డిస్కౌంట్ వాహనాలతో జాగ్రత్త

డీలర్ల మాయాజాలంతో.. వినియోగదారులకు ఇక్కట్లు ఇన్‌వాయిస్‌లో తప్పులతో.. ప్రతీరోజూ ఇబ్బందులే ఫిర్యాదు చేస్తే చర్యలు : జేటీసీ హైదరాబాద్: నగరంలో వాహన డీలర్ల మాయాజాలం వినియోగదారుల పాలిట శాపంగా మారుతున్నది. వాహనం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులకు లాభం చేస్తున్నామనే మాయమాటలు చెప్పి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తక్కువ ధరకే వాహనాన్ని మీకు అందచేస్తున్నామని, డిస్కౌంట్లు ఇస్తున్నామని నమ్మించి వాహనాన్ని అంటగడుతున్నారు. ఇన్‌వాయిస్‌లో అసలు ధరతో పోల్చితే తక్కువ ధర పేర్కొంటూ తిప్పలు పెడుతున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన రాజు తిరుమలగిరి ఆర్‌టీవో పరిధిలోని ఒక షోరూంలో కారు కొనుగోలు చేశారు. మా షోరూంలో వాహనం కొనుగోలు చేసినందుకు అసలు ధరలో రూ.35 వేలు తగ్గించామని అదే ధరను పేర్కొంటూ సదరు షోరూం వాళ్లు ఇన్‌వాయిస్ ఇచ్చారు. షోరూంలో ఇచ్చిన వాహన పత్రాలతో రాజు తిరుమలగిరి ఆఫీసుకు వెళ్లగా రిజిస్ట్రేషన్ చూసే సీనియర్ అసిస్టెంట్ ఇన్‌వాయిస్‌లో ఉన్న వాహన ధరను చూసి తమ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను పోల్చుకోగా ఇన్‌వాయిస్‌లో ఇచ్చిన ధరకు ఏ మాత్రం పోలిక కనబడలేదు. పైగా తక్కువగా పేర్కొన్న విషయాన్ని వాహనదారుడికి తెలిసి ఒరిజినల్ ధర ప్రకారంగా పన్ను చెల్లించమని అన్నారు. దీంతో వినియోగదారుడు కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. నేనెందుకు చెల్లించాలి. షోరూం ధర ప్రకారమే ట్యాక్స్ చెల్లిస్తానని పట్టుబట్టడంతో కుదరదని రవాణాశాఖ అధికారులు చెప్పడంతో గొడవ పెట్టాడు. మేము చెప్పేది నిజమని రవాణాశాఖాధికారులు నెత్తీ.. నోరు మొత్తుకున్నా వినియోగదారుడు పట్టించుకోలేదు. పైగా డబ్బులిస్తే మీరు ఏదైనా చేస్తారని కామెంట్స్ చేశాడు. నిజం చెప్పిన మమ్ముల్ని నమ్మడం లేదని మోసం చేసిన డీలర్‌ను నమ్మడంపై అధికారులు విస్తుపోవడమే కాకుండా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి ఇటీవల ఖైరతాబాద్ కార్యాలయంలో మరొకరికి ఎదురైంది. ఇటీవల కొనుగోలు చేసిన బైక్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి తన స్లాట్ బుక్‌చేసుకున్న సమయానికి వెళ్లాడు. క్యూలైన్లో నిలబడి చివరికి అధికారి వద్దకు వెళ్లగా ఇన్‌వాయిస్ సరిగ్గాలేదని తిరస్కరించారు. ఒరిజినల్ కావాలని అది తెస్తే కానీ తాము రిజిస్ట్రేషన్ చేయలేమని అన్నారు. నిరాశకు గురై మళ్లీ షోరూంకు వెళ్లగా ఒక పత్రంపై టైపు చేసి దానిపై ముద్రవేసి ఇన్‌వాయిస్ అంటూ ఇచ్చారు. ఇలా కుదరదని మళ్లీ రవాణాశాఖ అధికారులు చెప్పడంతో షోరూంకు, రవాణాశాఖ అధికారుల వద్దకు తిరిగేసరికి స్లాట్ టైం అయిపోయింది. సమస్య సమస్యలాగే ఉంది. ఇలా ప్రతీరోజు నగర రవాణాశాఖ కార్యాలయాల్లో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన ఆనందం మిగలడం లేదని వాహనదారులు అంటున్నారు. ప్రతీరోజు 1500 వరకు కొత్త వాహనాలు కార్యాలయాలకు రిజిస్ట్రేషన్‌కు వస్తుంటాయి. ఇందులో చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

ఇటువంటి ఇబ్బందులు వాస్తవమేనని, వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. ప్రతీ షోరూం లేదా డీలర్ ఒరిజినల్ ఇన్‌వాయిస్ ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయంలో రవాణాశాఖ అధికారులు చెప్పేదే వాస్తవమని అన్నారు. తేడాలుంటే అసలు ధర ప్రకారమే ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. డిస్కౌంట్ ఇస్తామని ఎవరైనా డీలరు అంటే దీనిపై స్పష్టత తీసుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారుడిదేనన్నారు. ప్రభుత్వ రాబడికి నష్టం రాకుండా రవాణాశాఖ పనిచేస్తుందని చెప్పారు. - పాండురంగనాయక్, జేటీసీ

Related Stories: