నవంబర్‌లో బుద్ధవనం ప్రారంభానికి ఏర్పాటు

నందికొండ : నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేస్తున్న బుద్ధవనంలో ( శ్రీ పర్వతారామం) మొదటి దశ పనులు పూర్తి అయినందున నవంబర్‌లో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. హిల్‌కాలనీలోని బుద్ధవనంను ఆయన సందర్శించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బుద్ధవనంలో మొదటి దశలో చేపట్టిన జాతకపార్కు, స్థూపపార్కు, ధ్యానవనం, బుద్ధచరితవనం, మహాస్థూపపార్కు పనులు పూర్తయ్యాయన్నారు. రెండో దశలో అంతర్జాతీయ బౌద్ధమత అధ్యయన, ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అమెరికా, చైనా, మలేషియా దేశాల నుంచి విశ్వవిద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. మలేషియాకు చెందిన సంస్థ 56 అంతస్తులతో సుమారు రూ.200 కోట్లతో మహాబోధి నిర్మాణ శైలిలో విశ్వవిద్యాల నిర్మాణానికి, లీకోలోటాస్ సంస్థ హోటల్ నిర్మాణానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తయితే బుద్ధవనం ఒక అద్భుత ప్రాంతంగా విరాజిల్లుతుందన్నారు. ఆయన వెంట బుద్ధవనం ఓఎస్‌డీ సుధాన్‌రెడ్డి, ఎస్‌ఈ అశోక్, డీఈ జగదీష్, సహాయక శిల్పి శ్యామ్‌సుంధర్, గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Related Stories: