వధువు వాట్సాప్ వ్యసనం.. ఆగిన వివాహం

-మితిమీరి వాట్సాప్ వాడుతున్నదని పెండ్లివద్దన్న వరుడి కుటుంబం -చివరి నిమిషంలో ఆగిన పెండ్లి .. యూపీలో ఘటన
మీరట్: ఓ వధువుకు ఉన్న వాట్సాప్ వినియోగించే మితిమీరిన అలవాటు ఆమె పెండ్లిని ఆపేసింది. వాట్సాప్ అలవాటును వ్యసనంగా మార్చుకున్న అమ్మాయి మాకొద్దు అంటూ వరుడి కుటుంబసభ్యులు చివరి నిమిషంలో తేల్చిచెప్పేశారు. దీంతో పెండ్లి కుమార్తె కుటుంబం షాక్‌కు గురైంది. వివాహానికి హాజరైన బంధుగణం నివ్వెరపోయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్నది. అయితే, ఇదంతా అదనపు కట్నం కోసమేనని వధువు కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదుచేశారు. అమ్రోహ జిల్లాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడితో నౌగాన్ సాదత్ ప్రాంతానికి చెందిన వధువుకు వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ నెల 5న పెండ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పెండ్లి సమయం దగ్గరపడడంతో అంతా వరుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు.

ఇంతలోనే ఫోన్‌చేసిన వరుడి తండ్రి.. ఈ పెండ్లి తమకు ఇష్టంలేదని తేల్చిచెప్పారు. వధువు ఎక్కువగా వాట్సాప్‌ను వినియోగించడం తమకు నచ్చలేదని, ఇలాంటి యువతి పెండ్లి అయ్యాక తమనేం పట్టించుకుంటుందని చెప్పారు. షాక్‌కు గురయిన వధువు కుటుంబసభ్యులు ఈ ఆరోపణలను ఖండించారు. కట్నం కోసం డిమాండ్ చేసేందుకే చివరి నిమిషంలో పెండ్లి వద్దన్నారని పేర్కొన్నారు. అదీకూడా తాను ఫోన్ చేస్తేనే చెప్పారని, కట్నంగా రూ.65 లక్షలు డిమాండ్ చేశారని పెండ్లి కుమార్తె తండ్రి ఉరోజ్ మెహందీ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడి కుటుంబసభ్యులపై కేసు నమోదుచేశారు.

Related Stories: