ఆర్థికశాఖ సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా

న్యూఢిల్లీ: చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబ వ్యవహారాలను కారణంగా చూపుతూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. కొన్ని రోజుల కిందట వీడియో కాన్ఫరెన్స్‌లో అరవింద్ సుబ్రమణియన్ నాతో మాట్లాడారు. తాను తిరిగి అమెరికాకు వెళ్లిపోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తిగత కారణాలు అయినా.. అది ఆయనకు చాలా ముఖ్యం. దీంతో ఆయనను కాదనలేకపోయాను అని జైట్లీ చెప్పారు.

సుబ్రమణియన్‌ను 2014 అక్టోబర్‌లో చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా నియమించారు. నిజానికి మూడేళ్ల కాలానికే ఆయనను నియమించినా.. గతేడాది సెప్టెంబర్‌లో మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. ముఖ్యమైన ఆర్థిక అంశాలపై ఆర్థిక మంత్రికి సలహాలు, సూచనలు చేసేది ఆర్థిక సలహాదారే. సుబ్రమణియన్ కంటే ముందు ఈ స్థానంలో రఘురాం రాజన్ ఉండేవారు. ఆర్బీఐ గవర్నర్ పదవి రావడంతో ఆయన సెప్టెంబర్ 2013లో ఆ పదవికి రాజీనామా చేశారు. అరవింద్ సుబ్రమణియన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్, డీఫిల్ పూర్తి చేశారు.

× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?