ఉద్యానపంటల్లో ప్లాస్టిక్, మల్చింగ్‌తో ఉపయోగాలు

plastic ఉద్యానరంగాల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల నీటి ఆదాతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా చేసి నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. ప్లాస్టిక్ తేలికగా ఉండి ఎక్కువరోజులు మన్నిక కలిగి ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తుంది. నిర్వాహణ కూడా చాలా అనుకూలంగా ఉన్నది. దీనివల్ల రైతులలో మంచి అవగాహన కలిగి వీటి వాడుక అనతికాలంలోనే బాగా పెరిగింది. పంటల్లో మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు ఉద్యానరంగాల్లో ప్లాస్టిక్ పరికరాలను విరివిగా ఉపయోగించాలని నిపుణులు సూచించారు. అయితే వీటి వాడకం, వీటివల్ల కలిగే ఉపయోగాల గురించి గడ్డిపల్లి కేవీకే ఉద్యానవన శాస్త్రవేత్త సీహెచ్. నరేష్ వివరించారు. అదనపు సమాచారం కోసం 9603268682 నెంబర్‌ను సంప్రదించవచ్చు. మొక్కల చుట్టూ ఉండే వేళ్ళ భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు చిన్నచిన్న గులకరాళ్ళు మొదలైన వి వాడేవారు. కానీ వీటి వినియోగం ఇతర అనుబంధ సంస్థలలో ఉన్నందువల్ల (ఉదా: ఇటుకబట్టీలు మొదలైనవి), వాటి లభ్యత రానురాను తగ్గుతున్నందున ప్లాస్టిక్ షీటుతో మల్చింగ్ చేయడం ప్రాముఖ్యం సంతరించుకున్నది. ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ఈవిధానాన్ని పలురకాల తోటలలో అవలంబించి ఆ తోటలలో నాణ్యతతో కూడిన దిగుబడులను పొందవచ్చు.

మల్చింగ్‌తో లాభాలు

నీటి ఆదా: మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరికాకుండా నివారిస్తుంది. దీనివల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40 శాతం వరకు నీటి ఆదా అవుతుంది. దీన్ని బిందు సేద్య పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20 శాతం నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. కలుపు నివారణ: సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు చేరనీయదు. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ జరుగక సుమారు 85 శాతం వర కు నివారణవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది. మట్టికోత నివారణ: వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. నేల ఉష్ణోగ్రత నియంత్రణ: మొక్క చుట్టూ సూక్ష్మవాతావరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. భూమిలోని చీడపీడల నివారణ: పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపజేసి భూమిలోని క్రిమికీటకాదులను, తెగుళ్ళను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అని అంటారు.

ఎరువులు, క్రిమిసంహారక మందుల ఆదా

నేలలో వేసిన ఎరువులు భూమి లోపలి పొరల్లోకి వెళ్ళకుండా నివారిస్తుంది. దీనివల్ల కలుపు నివారణ జరిగి క్రిమిసంహారక మందుల ఆవశ్యకత తగ్గుతుంది. నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు: మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలుగడం వల్ల పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు (20-50 శాతం) పొందవచ్చు. నేల తయారీ ఖర్చు ఆదా: భూమిలో ఎల్లప్పుడు తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరువ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతుంది. దీనివల్ల పంట కాలం తర్వాత నేల తయారీకి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. మల్చిషీట్లు అతినీలలోహిత, పరారుణ కిరణాలకు తట్టుకునే విధంగా రసాయనశుద్ధి ద్వారా తయారుచేస్తారు. దీనివల్ల వీటి మన్నిక కనీసం మూడేండ్ల వరకు ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వివిధ రంగుల్లో లభిస్తాయి. ఉదా: నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, వెండిరంగు మరియు రెండు వైపులా వేర్వేరు రంగులవి కూడా లభిస్తాయి. ఉదా: నలుపు- తెలుపు, పసుపు-నలుపు, వెండిరంగు గలవి. ఒక్కొ క్క రంగు షీటు ఒక్కొక్క పంటకు మరియు కాలములలో ఉపయోగించవలసి ఉంటుంది. ఉదా: టమాటాలో ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, మల్చిషీటు వాడటం వల్ల తెలుపు, వెండిరంగు పారదర్శక షీట్ల కంటే నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే సిమ్లా మిర్చిలో ఎరుపు రంగుది తెలుపు రంగు కంటే, కాలిప్లవర్‌లో నలుపుది తెలుపు రంగుకంటే క్యాబేజీలో పసుపు రంగుది ఆకుపచ్చరంగుకంటే అధిక దిగుబడులనిస్తాయి. కొబ్బరి చెట్లకు వెండిరంగు మల్చిషీట్లను కాండానికి తొడిగితే మొవ్వ పురుగు తాకిడిని నివారించవచ్చు. అధే విధంగా వేసవికాలంలో తెలుపు రంగు షీటు ను, చలికాలంలో నలుపు రంగు షీటును వాడాలి. మొక్కల గింజలు మొలకెత్తడానికి పలుచటి నలుపు రంగు మల్చి షీట్లను వాడాలి. మల్చిషీటు లక్షణాలు: ఇవి గాలి భూమిలోనికి చొరబడనీయనివై ఉండాలి. నేలలో ఉండే ఉష్ణోగ్రతను బయటి వాతావరణంలో కలువనీయకుండా ఉండా లి. మల్చిషీటు మన్నిక ఒకసారి భూమిపై వేసిన తర్వాత కనీసం ఒక పంటకాలానికైనా వచ్చేదై ఉండాలి. మల్చింగ్ చేసే విధానం: మొక్కలకు ఇరువైపులా (కూరగాయలు) లేక చుట్టూరా (పూలు, పండ్లమొక్కలు) 5-10 సెం.మీ లోతు గాడీ చేయా లి. మల్చి షీటు ను కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటు ను ప్రతీ వరుసలో లేక చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువగా లేకుండా కప్పి అన్ని చివరలకు గాడీలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చిషీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. మల్చింగ్ చేసే విధానం: ఇది రెడు రకాలుగా ఉంటుంది 1) విత్తుటకు ముందుగా మల్చింగ్ చేసే విధానం: మొక్కకు మొక్కకు, అలాగే వరుసకు వరుసకు మధ్య దూరాన్ని బట్టి ముందుగానే షీటుపై రంధ్రాలు చేసుకోవాలి. (ప్రస్తుతం రంధ్రాలు గల షీట్లు కూడా లభ్యమవుతున్నాయి) ఈ షీట్లను ప్రతి వరుస మీద ఊతమివ్వాలి.. రంధ్రాలలో ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు పెట్టాలి. దీనివల్ల సుమారు 20-25 శాతం విత్తనాలు ఆదా అవుతాయి. 2) నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం: మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చిషీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చిషీటుపై మొక్కల దగ్గర చిన్నచిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివరలను ఊతమివ్వాలి.

మల్చింగ్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మల్చిషీటును బలంగా లాగరాదు. చల్లని వాతావరణ సమయాల్లో అంటే పొద్దుగాల లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చిషీటు వేయాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి సరిగ్గా పనిచేయదు. గంటకు 5 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలి ఉండే ప్రాంతా ల్లో మల్చి వేయకూడదు. పంటకాలం తర్వాత మల్చిషీటును పొలం నుంచి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్‌ల మందం కల్గిన మల్చిషీట్లు మూడేండ్ల వరకు మన్నికగా వాడుకోవచ్చు. - నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945 గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా plastic1

అనేక లాభాలు

ఉద్యానరంగంలో ప్లాస్టిక్ వినియోగంతో అనేక లాభాలు ఉంటాయి. నీటి ఆదాతో పాటు కలుపు నివారణ కూడా రైతులకు చాలా తేలిక అవుతుంది. అలాగే నేలలో తేమ కూడా కాపాడుకోవచ్చు. అలాగే ఎరువులకు అయ్యే ఖర్చు కూడా చాలా తగ్గించుకోవచ్చు. దీనితో బిందు సేద్యాన్ని ఆచరిస్తే మరీ మంచిది. - సీహెచ్.నరేష్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి