బౌద్ధ దేశంలో.. ఈస్ట‌ర్ ర‌క్త‌పాతం

హైద‌రాబాద్‌: శ్రీలంక‌.. ఓ బౌద్ధ దేశం. తీర‌వాడ బౌద్దం .. ఇక్క‌డ అతిపెద్ద మ‌తం. ఆ దేశ జ‌నాభాలో 70.2 శాతం తీర‌వాడ బౌద్ధులే. శ్రీలంక సింహలీల మెజారిటీ మ‌తం ఇదే. ఆ దేశ చ‌ట్టాల్లో బౌద్ధ మ‌తానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. రాజ్యాంగంలోనూ ఆ మ‌తానికి లోబ‌డే నియ‌మాలు ర‌చించారు. శ్రీలంక‌లో హిందుచ‌వులు 12.6 శాతం. ముస్లింలు 9.7 శాతం ఉన్నారు. శ్రీలంక‌లో 15 లక్ష‌ల మంది క్రైస్త‌వులు కూడా ఉన్నారు. ఇది 2012 జ‌నాభా లెక్క‌ల స‌మాచారం. ఆ క్రైస్తవుల్లో ఎక్కువ శాతం మంది రోమ‌న్ క్యాథ‌లిక్కులే. ఇక ఈస్ట‌ర్ వేడుక‌ల్లో మునిగిన క్రైస్త‌వులకు ఆ సంబ‌రాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇవాళ ఆత్మాహుతి బాంబ‌ర్లు మూడు చ‌ర్చిల‌ను టార్గెట్ చేశారు. ఆ పేలుళ్ల‌లో సుమారు 200 మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయారు. బౌద్ధ స‌న్యాసుల‌కు ప్రాధాన్యం ఉన్న దేశంలో.. ఈస్ట‌ర్ వేడుక‌ల సంద‌ర్భంలో.. ఇస్లామిక్ తీవ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ‌డం శోచ‌నీయంగా మారింది. ఇటీవ‌ల శ్రీలంక.. అంత‌ర్యుద్ధంతో స‌త‌మ‌త‌మైంది. వాస్త‌వానికి 2009లోనే ఆ దేశంలో అంత‌ర్యుద్ధం ముగిసింది. అయితే ఆ త‌ర్వాత చెదురుమొదురు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. సింహాలీ వ‌ర్గానికి చెందిన బౌద్ధులు.. మ‌సీదులు, ముస్లింల‌కు సంబంధం ఉన్న ప్రాప‌ర్టీల‌పై దాడులు చేస్తూ వ‌స్తున్నారు. ఆ కార‌ణంగానే.. 2018లో ఓ ద‌శ‌లో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించాల్సి వ‌చ్చింది. త‌మిళ టైగ‌ర్లు ఓడిన త‌ర్వాత శ్రీలంక‌లో అంత‌ర్యుద్ధం ముగిసింది. మైనార్టీ త‌మిళ తెగ‌ల‌కు స్వతంత్ర్య దేశం కావాల‌ని సుమారు 26 ఏళ్లు పోరాటం చేశారు. ఆ యుద్ధంలో సుమారు 80వేల మంది వ‌ర‌కు మ‌ర‌ణించి ఉంటారు. అంత‌ర్యుద్ధం నుంచి తేరుకున్న శ్రీలంక‌లో.. ఇప్పుడు ఈస్ట‌ర్‌పూట ఏడు చోట్ల పేలుళ్లు చోటుచేసుకోవ‌డం దారుణం. మూడు చ‌ర్చిలు.. మూడు హోట‌ళ్లతో పాటు ఓ జూ వ‌ద్ద కూడా పేలుళ్లు జ‌రిగాయి.

Related Stories: