ఇవ్వేం పురుగులు బాబోయ్.. ఇండ్లను ముంచెత్తుతున్నాయ్.. వీడియో

సాధారణంగా ఇంట్లోకి ఒకటి రెండు పురుగులు వస్తనే తెగ చిరాకుపడతాం. వాటిని చంపడమో లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టడమో చేస్తుంటాం. మరి.. ఒకటి రెండు పురుగులకే మనం ఇంత చిరాకు పడితే వీళ్లు ఇంకెంత చిరాకు పడాలి. ఎవరు వాళ్లు.. ఎందుకు చిరాకు పడుతున్నారని టెన్షన్ పడకండి.. పదండి తెలుసుకుందాం.. అది ఒడిశా రాజధాని భువనేశ్వర్. దానికి సమీపంలో చండక భరత్‌పూర్ అడవి ఉంటుంది. ఆ అడవికి సమీపంలో కొంతమంది నివాసం ఉంటున్నారు. ఆ ఏరియాను నీలాద్రి విహార్ అని అంటారు. అయితే.. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంత వాసులు నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు. ఇంట్లోకి వెళ్లాలంటేనే గజగజ వణుకుతున్నారు. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఒకే ఒక పురుగు. అవునా. ఒక పురుగు వల్ల వాళ్లు ఇంత టెన్షన్ పడుతున్నారా? అని తొందర పడకండి. వాళ్లను చిరాకుపుట్టిస్తున్న పురుగు జాతి ఒకటే. కాని కోట్లాది పురుగులు ఇండ్లలోకి వెళ్లి వాళ్లను హింసిస్తున్నాయి. వాటినే స్టింక్ బగ్స్ అని అంటారట. వాటిని తెలుగులో ఏమంటారో అని గూగులమ్మను అడిగితే.. దుర్వాసన వచ్చే పురుగులు అని చెప్పింది. సరే.. అవి ఏ జాతికి చెందిన పురుగులు అనేది పక్కన బెడితే.. వాటిని చంపినా.. అవి బయటికి వదిలే వ్యర్థం వల్ల వచ్చే వాసనను ఆ ప్రాంత వాసులు భరించలేకపోతున్నారట. వాటి పేరు లాగానే అవి నిజంగానే కంపు వాస‌న కొడుతున్నాయ‌ట‌. అవి కుప్పలు కుప్పులుగా ఇండ్లలోకి వచ్చి చేరుతుండటంతో వాటిని బయటికి వెళ్లగొట్టలేక, చంపలేక నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. అవి అలా ఇండ్ల మీద ఎగబడటానికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. అక్కడ ఉన్న అడవిలో ఉండే వెదురు చెట్లకు ప్రతి 35 సంవత్సరాలకు కొన్ని రకాల పువ్వులు పూస్తాయట. అవి కూడా ముండ్లతో కూడిన పువ్వులట. ఆ పువ్వుల కోసం భూమిలో నుంచి బయటికి వస్తాయట ఈ పురుగులు. ఆ తర్వాత అక్కడి నుంచి సమీపంలో ఉన్న ఇండ్ల మీదికి ఎగబడతాయట. అయితే.. ఈ పురుగుల వల్ల ఎటువంటి హానీ లేనప్పటికీ.. అవి ఇంట్లోకి దూరి ఎక్కడ పడితే అక్కడికి వెళ్లిపోతుంటాయి. ఇక... వీటి బారి నుంచి తప్పించుకోవడానికి ఆ ప్రాంత వాసులు వాటి మీద కిరోసిన్ చల్లుతారట. దీంతో అవి చనిపోతాయని వారి నమ్మకం. ఇంకా.. బ్లీచింగ్ పౌడర్, పెస్టిసైడ్స్ లాంటివి ఉపయోగించినా.. అంతగా ఫలితం ఉండట్లేదట. దీంతో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నెత్తిపీక్కుంటున్నారు అక్కడి జనాలు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు