భీమా పుష్కరాలు ప్రారంభం

మక్తల్ : భీమా నది పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7:23 గంటలకు గురువు బృహస్పతి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారాగానే పుష్కర కాలం మొదలైంది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం కుసుమూర్తి గ్రామం వద్ద శ్రీ కృష్ణ ద్వైపాయన స్వామి ఉత్తరాది మఠం వద్ద ఉన్న పుష్కర్‌ఘాట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీనివాసరావు, మక్తల్ తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిలు సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భీమా నదికి హారతిచ్చి పుష్కకరాలను ప్రారంభించారు. అనంతరం పశ్చిమాద్రి విరక్త మఠం నెరడిగోం పీఠాధిపతి పంచమ సిద్దిలింగ మహాస్వామి నదీ జలాలను కమిషనర్ శ్రీనివాస్‌రావు, నారాయణపేట ఆర్డీవో శ్రీనివాస్‌ల తలపై పోసి పుష్కర స్నానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 12 ఏళ్లకోసారి దేశంలోని ప్రధానమై 12 నదులకు పుష్కరాలు జరుగుతాయన్నారు. కావేరి పుష్కరాల అనంతరం భీమా పుష్కరాలు ప్రారంభమవుతాయన్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల వద్ద భీమా శంకర జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద పాండురంగ దేవాలయం పక్క నుంచి భీమా నది పుట్టిందన్నారు. పాలమూరు జిల్లాలో దాదాపు 7 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని, పుష్కరాల సందర్భంగా ఘాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, పంచాయతీరాజ్ ఈఈ నర్సింగ్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
× RELATED ఫసల్ బీమా.. ఇవ్వని ధీమా