కాకతీయ కళావైభవం

శిల్పం, కట్టడాలు:

కాకతీయులు తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో అద్భుత దేవాలయాలను, కోటలను, తోరణాలను కట్టించారు. వారి సామంతులు, మంత్రులు, సేనాధిపతులు, రాష్ర్టాల పౌలకులు తమ యజమానులను స్ఫూర్తిగా తీసుకొని అనేక దేవాలయాలు నిర్మించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కోటల్లో గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, భువనగిరి పేర్కొనదగినవి. -ఓరుగల్లు రక్షణ కోసం ఒక బలమైన కోటగోడను నిర్మించారు. దీనికి మూడు కోటగోడలున్నాయి. -మొదటి ప్రహరీగోడ మట్టితో నిర్మించారు. దీని ఎత్తు పది అడుగులు ఉండి కాజీపేట, అనుమకొండలను చుట్టుముట్టి ఉండేవి. రెండో ప్రహరీ ఓరుగల్లు వెలుపలి మట్టికోట. నాలుగు ముఖ్యమైన చోట్ల ఈ కోటకు నాలుగు ద్వారాలు ఉండేది. ప్రస్తుతం మట్టికోట లోపల పాతపట్నం ఉంది. ఈ కోట దాటిన తర్వాత ఫర్లాంగు దూరంలో రాతితో కట్టిన పటిష్ఠమైన కోట ఉంది. దీన్ని కంచుకోట అంటారు. కోట లోపల స్వయంభూనాథ దేవాలయం ఉంది. దాని ఎదురుగా నాలుగు అద్భుత తోరణాలు నిర్మించారు. ఇక్కడి శిల్పకళ క్రీ.శ. 1323 నాటి తురుష్కుల దాడిలో ధ్వంసమైంది.

దేవాలయాలు

-వేయిస్తంభాల గుడి: రుద్రదేవుడు క్రీ.శ 1163లో దీన్ని నిర్మించాడు. ఇది త్రికూటాలయం. రుద్రుడు, వాసుదేవుడు, సూర్యుడు మూల విరాట్టులు. కాకతీయుల సార్వభౌమత్వ ప్రకటనను ఈ గుడిలో లభించిన క్రీ.శ. 1163 నాటి శాసనం తెలుపుతుంది. -రామప్ప గుడి లేదా రద్రేశ్వరాలయం: పాలంపేట గ్రామం ములుగు తాలూకా వరంగల్‌లో ఉంది. దీన్ని క్రీ.శ. 1213లో గణపతిదేవుని సుప్రసిద్ధ సేనాని రేచర్ల రుద్రదేవుడు నిర్మించాడు. రామప్పగుడిని ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న ఉప పీఠంపై పాలిపోయిన ఎరుపురంగు గట్టిరాళ్లతో నిర్మించారు. రామప్ప గుడి గోడలపై శిల్పులు అందమైన స్త్రీ శిల్ప భంగిమలను జాయప నృత్త రత్నావళిలో పేర్కొన్న ప్రకారం చెక్కారు. -ఘనపురం కోట గుడి, వరంగల్: ఘనపురం కోట గుడి, రంగ మండపాల్లో మనోహరమైన నాయికా శిల్పాలను అద్భుతంగా చెక్కారు. గుడిలోని పూసలహారాలతో నిండుగా అలంకరించిన నంది గంభీరంగా ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పుల ప్రతిభకు ఇది మచ్చుతునక. -ఇవేకాకుండా నాగులపాడులోని త్రికూటాలయం (1234), కామేశ్వరాలయం (1256), వరంగల్ కోటలోని స్వయంభూలింగ దేవాలయం (1254), నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం (1208), నందలూరులోని సౌమ్యనాథాలయం మొదలైనవి కాకతీయుల కాలంలో నిర్మితమైన అద్భుత దేవాలయాలు. -కాకతీయుల కాలంలో దేవాలయాన్ని లేదా గుడిని, దాని ప్రాముఖ్యతను, హోదాను, పాత్రను, విశిష్ఠతను గురించి ప్రసిద్ధ చరిత్రకారుడైన నీలకంఠశాస్త్రి ఈ విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. భూస్వామిగా, యజమానిగా, సరుకులు-సేవల వినియోగదారునిగా, పాఠశాలగా, వస్తు ప్రదర్శనశాలగా, రంగస్థలంగా ఒక్క మాటలో చెప్పాలంటే అత్యుత్తమమైన కళలు-నాగరికతలకు సంబంధించి కేంద్రబిందువుగా, ధర్మబద్ధమైన మానవతా విలువలకు ప్రతీకగా, వాటిని నియంత్రించే సాధనంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో దేవాలయం నిర్వహించిన పాత్ర మానవ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. Ramappa -ఈ విధంగా కాకతీయుల పోషణలో అంధ్రదేశంలోని అనేక దేవాలయాలు దేదీప్యమానంగా వర్థిల్లాయి. వాటి వనరులు, ఆదాయం, ఆస్తులు పుష్కలం. ఉదాహరణకు ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర ప్రకారం రెండు ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజ్యంలో 5500 శైవాలయాలు, 1300 వైష్ణవాలయాలు, మల్లారదేవునికి 2400 గుళ్లు, భైరవ, దుర్గ, గణపతి దేవుళ్లకు కలిపి 4400 గుళ్లు ఉన్నట్లు తెలుస్తుంది. -శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి రెండో ప్రతాపరుద్రుని కాలంలో యాభైరెండు గ్రామాలు ఉండేవి. వీటి నుంచి వచ్చే ఆదాయం స్వామివారి నిత్యపూజలకు, సేవలకు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఖర్చుచేసేవారు. ఈ కాలంలో వివిధ కులాల వారు, వర్తకులు తమ వృత్తుల మీద వచ్చిన ఆదాయంలో కొంత వాటాను దేవాలయాలకు దానంగా ఇచ్చేవారు. దేవాలయ భూములకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ఉండేది. వివిధ దేవాలయాలకు నిత్యావసర పండ్లు, సరుకులు, పూలను తీసుకెళ్లే పెరిక ఎడ్లు, బండ్లపై రాజు, అతని అధికారులు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు త్రిపురాంతకం శాసనం తెలుపుతుంది. -ఈ విధంగా కాకతీయులు తెలంగాణ కేంద్రంగా విశాల రాజ్యాన్ని స్థాపించి తెలుగు బాష మాట్లాడేవారందరినీ సమైక్యం చేసి, రాజకీయపరంగా ఒక పటిష్ఠమైన, ప్రజానురంజకమైన పరిపాలన అందించారు. సాహిత్యం, వాస్తుశిల్పం, మత రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించారు. వారికాలంలో సమాజం శాంతితో, ఆర్థికంగా పటిష్ఠంగా ఉంది. కాకతీయుల నీటిపారుదల, మత విధానాలు నేటి తరాలకు మార్గదర్శకం. మాదిరి ప్రశ్నలు

1. కాకతి అంటే?

1) పులి 2) గుమ్మడిపండు 3) అరటి 4) గరుడ

2. కాకతీయుల కాలంలో అరి అంటే?

1) నీటి పన్ను 2) ఇంటి పన్ను 3) భూమి శిస్తు 4) పశువుల పన్ను

3. తొలి కాకతీయులు ఆదరించిన మతం?

1) జైనం 2) బౌద్ధం 3) పాశుపత శైవం 4) వైష్ణవం

4. రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం?

1) బయ్యారం చెరువు శాసనం 2) ధర్మసాగర శాసనం 3) చందుపట్ల శాసనం 4) విలాసతామ్ర శాసనం

5. కాకతీయుల అధికార భాష?

1) సంస్కృతం 2) తెలుగు 3) ప్రాకృతం 4) పైవన్నీ

6. కిందివాటిలో సరైనది.

1) పాల్కురికి సోమనాథుడు కాకతీయుల కాలంలో బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను రచించాడు 2) వీటిని తెలుగులో రచించాడు 3) తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కురికి తెలంగాణ సాహిత్యంలో ఆదికవిగా ప్రసిద్ధిచెందాడు 4) పైవన్నీ సరైనవే

7. కిందివాటిని జతపర్చండి.

1. పురుషార్థ సారం ఎ. విద్యానాథుడు 2. ప్రతాపరుద్ర యశోభూషణం బి. వినుకొండ వల్లభాచార్యులు 3. క్రీడాభిరామం సి. శివదేవయ్య 4. నీతిసార ముక్తావళి డి. బద్దెన 1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి 2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి 3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి 4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

8. కాకతీయుల కాలంలో ఆదరణ పొందిన శైవమత శాఖ?

1) వీరశైవం 2) పాశుపత 3) కాలాముఖ 4) కాపాలిక

9. కాకతీయుల కాలంలో అచ్చుకట్టు భూములు అంటే?

1) రాజాధీనంలోని భూములు 2) మతసంస్థలకు విరాళమిచ్చినవి 3) సేద్య భూములు 4) ఏదీకాదు

10. నవలక్ష ధనుర్ధారాదీశ్వరుడు అనే బిరుదు కలిగిన కాకతీయ రాజు?

1) రుద్రదేవుడు 2) రెండో ప్రతాపరుద్రుడు 3) గణపతిదేవుడు 4) రెండో ప్రోలరాజు

11. కాకతీయ రాజ్యంపై ముస్లింలు దండయాత్ర చేశారని తెలుపుతున్న ఆధారాలు?

1) కాసె సర్వప్ప- ప్రతాప చరిత్ర 2) ప్రోలయ నాయకుని- విలాసతామ్ర శాసనం 3) రెడ్డిరాణి అనితల్లి- కలువచెరువు శాసనం 4) పైవన్నీ

12. కిందివాటిలో సరైనవి.

1) రెండో ప్రోలరాజు శ్రీశైలంలో విజయస్తంభం నాటాడు 2) రుద్రదేవుడు తన అనుమకొండ శాసనంలో తన తండ్రి రెండో ప్రోలరాజు విజయాల గురించి వర్ణించాడు 3) 1 సరైనది 2 సరికాదు 4) 1, 2 సరైనవే

13. కిందివాటిని జతపర్చండి.

1. సలకవీడు శాసనం ఎ. దానార్ణవుడు 2. చందుపట్ల శాసనం బి. మైలాంబ 3. బయ్యారం శాసనం సి. పువ్వుల ముమ్మడి 4. మాగల్లు శాసనం డి. రెండో ప్రతాపరుద్రుడు 1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి 3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి

14. కాకతీయుల కాలంలో ప్రసూతి వైద్యశాల ఉన్నట్లు తెలిపే శాసనం?

1) మల్కాపురం శాసనం 2) త్రిపురాంతకం శాసనం 3) శనిగరం శాసనం 4) మోటుపల్లి అభయ శాసనం

15. కిందివాటిలో సరైనది.

1) రెండో ప్రోలరాజు కాలంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది 2) గణపతిదేవుని కాలంలో నిర్మాణం పూర్తయి రాజధాని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మారింది 3) 2 సరికాదు 1 సరైనది 4) 1, 2 సరైనవి

16. కిందివాటిలో సరికానిది

1) ముదార- ఉప్పు సంచులపై విధింంచే పన్ను 2) పుట్టిప హుండీ- ధనరూపంలో వసూలు చేసే పన్ను 3) పుట్టికొలుచు- ధనరూపంలో వసూలు చేసే పన్ను 4) మడిగ సుంకం- దుకాణాలపై వసూలు చేసే పన్ను

17. అరిగాపు అంటే?

1) రైతు 2) వర్తకుడు 3) కాపలాదారుడు 4) బంటు జవాబులు: 1-2, 2-3, 3-1, 4-3, 5-1, 6-4, 7-1, 8-2, 9-3, 10-2, 11-4, 12-4, 13-3, 14-1, 15-4, 16-3, 17-1. Mallikarjun
× RELATED క్లాట్‌-2019