శాంతి భద్రతల్లో రాష్ట్రం నం.1

-కేటీఆర్‌ను బద్నాం చేయడానికే కుట్ర -హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాంతిభద్రతలు కాపాడే విషయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని.. ఇందులో ఎవరికీ సందేహం అవసరం లేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నేరెళ్ల ఘటనలో ప్రభుత్వం ముందస్తు చర్యలతో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చిందని స్పష్టం చేశారు. కేవలం సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ కావడం వల్లే, ఆయనను బద్నాం చేయడానికి విపక్ష నేతలు కుట్రలు పన్నారని, ఈ కుట్రలను సమర్థంగా ఎదుర్కొన్నామని మంత్రి చెప్పారు. సోమవారం శాసనమండలిలో కాంగ్రెస్ సభాపక్ష నేత షబ్బీర్‌అలీ, సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి , బీజేపీ సభ్యుడు రాంచంద్రరావు దళితులపై దురాగతాల గురించి అగిడిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ఇసుకలారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి చనిపోగా ఉద్రిక్తతలు చెలరేగి ఇసుక లారీని, పక్కనే ఉన్న మరో 4 లారీలను స్థానికులు తగులబెట్టారని తెలిపారు. జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని అల్లర్లను నియంత్రించారని తెలిపారు. పోలీసులపై దాడి, ఇతర విధ్వంస ఘటనలపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో 8మందిపై కేసులుంటే వారిలో ముగ్గురు ఎస్సీలు, ఐదుగురు ఇతరులని మంత్రి పేర్కొన్నారు. నేరేళ్ల ఘటనపై విచారణచేసి అక్కడ ఉన్న ఎస్సై రవీందర్‌ను మరికొందరు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. నాయిని సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

భూ రికార్డుల ప్రక్షాళన సాగుతున్నది

ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేస్తున్నదని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ముందుగా ఉన్న రికార్డులను అప్‌డేట్ చేసి ఆ తర్వాత వివాదాలపై దృష్టి పెడుతామన్నారు.

పశుసంవర్ధక శాఖలో ఖాళీలు భర్తీ చేస్తున్నాం

పశుసంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మండలిలో సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, భూపాల్‌రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి , కాంగ్రెస్ సభ్యులు షభ్బీర్ అలీ, బీజేపీ సభ్యుడు రాంచంద్రరావు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 159 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు ,541 వెటర్నరీ అసిస్టెంట్లు, 31 వెటర్నరీ డాక్టర్లను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 26 లక్షల గొర్రెలను అందించడమే కాకుండా వాటి సంరక్షణకు సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 100 నియోజకవర్గాలకు సంచార క్లినిక్‌లను ఏర్పాటుచేశామని వివరించారు. ప్రస్తుతం 2,100 దవాఖానలకు అదనంగా త్వరలో కొత్తవి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు

నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు. మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సభ్యుడు కర్నె ప్రభాకర్ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకల దవాఖాన ఉండాలని, నల్లగొండలో 550 పడకల దవాఖాన, సూర్యాపేటలో 300 పడకల వైద్యశాలకు అనుమతి ఉందని చెప్పారు. బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో కొత్త కాటేజీలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వాటి మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.

ప్రతేక ప్రస్తావనలకు న్యాయం జరుగాలి

ప్రత్యేక ప్రస్తావనల కింద లేవనెత్తిన పలు ప్రశ్నలకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ స్వామిగౌడ్‌ను మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి కోరారు. మండలిలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన కింద వయోజన విద్య, గ్రామీణ, మండల స్థాయి కో-ఆర్డినేటర్లకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం అంశాన్ని లేవనెత్తారు. వారి వేతనాల చెల్లింపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అవకాశమున్న చోట చెక్‌డ్యాంలు

ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ వంతెనల వద్ద చెక్‌డ్యాంల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్డు వంతెనలతో చెక్‌డ్యాముల అనుసంధానం అన్న అంశంపై సభ్యులు చల్లా ధర్మారెడ్డి, దుర్గం చిన్నయ్య, పుట్ట మధుకర్, దొంతి మాధవరెడ్డి, సున్నం రాజయ్యలు అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 105 చెక్‌డ్యాంలలో 24 పూర్తయ్యాయని చెప్పారు. వీటి నిర్మాణంతో నీటినిల్వలతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. సభ్యుల ప్రతిపాదనమేరకు అవకాశమున్న చోట మరిన్ని చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తామని తెలిపారు.

