బెండలో విత్తనోత్పత్తి

ఏడాది అంతా వినియోగదారుల నుంచి మంచి డిమాండు ఉన్న కాయగూర పంట బెండ. దీనిలో ఔషధ గుణాలతో పాటు మనిషికి అవసరమైన పోషకాలను ఉంటాయి. అందుకే ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ఈ పంట విత్తనానికి ఉన్న డిమాండు దృష్ట్యా మార్కెట్‌లో కల్తీ విత్తనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పంటలో రైతులు నేరుగా తమ స్థాయిలోనే నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. అందుకు కొన్ని కిటుకులు పాటించాలి. lady-finger బెండ ఉష్ణమండల పంట. ఎండాకాలం బాగా వస్తున్నప్పటికీ, వెచ్చని తేమతో కూడిన వానకాలంలోనూ పంట వస్తుంది. అయితే రాత్రిపూట చల్లని వాతావరణం ఉంటే మేలు. ఈ పంట మంచును తట్టుకోలేదు. 26-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మొలకెత్తుతుంది. 16 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత తగ్గితే విత్తనం మొలకెత్తదు. ఎండాకాలంలో సాధారణంగా విత్తన నాణ్యత బాగుంటుంది. అయితే విత్త న పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పంటను విత్తుకునే సమయంలో వానలు, ఈ పంట పూత దశ ఏకకాలంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కాయ పక్వానికి వచ్చే దశ, ఎండ బెట్టే దశలో ముందస్తు వానలు పడితే నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఎంచుకోవాల్సిన రకాలు

శంఖు రోగాన్ని తట్టుకునే సూటి రకాలను ఎంచుకొని విత్తనోత్పత్తి చేపట్టాలి. పూసా సవాని, పంజాబ్ పద్మిణి, పర్బణి క్రాంతి వంటి రకాలు విత్తనోత్పత్తికి మంచివి.

పువ్వుల లక్షణాలు, సంపర్క లక్షణాలు

రకాన్ని బట్టి 4 నుంచి 8వ ఆకు, కాండం మధ్య నుంచి పూత మొదలవుతుంది. మొగ్గ నుంచి పూర్తి పువ్వుగా మారేందుకు 22-26 రోజులు పడుతుం ది. పొద్దుగాల 8-10 గంటల మధ్య పుష్పాలు విచ్చుకుంటాయి. పూత తర్వాత 15-20 నిమిషాల తర్వాత పుప్పొడి రేణువులు విడుదల అవుతాయి. పూత తక్కువ కాలమే విచ్చుకుని ఉంటుంది. పగటిపూట వరకు పూలు ముడుచుకుంటాయి. కీటకాల వల్ల వివిధ రకాలలో 4 నుంచి 19 శాతం వరకు పరపరాగ సంపర్కం జరుగుతుంది. అందుకే బెండను తరచూ పరపరాగ సంపర్కం చెందే పంటగా వర్గీకరిస్తారు.

వేర్పాటు దూరం

ఇది తరచుగా పరపరాగ సంపర్కం చెందే పంట. కాబట్టి ఫౌండేషన్ విత్తనోత్పత్తికి 500 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి 250 మీటర్ల వేర్పాటు దూరం పాటించాలి.

నేలలు

మురుగు నీళ్లు పోయే సౌలతి, సారవంతమైన కర్బన శాతం ఎక్కువగా ఉన్న ఇసుక నేలల నుంచి ఒండ్రు మట్టి నేలల వరకు ఈ పంట సాగు చేయడానికి అనుకూలం. కొంతమేరకు పాక్షికంగా ఆమ్లత్వాన్ని తట్టుకుంటుంది. నేలలో ఉదజని సూచిక 6 నుంచి 7 ఉంటే మంచిది. lady-finger3 విత్తే సమయం: వానకాలం పంటను ఆగస్టు మొదటివారం వరకు, ఎండకాలం పంటను ఫిబ్రవరి-మార్చి మధ్యలో విత్తుకోవాలి. విత్తన మోతాదు: హెక్టారుకు 8-10 కిలోలు అవసరం. నాటడం: నేల, నీటి వసతులను బట్టి సాధారణ మడులలోగానీ, బోదెలలో గాని విత్తనం నాటుకోవాలి. వరుసల మధ్య 60 సెం.మీ. వరుసల్లోని మొక్కల మధ్య 30 సెం.మీ. దూరంలో ఉండేలా చూసుకోవాలి. రాత్రంతా విత్తనం నానబెట్టి ఒక పొదకు రెండు విత్తనాల చొప్పున నాటాలి. నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. 12-15 సెం.మీ. ఎత్తు పెరిగిన తర్వాత ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి రెండో మొక్కను తీసివేయాలి. ఎరువులు: నేల తయారీ సమయంలో బాగా చివికిన పశువుల ఎరువును హెక్టారుకు 30 టన్నులు వేయాలి. అలాగే హెక్టారుకు 100 కిలోల నత్రజని, 50 కిలోల చొప్పున భాస్వరం, పొటాష్‌లనిచ్చే ఎరువులను అందించాలి. సగం నత్రజని, మొత్తం భాస్వరం, పొటాష్‌లను విత్తనం నాటేందుకు ముందే నేలలో కలిపి వేయాలి. 30-35 రోజుల తర్వా త మిగతా సగం నత్రజనిని పంట కు అందించాలి. వానకాలం ఎక్కువ వానలు ఉంటే నిల్వ ఉన్న నీటిని తీసివేయా లి. కాయ ఏర్పడే దశ, గింజలు అభివృద్ధి చెందే దశ ల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. ఎండాకాలంలో పగటిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపు మందులను పిచికారీ చేయవద్దు. lady-finger2

కల్తీల ఏరివేత

కనీసం మూడు క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. శాఖీయ దశలో మొదటిసారి, పూత, పిందె దశలో రెండోసారి, కాయ పక్వానికి వచ్చే దశలో మూడోసారి తనిఖీలు చేయాలి. కల్తీలలో ముఖ్యంగా శంకు రోగం సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే వేరు చేసి పీకి కాల్చివేయాలి. ప్రమాణాల ప్రకారం 6,7 కణుపుల తర్వాత వచ్చే కాయలు కల్తీవని గుర్తించి ఏరివేయా లి. అలాగే అటవీ బెండ రకాలు 5-6 శాతం కంటే ఎక్కువగా ఉన్న కాయలు కల్తీవిగానే పరిగణించాలి.

కోత, విత్తనాల సేకరణ

విత్తనాల సేకరణకు పూర్తిగా ముదిరి, ఎండిన కాయలను కోసి భద్రపరుచాలి. వానలు లేని సమయంలో మొత్తం కాయలను సేకరించవచ్చు. వానలు ఉంటే రెండు, మూడు దఫాలుగా సేకరించాలి. కొన్నిరోజులు మాగిన తర్వాత పగలగొట్టి విత్తనాలు సేకరించాలి. ఆ తర్వాత 8-9 శాతం వరకు తేమ వచ్చేలా నీడలో ఎండబెట్టాలి. ఆ తర్వాత శుభ్రపరిచి పురుగు ఆశించిన, రంగు మారిన, తాలు విత్తనాలను వేరు చేసి తీసివేయాలి.

విత్తన దిగుబడి

హెక్టారుకు 10-15 క్వింటాళ్లు. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కల్తీలు గరిష్ఠంగా 0.2 శాతం, శంఖు రోగం సోకిన మొక్కలు 1 శాతంలోపే ఉండాలి.

విత్తన ప్రమాణాలు

భౌతిక స్వచ్ఛత (కనీసం): 99 శాతం వ్యర్థాలు (గరిష్ఠం): 1 శాతం ఇతర పంటల విత్తనాలు (గరిష్ఠం): 0.05 శాతం మొలక శాతం (కనీసం) : 65 శాతం తేమ శాతం (గరిష్ఠం): 10 శాతం తేమ కోల్పోని సంచులలో : 8 శాతం dr-pidigem-saidaiah