గ్రీన్‌కార్డ్ స్థానంలో బిల్డ్ అమెరికా వీసా

-మెరిట్ పాయింట్ల ఆధారంగా అమెరికా వలస విధానం -గ్రీన్‌కార్డ్ స్థానంలో బిల్డ్ అమెరికా వీసా -స్కిల్డ్ వర్కర్ల కోటా 57 శాతానికి పెంపు -ఆంగ్ల నైపుణ్యం, పౌరశాస్త్ర పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి -నూతన విధానాన్ని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ -భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనకరం
వాషింగ్టన్, మే 17: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ వలస విధానంలో నూతన సంస్కరణలకు తెరతీశారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత వలస విధానానికి బాటలు పరిచారు. ప్రస్తుతమున్న గ్రీన్‌కార్డుల స్థానంలో బిల్డ్ అమెరికా వీసాలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే యువ, నిపుణులైన ఉద్యోగుల కోటాను గణనీయంగా పెంచారు. 12 నుంచి 57 శాతానికి పెంచడమే కాకుండా ఆ కోటాను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ట్రంప్ ప్రకటించిన నూతన వలస విధానంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం కలుగనుంది. శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో శుక్రవారం నూతన వలస విధానంపై ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించడంలో, ఉన్నవారిని నిలుపుకోవడంలో ప్రస్తుత వలస విధానం విఫలమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతిభ ఆధారిత విధానానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆంగ్లం, పౌరశాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతోపాటు వయసు, ప్రావీణ్యం, ఉద్యోగావకాశాలు, సివిక్ సెన్స్‌లకు పాయింట్లు కేటాయించడం ద్వారా శాశ్వత చట్టబద్ధ నివాసానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మేధావులు, ప్రతిభావంతులపై మనం వివక్ష చూపాం. ఇకపై చూపబోం. ఈ బిల్లుకు వీలైనంత త్వరగా ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. దీనికి ఆమోదం లభించాక, ఈ అసాధారణమైన విద్యార్థులు, ఉద్యోగులు అమెరికాలోనే ఉంటూ, వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

స్కిల్డ్ వర్కర్ల కోటా పెంపు..

ప్రస్తుత విధానంలో ఉన్న పనికిమాలిన నిబంధనల కారణంగా వార్షిక గ్రీన్‌కార్డులన్నీ తక్కు వ వేతనం, తక్కువ నైపుణ్యం కలిగినవారికే వెళ్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అత్యంత దీనస్థితిలో ఉన్న అమెరికన్లతో వారు ఉద్యోగాలకు పోటీపడడంతో సామాజిక భద్రత, సంక్షే మ పథకాలపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. విదేశీయులకు అమెరికాలో శాశ్వత చట్టబద్ధ నివాసం కోసం అమెరికా ఏటా సుమారు 11 లక్షల గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నది. డైవర్సిటీ వీసా, కుటుంబ సంబంధాల ఆధారంగానే వీటిలో చాలావరకు జారీ చేస్తున్నారు. నిపుణులైన ఉద్యోగులకు చాలా తక్కువ కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నూతన విధానాన్ని ప్రకటించారు. దీంతో వేలమంది భారత ఐటీ నిపుణులు, ప్రతిభ కలిగిన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఏటా జారీచేసే గ్రీన్‌కార్డుల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయడం లేదు. trump1

పాయింట్ల విధానం..

అమెరికాలో ప్రవేశానికి ర్యాండమ్ విధానానికి బదులు సులభ, సార్వత్రిక విధానాన్ని అమలుచేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతమున్న గ్రీన్‌కార్డ్ క్యాటగిరీల స్థానంలో బిల్డ్ అమెరికా వీసాను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కెనడా, ఇతర దేశాలు అవలంబిస్తున్న పాయింట్ల ఆధారిత విధానాన్ని తమ వద్ద కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. యువ ఉద్యోగిగా ఉండడం ద్వారా మీరు ఎక్కువ పాయింట్లు పొందుతారు. ఎందుకంటే సామాజిక భద్రతకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి. అత్యున్నత నైపుణ్యాలు (ఉద్యోగ అవకాశం, ఉన్నత విద్య, ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక) కలిగి ఉన్నందుకు మీకు ఎక్కువ పాయింట్లు లభిస్తాయి అని ఆయన వివరించారు. ఇక సమగ్రత, సమానత్వం, జాతీయ ఐక్యతలను ప్రోత్సహించడంలో భాగంగా అమెరికా వచ్చే వలసదారులు ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే అడ్మిషన్‌కు ముందు పౌరశాస్త్ర పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది అని ట్రంప్ తెలిపారు. వలస విధానంలో సంస్కరణలు ఆహ్వానించదగ్గ పరిణామమని కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ వ్యాఖ్యానించారు. సెనేట్ మైనారిటీ నాయకుడు చుక్ స్కమర్ మాత్రం అది పొలిటికల్ డాక్యుమెంట్ అని విమర్శించారు.

అమెరికా ప్రభుత్వంపై ఐటీ కంపెనీ దావా

నిపుణుడైన భారత ఉద్యోగికి హెచ్1బీ వీసాను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సిలికాన్ వ్యాలీకి చెందిన ఐటీ కంపెనీ ఎక్స్‌టెర్రా సొల్యూషన్స్ అమెరికా ప్రభుత్వంపై దావా వేసింది. బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్‌గా తాము నియమించుకున్న చంద్రసాయి వెంకట అనిశెట్టికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అక్రమంగా హెచ్1బీ వీసాను నిరాకరించిందని డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయనకు ఇచ్చే ఉద్యోగం హెచ్1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాదన్న కారణంతో వీసా నిరాకరించారని పేర్కొంది.