టెక్కీకి టోకరా!

-గ్రహదోషాలు సరిచేస్తానని 14 లక్షలు దోచుకున్న జ్యోతిష్కుడు హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉద్యోగం పోవడం, భార్య వదిలేయడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి డిప్రెషన్‌కు గురయ్యాడు. తనకే ఇలా ఎందుకు అవుతున్నదని ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా, ఆన్‌లైన్‌లో ఓ జ్యోతిష్కుడు పరిచ యయ్యాడు. జాతకం బాగుచేస్తానంటూ ఏకంగా రూ.14 లక్షలు గుంజాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన యువకుడు ఇంజినీరింగ్ పూర్తిచేసి ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. కొన్నిరోజుల కింద ట ఉద్యోగం పోవడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. తల్లిదండ్రులు అతడిలో మార్పు కోసం పెండ్లి చేశారు. అయినా మారలేదు. కొన్ని నెలలకే భార్య అతడి నుంచి దూరంగా ఉంటున్నది. దీంతో అతడు మరింత డిప్రెషన్‌కు గురయ్యాడు. తనకే ఎందుకు ఇలా అవుతున్నదని ఇంటర్నెట్‌లో వెతుకడం మొదలు పెట్టాడు. అతడికి స్పెషల్ అస్ట్రాలజీ పేరుతో ఉన్న వెబ్‌సైట్ కనిపించింది. అందు లో తన వివరాలు, సమస్యలను పొందుపర్చాడు. నిర్వాహకులు నీకు గ్రహదోషం చాలా ఉన్నది. గ్రహాలన్నీ కోపంగా ఉన్నాయి. వెంటనే వాటిని శాంతింప జేయాలి. రూ.11 వేలు కడితే పూజ మొదలుపెడుతాం అని మెసేజ్ పంపారు. అలా ఆ ఆన్‌లైన్ జ్యోతిష్కుడు మూడునెలల్లో రూ.14 లక్షలు వసూలు చేశాడు. బాధితుడు ఇటీవల తన తల్లిదండ్రులు పదవీ విరమణ చేయగా వచ్చిన డబ్బు ను కూడా తీసుకొని జ్యోతిష్కుడికి పంపాడు. కొడుకు మళ్లీ డబ్బు అడుగుతుండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయగా అసలు విషయం చెప్పాడు. వారు వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. యువకుడు పంపిన నగదంతా రాజస్థాన్‌లోని బ్యాంక్‌ల్లో డిపాజిట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. డబ్బు ఇవ్వకపోతే జ్యోతిష్కుడు మంత్రాలు ప్రయోగించి తన జీవితాన్ని నాశనం చేస్తాడని బాధిత యువకుడు భయపడు తుండటంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.