పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా జీపుకు తాళ్ళు కట్టి లాగుతూ నిరసన

ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ నిర్వహించిన భారత్ బంద్‌లో భాగంగా ఓయూలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జీపుకు తాళ్ళు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో 23 సార్లకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలు పెంచితే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ ధర్నాలు, రాస్తారోకోలు చేసి, తాను అధికారంలోకి రాగానే మరింత ధరలు పెంచడం దారుణమన్నారు. ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీల వద్ద లీటర్ పెట్రోల్ ధర రూ.40, డీజిల్ ధర రూ.43 ఉంటే కేంద్రప్రభుత్వం విధిస్తున్న సుంకాలతో పాటు ఆయా రాష్ర్టాలు విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించకపోవడం వలన చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డీజిల్‌పై అత్యధికంగా 26 శాతం వ్యాట్ విధిస్తున్నారని వాపోయారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, టీవీఎస్, పీడీఎస్‌యూ (వి) తదితర సంఘాల నాయకులు రహమాన్, మూర్తి, గడ్డం శ్యామ్, రంజిత్, శ్రీకాంత్, జనార్ధన్, విజయ్, ప్రేమ్, ముసవీర్ శంకర్, బాబు, సవిత, శ్రీనివాస్, చారి తదితరులు పాల్గొన్నారు.

Related Stories: