పశ్చిమబెంగాల్ పోలీసులపై గాయని ఆరోపణలు

పోలీసులు తనపై వేధింపులకు పాల్పడ్డారని పశ్చిమబెంగాల్‌కు చెందిన నేపథ్యగాయని మేఖ్లా దాస్‌గుప్తా ఆవేదన వ్యక్తం చేసింది. టీవీ రియాలిటీ షో సరిగమప ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది మేఖ్లా దాస్‌గుప్తా. పశ్చిమమిడ్నాపూర్ జిల్లా దంతన్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శనలో మేఖ్లాదాస్ గుప్తా పాల్గొంది. మ్యూజికల్ షో జరుగుతున్నపుడు కొంతమంది పోలీసులు తనపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని మేఖ్లాదాస్ గుప్తా చెప్పింది.

నవంబర్ 10న ఈ ఘటన జరుగ్గా..మరుసటి రోజు మేఖ్లాదాస్ గుప్తా తన కారులో వెళ్తూ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా తనకెదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. నేను స్టేజిపై ఉండగా..స్టేజీకి ఎడమవైపున్న కొంతమంది పోలీసులు తమ దగ్గరకు వచ్చి పాట పాడుతూ డ్యాన్స్ చేయాలని బిగ్గరగా అరిచారు. పోలీసుల సూచనలు పట్టించుకోకపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తూ..నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందులో కొంతమంది నాపై వేధింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మేఖ్లాదాస్ గుప్తా ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. మ్యూజికల్ ఈవెంట్‌లో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడి వీడియో పుటేజీని పరిశీలిస్తామని, గాయని పట్ల ఎవరైనా పోలీస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువైతే వారిపై కమ్రశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Related Stories: