ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జాలం

దుబాయ్‌: భార‌త స్పిన్ ద్వ‌యం రవిచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచారు. సంయుక్తంగా ఫ‌స్ట్ ర్యాంక్ సాధించిన తొలి స్పిన్ ద్వయం వీళ్లే కావ‌డం విశేషం. అంత‌కుముందు రెండో ర్యాంక్‌లో ఉన్న జ‌డేజా.. బెంగ‌ళూరు టెస్టులో ఏడు వికెట్ల‌తో ఒక స్థానం ఎగ‌బాకాడు. జ‌డ్డూ త‌న కెరీర్‌లో తొలి స్థానానికి చేరుకోవ‌డం ఇదే తొలిసారి. చివ‌రిసారి 2008 ఏప్రిల్‌లో ఇలా ఇద్ద‌రు బౌల‌ర్లు అగ్ర‌స్థానాన్ని పంచుకున్నారు. సౌతాఫ్రికా పేస‌ర్ డేల్ స్టెయిన్‌, శ్రీలంక స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ అప్పుడు సంయుక్తంగా అగ్ర‌స్థానంలో నిలిచారు. ఇక అశ్విన్ త‌న హోమ్ సీజ‌న్ అద్భుత‌మైన ఫామ్‌ను బెంగ‌ళూరులోనూ కొన‌సాగించాడు. 8 వికెట్లు తీసిన అశ్విన్‌.. సొంత‌గ‌డ్డ‌పై 200 వికెట్ల తీసిన నాలుగో బౌల‌ర్‌గా నిల‌వ‌డంతోపాటు.. అత్యంత వేగంగా 25 సార్లు ఐదు వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గానూ రికార్డు సృష్టించి త‌న నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. 269 వికెట్ల‌తో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన ఐదో బౌల‌ర్‌గా ప్ర‌స్తుతం అశ్విన్ నిలిచాడు. ఇక బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానం దిగ‌జారి మూడో ర్యాంక్‌కు ప‌రిమిత‌మ‌య్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ రెండు టెస్టుల్లో క‌లిపి కేవ‌లం 40 ర‌న్స్ చేసిన విరాట్‌ను వెన‌క్కి నెట్టి ఇంగ్లండ్ బ్యాట్స్‌మ‌న్ జో రూట్ రెండో స్థానానికి చేరాడు. ఇక బెంగ‌ళూరు టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 92 ర‌న్స్ చేసిన పుజారా ఐదుస్థానాలు ఎగ‌బాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక రెండో టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లోకేష్ రాహుల్‌.. ఏకంగా 23 స్థానాలు ఎగ‌బాకి 23వ ర్యాంకుకు చేర‌డం విశేషం. అటు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ త‌న అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. 77 టెస్టులుగా తొలి స్థానంలో ఉన్న స్మిత్.. పాంటింగ్ (76) రికార్డును అధిగ‌మించాడు.

Related Stories: