ఆహారం..ఆరోగ్యం..ఆనందం

నగరం ఏదైనా తీసుకుంటుంది.. పల్లె ఎంతైనా ఇస్తుంది. నగరానిది అవసరం.. పల్లెది మమకారం.. నగరం ఒళ్లు హూనం చేస్తుంది.. పల్లె తన ఒడిలో సేద తీరుస్తుంది. నగరం యంత్రం..పల్లెది ప్రేమ మంత్రం.. సమృద్ది ఉన్న చోటే పదిమందితో పంచుకోవడం ప్రతి ఒక్కరినీ గుండెలో దాచుకోవడం సాధ్యపడుతుంది. మౌలిక అవసరమైన ఆహారం ఉత్పత్తి చేయని చోట మట్టితో సంబంధం లేని శ్రమ జరిగే చోట ఆహారం, ఆరోగ్యం, ఆనందం ఏదీ మన చేతిలో ఉండదు. ఈ సత్యాన్ని గ్రహించిన లతా కృష్ణమూర్తి దంపతులు తమ ఇంటిపై పల్లె పెరటిని నిర్మించుకున్నారు విరామం తీసుకోవాల్సిన వయసులో నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తమ జీవితాన్ని కొత్తగా పునర్నిర్వచించుకుంటున్నారు. inti-panta లత అమ్మమ్మది ఒంగోలులోని శానంపూడి. రైతు కుటుంబం. నాన్న వాళ్లది నెల్తూరు జిల్లా కావలి. వాళ్లకు వ్యవసాయం లేదు. అమ్మమ్మ స్ఫూర్తితో మా అమ్మ పెరటి తోట చేసేది. మా అమ్మ ఇలా విత్తనం వేస్తే మొలక అలా వచ్చేది. ఆమె చేయి అలాంటిదని తమ బాల్యాన్ని తలపునకు తెచ్చుకుని ఆనందంగా చెప్పారు లత. మా అమ్మను చూసి మేం పిల్లలం కూడా చెట్లకు నీళ్లు పోయడం, తనకు తోట పనుల్లో సహాయం చేయడం చేసేవాళ్లం. మాకు పాడి గేదెలు ఉండేవి. వాటి ఎరువును మొక్కలకు వేసేవాళ్లం. అలా మా అమ్మమ్మ, అమ్మ ద్వారా మొక్కల పట్ల ప్రేమ మా మనస్సుల్లోకి నాటుకుపోయింది. నాకు పెళ్లయి హైదరాబాద్ వచ్చాక మొక్కలు పెంచే అవకాశం దొరకలేదు. 1995-96లో మౌలాలిలో అపార్ట్‌మెంట్ తీసుకున్నపుడు కింద మునగ, ఆకుకూరలు, పూల చెట్లు పెంచాను. మునగ కొన్ని వందల కాయలు కాసింది. అపార్ట్‌మెంట్‌లో ఎవరూ మునగకాయ లు కొనాల్సిన అవసరం లేకుండాపోయింది. 2003లో కుషాయిగూడలోని మా ఆడపడుచు ఇంటికి వచ్చాక కింద సొర, దొండ, వంకాయ, తోటకూర, గోంగూర, పూలు, పండ్ల చెట్లు పెట్టాం. వాళ్లు మేం కలిసే ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందిరాలేదు. నాలుగేళ్ల క్రితం కొన్ని మొక్కలతో మిద్దెతోట ప్రారంభించాను. దానికీ ఓ కారణముంది. మా అబ్బాయి జర్మనీ నుంచి ఇంటికి వస్తుండడంతో, తనకు ఇంటికూరలు తినిపించాలనే ఉద్దేశంతో 2016 ఫిబ్రవరిలో ఇంటిమీద గ్రోబ్యాగ్స్‌లో ఆకుకూరలతో ప్రారంభించా ను. అలా మొక్కలు పెంచాలనుకునే నా కోరికకు తిరిగి అవకాశం దొరికింది. ఎండాకాలంలో బుష్ బీన్స్, గోకర, టమాటా, వంగ, బీట్‌రూట్, ముల్లంగి, ఆకుకూరలు పెంచాను. తరువాత సంవత్సరం తీగజాతి మొక్కలు పెట్టాను. గ్రోబ్యాగ్స్‌లో తీగజాతులు పెద్దగా కాత రాలేదు. కంపోస్ట్ సమస్య కూడా ఉండటంతో తక్కువ మొక్కలు పెంచాను. ఐతే నేను పెంచిన వాటిలో ఎక్కువ ఆకుకూరలే కనిపిస్తాయి. వీటిని నీడలో ఆరబెట్టి జర్మనీ, అమెరికాలో ఉంటున్న మా పిల్లలకు పంపిస్తుంటాను. ఖర్చైనా పర్వాలేదు, వాళ్లు ఇంటికూరలు తింటున్నారనే భావన నాకు చాలా సంతోషాన్నిస్తుందంటారు తన్మయంగా. మనం ఈ వయసులో శ్రమ తగ్గించుకోవాలని మేమిద్దరం అనుకున్నా ఎందుకో తోటలేని జీవితాన్ని ఊహించలేకపోతున్నానంటారావిడ. పాపం పిచ్చిది రోజుకు ఐదా రు గంటలు తోటలో శ్రమ పడిపోతుంది అంటారు కృష్ణమూర్తి గారు. ఇది శ్రమ కాదు ప్రేమ అంటారు లత. ఇది పైన మొత్తం 1800 చదరపు అడుగుల స్థలం. ఇందులో 18X18 ఇంచుల హెచ్.డి.పి.ఇ గ్రోబ్యాగ్స్‌లో సపోటా, బత్తాయి, ఆల్ఫాన్సో, థాయ్ మ్యాంగో, జీడి మామిడి, వాటర్ యాపిల్, అంజీర్, కస్టర్డ్ ఆపిల్,రెడ్ యాపిల్ బేర్, ప్యాషన్ ఫ్రూట్,స్టార్ యాపిల్, చెర్రీ, పునాస మామిడి,జామ (రెడ్ జామ,కేజీ జామ, లక్నో 49,ధాయ్ వెరైటీ, నాటు జామ), బార్బడో చెర్రీ, బొంత పండ్ల వంటి మొక్కలను నాటాను. 15 ఇంచుల గ్రోబ్యాగ్స్‌లో నిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్, దానిమ్మ నారింజ, పైన్‌యాపిల్ పెంచుతున్నాను. చిన్న చిన్న గ్రోబ్యాగ్స్‌లో, టబ్స్‌లో వంగ, బెండ, గోకర, చిక్కుడు, క్యాబేజి, చేమ దుంప, ముల్లంగి, మిర్చి, వంగ (9రకా లు) పెంచుతున్నాను. 1.5 ఎత్తు,2 అడుగుల వెడల్పు హెచ్.డి.పి. ఇ గ్రోబ్యాగ్స్‌లో చిక్కుడు, సొర, బీర, పొట్ల, కాకర, నేతి బీర, రెడ్ లాంగ్‌బీన్స్, వైట్ లాంగ్ బీన్స్, క్లౌబీన్స్, దోస (2రకాలు),పుచ్చ, గుమ్మడి వంటి తీగజాతులు పెంచుతున్నాను. ఇంకా రకరకాల తొట్లలో పైకి కాసే మిరప, గుండు మిరప వంటి 4రకాల మిరప మా తోటలో కనిపిస్తాయి. కలబంద, వావిలాకు, రణపాల, గలిజే రు, నల్లేరు, మారేడు వంటి ఔషధ మొక్కలు ఉన్నాయి. కాకర పెద్ద సైజులో విపరీతంగా కాసింది. గింజలతో వచ్చిన దానిమ్మ సంవత్సరంలో మంచి పూత వచ్చింది. ఎనిమిది నెలల అంజీర్ విపరీతంగా కాస్తున్నది. ఇక పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే గ్రోబ్యాగ్స్‌లో ఎర్రమట్టి 20 శాతం, కోకోపిట్ 25శాతం, పశువుల ఎరువు, వర్మికంపోస్ట్, 55 శాతం గుప్పెడు వేపపిండి కలుపుతున్నాను. ప్రతి వారానికి ఒకసారి ఏదో ఒక ఎరువు వాడుతుంటాను. మొదట ఇంటిపంట గ్రూప్ ద్వారా తెలుసుకుని, పబ్లిక్ గార్డెన్‌లో చాలా తక్కువ ఖర్చు తో వర్మికంపోస్ట్ తెచ్చుకున్నాను. ప్రస్తుతం దగ్గరగా ఉన్న గుడిలో ఆవుల వ్యర్థాలను తెచ్చుకుని జీవామృతం తయారు చేసుకుని ప్రతి 15 రోజులకు వాడుతున్నాను. ఇవే కాకుండా దక్షిణకొరియా శాస్త్రవేత్త చోహాన్ క్యో చెప్పినటువంటి ద్రావణాలు తయారుచేసి వాడుతున్నాను. మునగాకు బెల్లం, వేపాకు బెల్లం, అరటిదూట బెల్లం కలిపి (20రోజులపాటు) వారానికి ఒకటి మార్చి 1లీటర్‌కి 5ఎం.ఎల్ వాడుతున్నాను. చిన్న చెట్లకు 1ఎం. ఎల్ సరిపోతుంది. ఫలితం చాలా బాగుంది. ఇవే కాకుండా కూరగాయల వ్యర్థాలను నీటిలో 20రోజులపాటు నానబెట్టి మొక్కల మొదళ్లలో పోస్తున్నా ను. ఇది చాలా కాన్సన్‌ట్రేటెడ్ కాబట్టి లీటర్ ద్రావణానికి 15 లీట ర్ల నీటిని కలపాలి. ఇంట్లో వచ్చే వ్యర్థాలను దేనినీ వృథా చేయకుండా అన్నీ తోటలో వాడుకుంటున్నాను. inti-panta2 తోటలో విరిగిపోయిన కొమ్మలు,రాలిన ఆకులను ఒక అట్ట డబ్బా లో వేసి కంపోస్ట్ తయారుచేసుకుంటున్నాను. బియ్యం కడిగిన నీరు,పప్పు,కూరగాయలు కడిగిన నీటిని 24 గంటలపాటు ఉంచి, వాటిలో నీటని కలిపి మొక్కలకు పోస్తున్నాను. దీంతోపాటు కుండీలో చెట్ట మొదళ్లలో ప్లాస్టిక్ బాటిల్ భాగాన్ని తిప్పి పెట్టి,పైభాగాన్ని కొద్దిగా కత్తిరించి అందులో కూరగాయల వ్యర్ధాలను వేస్తా ను. అది కొంచెం కుళ్లిన తరువాత ఎరువులో కలుపుకుంటాను. ఈ లోపు బాటిల్‌నుంచి వచ్చిన ద్రావణం మొక్కకు ఎరువులా ఉపయోగపడుతుంది. తెగుళ్ల నియంత్రణకు పుల్ల మజ్జిగలో వెల్లుల్లి, దాల్చిన పౌడర్, ఇంగువ, పసుపు కలిపి పిచికారీ చేసి తెగుళ్ల సమస్యనుంచి కాపాడుకుంటున్నాను. దీంతో వంగలో ఆకులకు వెనుక వచ్చే తెల్లపేను నివారించబడుతుంది. అది కూడా చాలా తక్కువగా పిచికారీలు చేస్తుంటాను. తోట పెంచుతున్నపుడు లోపలి సమస్యలే కాకుండా, అప్పుడపుడూ బయట సమస్యలు కూడా వస్తుంటాయి. కింద పెరటిలో పూల చెట్టు, పండ్ల చెట్లు చాలా ఏపుగా పెరిగాయి. దాంతో వాటి ఆకులు,కొమ్మలు రాలి పక్క ఇంట్లో పడుతున్నాయని వాళ్ల తో గొడవలు. ఇవన్నీ భరించలేక గన్నేరు, దానిమ్మ, జామ, మామిడి వంటి పెద్ద చెట్లు కొట్టాల్సి వచ్చింది. చాలా పెద్ద సైజులో కాసే పదిహేను సంవత్సరాల మామిడి రసాల చెట్టుని కొట్టాల్సి రావడం మమ్మల్ని చాలా ఆవేదనకు గురిచేసింది. చెట్లతో ఒకసారి అనుబంధం ఏర్పడితే తెంచుకోవడం చాలా కష్టమనే విషయం అనుభవంలోకి వచ్చింది. డాబా మీద నీరు పడకుండా ఉండటానికి ఇనుప స్టాండ్లను తయారుచేయించాను.10 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు,5 అంగుళాల ఎత్తు స్టాండ్ల మీద గ్రోబ్యాగ్స్‌ను ఉంచాను. ఇది చాలా ఉపయోగంగా ఉన్నది. ఏదేమైనా ఈ తోట మాకు ఎంతో ఆరోగ్యా న్ని, ఎనలేని మానసిక ఆనందాన్ని అందించింది అంటారామె కృతజ్ఞతాపూర్వకంగా.

గార్బేజ్ ఎంజైవ్‌ు తయారీ

150 గ్రాముల కూరగాయల పీచు (ఆలు, వెల్లుల్లి, ఉల్లి వాడరాదు.)50 గ్రాముల బెల్లం,500 మిల్లీ లీటర్ల నీళ్లు కలపాలి. ప్రతి దానిలో రెండు నుంచి మూడు నిమ్మచెక్కలు కలిపితే మంచి వాసన వస్తుంది. గ్యాస్ బయటకు వెళ్లడానికి మొదట వారంలో రోజూ మూత తీసి పెట్టాలి. దీనిని ఎండతగలని చోట ఉంచాలి. 20 రోజుల తరువాత ఎలాంటి గ్యాస్ రాదు కనుక కదపకుండా ఉంచాలి. దీనిని 3నెలల తరువాత వాడుకోవచ్చు. లీటర్ నీటికి 5ఎం.ఎల్ కలిపి వాడుతున్నాను. దీనిని మొక్కలకు, ఇంకా పలురకాలుగా వాడుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, పూల వ్యర్థాలతో కూడా దీన్ని తయారుచేసుకోవచ్చు. -కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455 నేచర్స్‌వాయిస్