భూసార కార్డులను అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు భూసార కార్డులను అందజేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా భూసార పరీక్షా కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ అధికారుల ఖాళీల భర్తీపై సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, గువ్వల బాలరాజు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఆరూరి రమేశ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పుట్ట మధుకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పోచారం సమాధానమిచ్చారు. భూసార కార్డులపై కేంద్రం కూడా ప్రశంసించిందని అన్నారు.

అర్థవంతంగా ప్రశ్నోత్తరాలు

సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అర్థవంతమైన చర్చ జరిగింది. సభ్యులు అడిగిన సందేహాలకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు సవివరంగా సమాధానాలిచ్చారు. ఎలాంటి రాద్ధాంతానికి ఆస్కారం లేకుండా క్వశ్చన్ అవర్ సాఫీగా జరిగింది. పలు అంశాలపై మంత్రులు ఇచ్చిన జవాబులతో సభ్యులు సంతృప్తి చెందారు. రెండోరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల విజ్ఞప్తి మేరకు నాలుగు ప్రశ్నలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం జరిగిన స్వల్పకాలిక చర్చలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన 18మంది సభ్యులు పాల్గొన్నారు.

వాకౌట్ చేయటం విచిత్రం

సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ వాకౌట్ చేయటం విచిత్రంగా ఉంది. చర్చించేందుకు విషయం లేక సభాకాలాన్ని వినియోగించుకోవటం లేదు. ఏదోవిధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటిరోజు చలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వటం, చర్చ ప్రారంభంకాకముందే వాకౌట్ చేయటం ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిరద్శనం. అసలు సభలో ఉండేందుకే కాంగ్రెస్‌కు ఇష్టం లేనట్టుంది. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతగా మెలగాలి. 50 రోజులు చర్చించేందుకు సర్కారు సిద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాల గురించి, ఇతర అంశాల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇకనైనా కాంగ్రెస్ చర్చకు సహకరించాలి. సభ జరుగకుండా అడ్డుకునే యత్నాలను ప్రజలు హర్షించరు.

జానారెడ్డి మాటకు కట్టుబడాలి

బీఏసీ సమావేశంలో చర్చించిన అంశాలను కాంగ్రెస్ విస్మరిస్తున్నది. ప్రశ్నలకు తగిన సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాం. చర్చ జరిగేందుకు సహకరించాలని అనుకున్నాం. అన్ని పార్టీలవారు ఈ నిర్ణయాలను పాటించాలని విన్నవించాం. కానీ జానారెడ్డి మాత్రం మాటలు విస్మరిస్తున్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడి లేరని అర్థమవుతున్నది. తాము చెప్పిన విధంగానే సభ నడువాలనే ధోరణిలో ఉంటున్నారు. సభలో అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న జానారెడ్డి వాకౌట్‌కు పిలుపునివ్వటం, సభా సంప్రదాయాలను పట్టించుకోకపోవటం ఆశ్చర్యంగా ఉన్నది.

రేవంత్‌రెడ్డి షేర్‌ఖాన్‌లా ఫీల్ అవుతున్నాడు

రేవంత్‌రెడ్డి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారు. షేర్‌ఖాన్‌లా ఫీల్ అవుతున్నారు. టీడీపీ నాయకులు ప్రభుత్వ విధానాలు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నది. బీజేపీకి వ్యవసాయం అంటే ఏంటో తెలియదు.