లో నెల రోజుల నూనెగింజల సగటు ధరకు, ఎంఎస్పీకి మధ్యనున్న లోటును ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. దీనిని రాష్ట్రంలో ఉత్పత్తి అయిన నూనెగింజల్లో 25 శాతం ఉత్పత్తికికి మాత్రమే వర్తింపచేస్తారు. పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన ఎనిమిది జిల్లాల్లో రాష్ర్టాలు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నూనె గింజల సేకరణకు ఈ పథకాన్ని అమలు చేయవచ్చు.

పీపీపీఎస్: ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రైవేటు సంస్థల ప్రమేయం కేవలం నూనెగింజలకు మాత్రమే పరిమితం అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. వంట నూనెల దిగుమతిని తగ్గించే క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇథనాల్ ధర 25 శాతం పెంపు

చక్కెర రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర క్యాబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ధరను 25 శాతం పెంచుతున్నట్టు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.47.13కు లభిస్తున్న లీటర్ ఇథనాల్ ఇకపై రూ.59.13కు పెరుగనుంది. దీంతో చక్కెర మిల్లులు చక్కెర ఉత్పత్తి నుంచి ఇథనాల్ ఉత్పత్తి దిశగా మారే అవకాశం ఏర్పడింది. ఇటీవల చెరుకు ఉత్పత్తి భారీగా పెరిగిపోవడంతో చక్కెర పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2022 నాటికి పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నిర్ణయం ఇటు చక్కెర రైతులకు, అటు చక్కెర మిల్లులకు లాభదాయకంగా ఉండగలదని, చమురు దిగుమతులను తగ్గించుకొనేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు.

13వేల కిలోమీటర్ల రైలుమార్గం విద్యుదీకరణ

దేశంలో 13వేల కిలోమీటర్లకు పైగా మిగిలి ఉన్న రైలు మార్గాల విద్యుదీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాడ్‌గేజ్ మార్గాల్లోని 108 సెక్షన్లలో 13,675 కిలోమీటర్ల రైలు మార్గాన్ని విద్యుదీకరణ చేయాల్సి ఉంది. దీనికి రూ.12,134.5 కోట్లు కేటాయించారు. రైలుమార్గాల విద్యుదీకరణ పనులు 2021-22నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. దేశంలోని అన్ని మార్గాల్లో విద్యుదీకరణ జరిగితే హైస్పీడ్ డీజిల్ వినియోగం 283 కోట్ల లీటర్ల మేరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా కర్బన ఉద్గారాల శాతం సైతం గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం మూడింట రెండు వంతుల గూడ్స్ రైలుమార్గాలు, సగం ప్యాసింజర్ రైళ్లు విద్యుత్ ఆధారంగా నడుస్తున్నాయి. సంపూర్ణ విద్యుదీకరణ అనంతరం రైల్వేలకు వార్షికంగా ఇంధన వ్యయం ఏటా రూ.13,510 కోట్ల మేర తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) చట్టం, 2014ను సవరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చట్టం పరిధిలోకి మరో నాలుగు కేంద్రాలను చేర్చి, వాటికి జాతీయ ప్రాధాన్యతను కల్పించనున్నారు. చట్ట సవరణలో ఎన్‌ఐడీ విజయవాడ పేరును ఎన్‌ఐడీ అమరావతిగా మార్చనున్నారు.

Related Stories: