తెలంగాణభవన్‌పై సెప్టెంబర్‌ 17న జాతీయజెండా ఎగురుతుంది

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చలపై ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్నారు. 17 సెప్టెంబర్‌పై సీఎం ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కొత్తగా మతం స్వీకరించిన వాడికి నామాలెక్కువ అని ఎద్దెవా చేశారు. దీనికిపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 17 సెప్టెంబర్ రోజు ప్రతి సంవత్సరం తెలంగాణ భవన్‌పైన జాతీయ జెండా ఎగరవేస్తునే ఉన్నాం, ఎగురవేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆ రోజు ఎవరిపైనా ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఎవరు ఎం చేయదల్చుకుంటే అది చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆ రోజు రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు పయనించిన రోజు కాబట్టి అందరూ జెండా ఎగరవేయవచ్చని చెప్పారు. నిజాంకు రాజ్‌ప్రముఖ్ బిరుదు ఇచ్చి గవర్నర్‌ను చేసింది వల్లబాయ్‌పటేల్ కదా, అప్పటి హోం మినిస్టర్ ఆయనే కదా అని గుర్తు చేశారు. ప్రజాసామ్యంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేలమంది అమాయకులను ఊచకోతకు గురిచేశారు. కమ్యునిస్టు పోరాట యోధులను పట్టపగలు కాల్చి చంపేశారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిగారి తండ్రిని కానిస్టేబుల్ తుపాకితో ఉదయం 11 గంటలకు కాల్చి చంపేశాడు. జనరల్ జేఎన్‌చౌదరి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు కౄరాతి క్రూరమైన మిలటరీ పరిపాలన కొనసాగింది. వేదనకు గురైన తెలంగాణ గురించి పట్టించుకోకుండా లెఫ్టిస్టులు, రైటిస్టులు రాజకీయం చేయాలని చూశారు తప్ప ప్రజల బాధలు ఏనాడు పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను కూడా డిమాండ్ చేశాను. కాని తెలంగాణ వచ్చిన అనంతరం సమకాలీన పరిస్థితులను బట్టి, పాత గాయాలను రేపవద్దని మేదావుల సూచన మేరకు దాన్ని పక్కన పెట్టడం జరిగింది. 1948లో నిజాం పాలన నుంచి, మిలటరీ పాలన నుంచి బయటపడ్డామో లేదో 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిపోయాం. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తెలంగాణ పరిస్థితి తయారైంది. 60 ఏండ్ల యాతన, పోరాటం, చావుల తరువాత 2014 జూన్ 2వ తేదీనే నిజమైన తెలంగాణ విముక్తి లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రశాంతతకు భంగా కలిగిస్తే ఉక్కుపాదంతో అనిచివేస్తామని హెచ్చరించారు.

Related Stories:

More