విలీనంతో ఒరిగేదేమిటి?

ముంబై, సెప్టెంబర్ 18: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనంతో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకును సృష్టిస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కొత్త బ్యాంకుకు వినియోగదారుల సంఖ్య పెరుగడంతో పాటు, మార్కెట్ విస్తరణ, నిర్వహణ సామర్థ్యం, విస్తృతస్థాయిలో సేవలు, ఉత్పత్తులను వినియోగదారులకు అందించవచ్చునని ప్రభుత్వం చెబుతున్నది. ఈ మూడు బ్యాంకులకు ఉన్న నెట్‌వర్క్ ద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చునని ప్రభుత్వం ఆశిస్తున్నది. కానీ ఈ విలీనానికి అసలు కారణాలు, మూలాలు మరోచోట ఉన్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రానికి మెజారిటీ వాటా ఉంది. మొత్తం బ్యాంకింగ్ ఆస్తుల్లో ఈ వాటా విలువ రెండింట మూడోంతులుంటుంది. అలాగే 90 శాతం మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) అంటే దాదాపుగా రూ.8.9 లక్షల కోట్ల మొండి బకాయిలు ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఈ 21 బ్యాంకుల్లో 11 బ్యాంకుల పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలో నేరుగా రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. ఆ బ్యాంకులకు తాజా రుణాలిచ్చే యోగ్యత లేదు. విలీనం తర్వాత కూడా ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగానే పనిచేస్తాయని ప్రభుత్వం చెబుతున్నది. ఈ విలీనం ప్రయోగం స్టాక్‌మార్కెట్‌లో మాత్రం వికటించింది. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ఈ విలీనం పనిచేయదని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం, ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాల వంటి సమస్యలతో ఇప్పటికే కొత్త డిపాజిట్లలో 70 శాతం, రుణాల్లో 80 శాతం ప్రైవేట్ రంగ బ్యాంకులకు తరలి వెళ్తున్నాయి. పటిష్టంగా ఉన్న బ్యాంకుల్లో బలహీన బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రభుత్వ యోచన ఏ మాత్రం సరైనది కాదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి దాదాపు సంవత్సరన్నర కాలం పట్టింది. ఈ మూడు బ్యాంకుల విలీనానికి ఎంత సమయం పడుతుందో అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విలీన బ్యాంక్ కార్యకలాపాలు మొదలయ్యే వీలున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు దేనా బ్యాంకు పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో ఈ విలీనానికి సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అనేక సందర్భాల్లో వ్యతిరేకించారు. పటిష్ట బ్యాంకులను విలీనం చేయడం వల్ల ఉండే ప్రయోజనాలు.. బలహీన బ్యాంకులను బలమైన బ్యాంకుల్లో విలీనం చేయడం వల్ల ఉండదని వాదించారు. అయినప్పటికీ రాజన్ ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మూడు బ్యాంకుల విలీనం సంగతీ ఆయా బ్యాంకుల అధిపతులకు చివరి నిమిషం దాకా కూడా తెలియదట. వచ్చే వారం ఆర్థిక మంత్రి సమీక్ష ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వచ్చే వారం సమావేశం కానున్నారు. ఈ నెల 25న జరుగనున్న ఈ సమావేశంలో ఆయన మొండి బకాయిల తగ్గింపుపై బ్యాంకులు తీసుకున్న చర్యలతోపాటు బ్యాంకర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సమీక్షించనున్నారు. రుణవితరణ పెంపు మొండి బకాయిల రికవరీ, ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, తొలి త్రైమాసికంలో రూ. 36,551 కోట్ల మొండి బకాయిలను వసూలు చేయగలిగాయని బ్యాంకింగ్ రంగ వర్గాలు తెలిపాయి.