రాహుల్ ద్రవిడ్ సాధించిన అరుదైన రికార్డును గుర్తు చేసిన బీసీసీఐ

ముంబై: టీ20 హవా పెరిగిపోతున్న ఈ కాలంలో సమర్థమైన టెస్ట్ బ్యాట్స్‌మన్ దొరకడం ప్రతి టీమ్‌కు కష్టంగానే ఉంది. మూడు గంటల్లో ముగిసే ధనాధన్ టీ20 క్రికెట్‌లో బాదడమే అలవాటుగా మార్చుకున్న యువ బ్యాట్స్‌మెన్.. టెస్టుల్లో సమయానికి తగినట్లు నింపాదిగా ఆడటం మరచిపోయారు. ఒకప్పుడు టీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను చూస్తే టెస్టు బ్యాట్స్‌మన్ అంటే ఇలా ఉండాలి అని అనుకునేవాళ్లు. నిజానికి కేవలం టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ పది వేల పరుగుల మైలురాయిని సాధించిన అరుదైన బ్యాట్స్‌మన్ అతడు. నిజానికి అతని గొప్పతనమంతా టెక్నిక్‌లోనే ఉంది. టెస్టు క్రికెటే ఆ టెక్నిక్‌ను సానబెడతాయి. ఆ టెక్నిక్ ఉంటే చాలు.. ఏ ఫార్మాట్ అయినా ఒకేలా ఆడగలరు అని ద్రవిడ్ నిరూపించాడు. ఈ మధ్య ద్రవిడ్ సాధించిన ఓ అరుదైన ఘనతను బీసీసీఐ ట్వీట్ చేయడం ఓ చర్చకు దారి తీసింది. అదేంటంటే.. ప్రపంచ క్రికెట్‌లో టెస్టుల్లో 30 వేలకుపైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్. అతడు టెస్టుల్లో మొత్తం 31258 బంతులు ఎదుర్కొన్నాడు. నిజానికి 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్‌గా పేరుగాంచిన సచిన్‌కు కూడా సాధ్యం కాని రికార్డు ఇది.

Related Stories: