ఇక ఆటుపోట్లే

గతవారం మార్కెట్‌పై బేర్స్ పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మూడు శాతం పైగా నష్టపోయాయి. రూ. 5.60 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద నాలుగురోజుల్లోనే హరించుకుపోయింది. శుక్రవారం నాడు యెస్ బ్యాంక్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ల భారీ పతనం మొత్తం మార్కెట్‌సెంటిమెంట్‌నే దెబ్బతీసింది. యెస్‌బ్యాంక్‌లోనూ కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలున్నాయన్న వార్తలు, డీహెచ్‌ఎఫ్‌ఎల్ రుణ పత్రాల అమ్మకం అంశాలు మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అమ్మకాలు భారీ స్థాయిలోజరిగాయి. దాదాపు అన్నిరంగాల షేర్లూ కుప్పకూలాయి. మిడ్‌క్యాప్, స్మాల్ షేర్లలో పతనం మరీ ఎక్కువగా ఉంది. కాగా, మే నుంచి ఆగస్టు వరకు వచ్చిన ర్యాలీలో దాదాపు సగానికిపైగా ఈ నెలలో హరించుకు పోయింది. కనీస స్థాయిల నుంచి శుక్రవారం నాడు కోలుకున్నా నాలుగేండ్ల తర్వాత అత్యధిక భారీ స్థాయిలో 500 పాయింట్ల మేర హెచ్చుతగ్గులు నమోదు అయ్యాయి.

ఈ వారం ప్రభావితం చేసే అంశాలు.

ఈవారంలోనే సెప్టెంబర్ డెరివేటివ్ సీరిస్ ముగింపు గురువారం నాడు. దాని కన్నా ముందు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమీక్షా సమావేశం ఉంది. ఈ సమావేశంలో వడ్డీరేట్లను పెంచవచ్చునన్న అంచనాలున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లను పెంచితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరణ వేగం పెంచుతారన్న అంచనాలున్నాయి. అలాగే ఆగస్టునెలకు గాను ద్రవ్యలోటు వివరాలు కూడా ఈవారంలోనే వెలువడనున్నాయి. ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ డేటా ప్రాధాన్యత చేకూరింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ డిఫాల్ట్, డీహెచ్‌ఎఫ్‌ఎల్ బాండ్లను డీఎస్‌పీ మ్యూచువల్ అమ్మడం వంటి కారణాలతో శుక్రవారం నాడు మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో వీటికి సంబంధించిన పరిణామాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. మరో వైపు యెస్ బ్యాంక్ వ్యవస్థాపక సీఈవో రాణాకపూర్ పదవీకాలం పొడగింపుపై వస్తున్న వార్తలూ ప్రాముఖ్యతను సంతరించుకోన్నాయి. ఇదిలా వుండగా, రూపాయి మారకం విలువ, క్రూడాయిల్ ధరలూ, గ్లోబల్ ట్రేడ్ వార్ పరిణామాలు అన్నీ మార్కెట్‌మీద ప్రభావం చూపించే అంశాలే. వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో కూడా మార్కెట్ సందిగ్ధానికి లోను కావచ్చు. ఆటు పోట్లు పెరగనున్నాయి. భారీ ఒడిదుడుకులు ఇక నుంచి సర్వసా ధారణం కానున్నాయి. ప్రతివార్తకూ అతి స్పందించే పరిస్థితిలో మార్కెట్ ఉంది.

ఎఫ్‌పీఐల ఉపసంహరణ

సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు రూ.15,365 కోట్ల (200 కోట్ల డాలర్లు) పెట్టుబడులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు విరమించుకున్నారు. పెరిగిపోతున్న కరెంట్ ఖాతా లోటుకు తోడు గ్లోబల్ ట్రేడ్‌వార్ భయాలతో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. తాజా డిపాజిటరీ డేటా ప్రకారం సెప్టెంబర్ 3 నుంచి 21 తేదీల మధ్య ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.6,832 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోగా రుణ మార్కెట్ నుంచి రూ.8,533 కోట్లను విరమించుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో మొత్తం రూ.8,500 కోట్లను మదుపు చేసిన ఎఫ్‌పీఐలు ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో మొత్తం రూ.61,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. చమురు ధరల్లో పెరుగుదల, రూపాయి మార కం విలువ పతనం, జీఎస్టీ వసూళ్లు తగ్గడం, ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోలేకపోవడం వంటి కారణాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు.

టాప్ 10లో 7 డీలాటీసీఎస్ జోరు

గత వారం మార్కెట్ మూడు శాతానికిపైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5.6 లక్షల కోట్లు ఆవిరి అయింది. కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో అగ్రస్థానంలో ఉన్న పది కంపెనీల్లో ఏడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ. 89,779 కోట్ల మేర హరించుకుపోయింది.టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ మినహా మిగతా ఏడు కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా క్షీణించింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ గరిష్ఠంగా రూ.22,530.89 కోట్ల మేర నష్టపోయింది. ఎస్‌బీఐ రూ.18,161.51 కోట్లు, మారుతి రూ.17,922.23, హెచ్‌డీఎఫ్‌సీ రూ.13,524.5 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 12,624.11 కోట్లు , ఐటీసీ రూ.3,178.08, హింద్‌యూనీలీవర్ రూ.1,837.39 కోట్ల మేర మార్కెట్ క్యాపిటలైజషన్లు తగ్గిపోయాయి. కాగా, టీసీఎస్ కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేయడం మార్కెట్‌క్యాప్ రూ.15,506.65 కోట్లు పెరిగి రూ.8.05 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో మార్కెట్‌క్యాప్ ప్రాతిపదికన టీసీఎస్ నంబర్‌వన్ స్థానంలో ఉంది.

టెక్నికల్స్: 11,350-10,860 మధ్య స్థిరీకరణ

గతవారపు పతనం అనేక బేరిష్ సంకేతాలను ఇచ్చింది. శుక్రవారం గ్యాప్ అప్‌లో ప్రారంభం అయిన నిఫ్టీ 50 డీఎంఏ వద్ద గటి నిరోధాన్ని ఎదుర్కొని పతనం అయింది. అలాగే గత మార్చి నుంచి ఆగస్టు వరకూ వచ్చిన మొత్తం 1200 పాయింట్ల ర్యాలీలో సరిగ్గా 50 శాతం రీట్రేస్‌మెంట్‌స్థాయి వద్ద కనీస స్థాయి నమోదు అయింది. అలాగే మే నెల నుంచి వచ్చిన ర్యాలో 61.8 రీట్రేస్‌మెంట్ జరిగింది. వచ్చే కొన్ని రోజుల పాటు శుక్రవారం నమోదు అయిన కనీస స్థాయి 10,866 కీలకం కానుంది. గత వారపు పతనాన్ని జీర్ణించుకునే క్రమంలో ఈ వారం కన్సాలిడేషన్ జరగడానికే అవకాశాలు ఎక్కువ. అయితే షార్ప్ బౌన్స్‌లు కూడా వచ్చే అవకాశం ఉంది. 11,350 స్థాయిలో మరోసారి నిరోధం ఎదురవుతున్నది. మళ్లీ 10,866 స్థాయిని దిగిపోతే మార్కెట్ మరింత బలహీనపడుతుంది. స్వల్పకాలిక ఒడిదుడుకుల్లో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు తక్కువ. బాగా పడిపోయిన షేర్లను కొనుగోలు చేయాలన్న ఆలోచనను విరమించుకోండి.

మార్కెట్‌పై కన్నేశాం: సెబీ-ఆర్బీఐ

దేశీయ స్టాక్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైతే తగిన చర్యలకు సిద్ధమని సెబీ, ఆర్బీఐ ఆదివారం స్పష్టం చేశాయి. గత శుక్రవారం ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే సెబీ, ఆర్బీఐలు పైవిధంగా స్పందించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కలిసి ఆర్థిక మార్కెట్లలో ఇటీవలి పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. అవసరమైతే తగిన చర్యలను తీసుకునేందుకు మేము సిద్ధం అని వేర్వేరు ప్రకటనల్లో అటు సెబీ, ఇటు ఆర్బీఐ పేర్కొన్నాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) ఒకానొక దశలో ఏకంగా 1,127.58 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే. చివరకు 279.62 పాయింట్ల నష్టంతో ముగిసింది. గత వారం వరుసగా నాలుగు రోజులపాటు నష్టాలకే పరిమితమైన సూచీ రూ.5.6 లక్షల కోట్ల మదుపరుల సంపదను మింగేసింది. సోమవారం ట్రేడింగ్‌లో కూడా మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు ఉండవచ్చన్న అంచనాల మధ్య సెబీ, ఆర్బీఐలు ఈ ప్రకటనల్ని విడుదల చేశాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) గురించి మదుపరులలో భయాలు ఆవహించాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి ఆర్థికంగా బాసటగా నిలుస్తామని ఎస్‌బీఐ చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.