మూడు నెలల తర్వాత.. జైట్లీ మళ్లీ వచ్చారు!

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మూడు నెలల తర్వాత శుక్రవారం మరోసారి తన శాఖ బాధ్యతలను చేపట్టారు. ప్రధాని సూచన మేరకు భారత రాష్ట్రపతి.. అరుణ్ జైట్లీకి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను అప్పగించారు అని అధికారిక నోటిఫికేషన్ ఇవాళ ఉదయం విడుదల చేశారు. మే 14న ఆయన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అంతకుముందు నుంచే జైట్లీ ఆర్థిక శాఖ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జైట్లీ లేని ఈ మూడు నెలలు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా చూశారు. అయితే మధ్యమధ్యలో అరుణ్ జైట్లీ వీడియో కాన్ఫరెన్సుల్లో అధికారులతో మాట్లాడటం వివాదాస్పదమైంది. అసలు ఆర్థిక మంత్రి ఎవరు అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ మధ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓటు వేసేందుకు అరుణ్ జైట్లీ పార్లమెంటుకు వచ్చారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే అరుణ్ జైట్లీకి బేరియాట్రిక్ సర్జరీ కూడా జరిగింది. మధుమేహంతో బాధపడుతున్న జైట్లీ పూర్తిగా బరువు తగ్గిపోవడంతో మరోసారి బరువు పెరగడానికి అప్పట్లో ఆ సర్జరీ చేశారు. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న తర్వాత మరోసారి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా నార్త్‌బ్లాక్ తొలి అంతస్తులోని కార్యాలయాన్ని పూర్తిగా రెనొవేట్ చేశారు.

Related Stories: