ఈ ఇంటికి పంటే పందిరి

ఇంటి పంట
నిజమే..నగరం యిరుకు. కలల కుదుళ్లను కత్తిరించి ఆశల కొమ్మల్ని విరిచేసి లైఫ్‌ను మీనియేచర్ సైజుకు కుదించి బోన్సాయ్ కుండీలో కుదురుగా కూర్చోబెడుతుంది. ఇక్కడి వీధుల ఎడారుల్లో పచ్చదనాలు లేవ్ గుండెల అగాథాల్లో తడి జాడల్లేవ్.. చేసుకున్న గాయాల్ని తడిమి చూసుకుంటున్న క్షణాల్లో నిరంతరాయంగా కలలేవో చిట్లుతున్న శబ్దాలు చెమ్మ లేక మట్టిలోనే మరణాన్ని మోస్తున్న స్వప్నాలు. sharadha ఇది నిజమే.. కానీ ఈ నిజాన్ని కొంతమంది తమ ఆచరణతో అక్కడక్కడా అబద్ధం చేస్తున్నారు. వట్టిపోయిన గుండెల్లో కొత్త ఆశల్ని చిగురిస్తున్నారు. చిన్న చిన్న చిగుళ్లతో రేపటి చుట్టూ అనంతమైన నమ్మకాన్ని అల్లుతున్నారు. అసలు ఇష్టం,కష్టం రెండూ కలిస్తే చాలు చిన్న స్థలంలోనే, మన చుట్టూతా పచ్చని ప్రపంచం నిర్మించవచ్చని నిరూపిస్తున్నారు. ప్రకృతి ప్రేమికురాలు శారదకు మొక్కలంటే పిచ్చి ప్రేమ. తమ కుటుంబం హెచ్.ఎం.టిలో తమ బంధువులకు చెందిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని అందులో అన్నిరకా ల కూరగాయలు పండించారు. ఇంట్లో అవసరాలకు పోను మిగిలిన వాటిని చుట్టుపక్కల వారికి అందించే వారు. తరువాత నాచారంలో ఇళ్లు కట్టుకున్నాక కింద ఫ్లోర్‌లో ఉన్నపుడు పెద్ద మనుమడి అన్నప్రాసనకు ఆకుకూరలు వేసి వండితే బాగుంటుందన్న సలహా తో కొన్ని ఆకుకూరలు పండించారు. బియ్యం బస్తాలో మట్టి పోసి అందులో పాలకూర, టమాటా, బెండ వేసారు. వారం రోజుల్లో చిగుర్లు కనిపించాయి. అదే ఉత్సాహంతో కొత్తిమీర, చుక్కకూర, మెంతి, వేసారు. ఎలాంటి ఎరువు వాడకున్నా మొక్కలు పచ్చగా చిగురించాయి. భర్త దూరమై మానసికంగా కుంగిపోతున్న దశలో ఈ మిద్దెతోట శారదను తన ఒడిలో లాలించి అక్కున చేర్చుకుంది. తోటే ప్రపంచంగా గడుపుతున్న సమయంలో ఒక కాపు కాసిన తరువాత బియ్యం బస్తాలు ఎండకు పగిలిపోవడం గమనించింది. అందుకు ప్లాస్టిక్ కవర్లు పరిష్కారంగా భావించింది. హైకోర్టు గేటు ఎదురుగా ఉన్న నర్సరీ స్టోర్‌లో 150 రూపాయలతో 70 కవర్లు (రెండు కేజీలవి) తెచ్చుకున్నారు. మొక్కలు గుబురుగా పెరిగాక కవర్ కనిపించకపోవడంతో నీళ్లు పోయడం కష్టమైంది. అపుడు పొడవు తక్కువ, వెడల్పు ఎక్కువున్న కవర్లు (ఐదు కేజీలవి) తెచ్చా రు. ఒక దశలో 10 కేజీల కవర్లు కూడా తెచ్చుకున్నారు. కానీ జీవామృతం పోసేటపుడు రంధ్రాల నుంచి అది బయటకుపోతోంది. ఇందుకు పరిష్కారంగా ఆమె అతి తక్కువ ఖర్చులో ప్లాస్టిక్ టబ్‌లను తెచ్చుకున్నారు. ఇవి అన్నిరకాలుగా అనుకూలంగా ఉన్నా యి. దీంతో తన మిద్దె మీది 850 చదరపు అడుగుల స్థలంలో 100 టబ్బులు, 20 బకెట్టు, 20 కవర్లు పెట్టి మొక్కలను పెంచుతున్నారు. ఇదంతా చూస్తే అడవిలో ఒక చిన్న ముక్క కత్తిరించి ఇక్కడ అతికించినట్టుగా ఉంటుంది. నిజానికి టబ్బుల కంటే కవర్ల ఖర్చు చాలా తక్కువ. రెండు టబ్బు ల ఖర్చుతో మొత్తం ప్లాస్టిక్ కవర్లు వస్తాయి. ఐతే టబ్బులు ఎంచుకోవడానికి ఆమె మూడు కారణాలు వివరిస్తున్నారు. జీవామృతం బయటకు పోకపోవడం, ఎండాకాలం స్లాబ్ వేడివల్ల కవర్లు వేడె క్కి తద్వారా మొక్కల వేర్లు దెబ్బతినే పరిస్థితి తప్పడం, వర్షాకాలం కవర్ల కింద పెట్టిన థర్మాకోల్ మెత్తబడి కవర్లలోకి దిగబడ టం వంటి సమస్యలు ఈ టబ్బుల వల్ల తీరాయి. అసలు టబ్బు ల్లో పండిస్తుంటే భూమి మీద పండించినట్టుగానే ఉన్నది అంటారు శారద. sharadha3 ఇళ్లు కట్టినపుడు మిగిలిన కర్రలు, తడకలతో బీవ్‌‌సుకి మధ్యన వంతెనలా వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్స్‌లో టమాటా, బెండ, తీగ జాతులు పెంచుతున్నారు. తీగజాతులను తడకల మీద పెంచ డం వల్ల అవి కింది నుంచి పైదాకా పాకనవసరం లేకుండా, తక్కు వ ఎత్తులోనే పందిరికి సులువుగా అల్లుకుంటున్నాయి. థర్మాకోల్ బాక్స్‌లు, ప్లాస్టిక్ టబ్స్, ఇనుప బకెట్‌లో మొక్కలు ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు అంటారు శారద. ఒక టబ్బులో మధ్యన కమల చెట్టు (పెద్ద చెట్టు),దాని చుట్టూ 4 బెండ చెట్లు, ఒక తీగజాతి (సొర, బీర, పొట్ల) పెంచుకోవచ్చు. చిన్న కవర్‌లో మూడు మిరప, మూడు బెండ మొక్కలు పెంచుకోవచ్చు. థర్మాకోల్ బాక్స్ లో ఆరు ఇంచులలోపు వేర్లు పాదుకునే ఆకుకూరలు పెడితే మంచి ది. లోతైన వాటిలో పెడితే నీరు ఎక్కువ నిలువ ఉండి వేర్లు మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఒక కవర్‌కు ఒకటే వంగ పెడి తే మంచిది. వంగ రెండు ఇంచుల లోపే వేరును విస్తరిస్తుంది. ఇందులో వేరే మొక్క ఎదగదు. ఐతే వంగ వేరు తగలని చోట క్రీపర్ పెట్టుకుంటే అది లోపలికి వెళుతుంది కాబట్టి సమస్య లేదు అంటూ తన అనుభవాలను వివరించారు శారద. పాలేకర్ విధానం చాలా మంచిది. యూట్యూబ్ చూసి ఆయన విధానాలను అర్థం చేసుకున్నాను. నా తోట ఇంత పచ్చగా ఉండటానికి ఆయన రూపొందించిన జీవామృతమే కారణం. దానివల్ల ప్రతి కుండీలో వానపాములు వృద్ధి చెందాయి. ఇవి పైకి కిందకు తిరగడం వల్ల మొక్కల వేర్లకు సులువుగా గాలి అందుతున్నది. కిచెన్‌వేస్ట్‌ను థర్మాకోల్ బాక్స్‌లో వేసి పైన జీవామృతం పోస్తున్నా రు. దీనివల్ల వానపాములు బాగా వృద్ధి చెంది మంచి ఎరువు తయారవుతున్నది. ముఖ్యంగా ఒక వంతు మట్టి, ఒక వంతు పశువుల ఎరువు లేదా వర్మికంపోస్ట్, ఒక వంతు కిచెన్ వ్యర్థాల కంపో స్ట్, ఎండిన పశువుల ఎరువు, కొంచెం వేపపిండి కలిపి పాటింగ్ మిక్స్ తయారుచేసుకుంటే మొక్కలు మంచిగా ఎదుగుతాయంటారు. ఇక తెగుళ్ల నియంత్రణకు వస్తే పచ్చిమిర్చి, వెల్లుల్లి, వేపాకు మెత్తగా నూరి ఉదయం మరగబెట్టి, రోజంతా అలాగే ఉంచి మరుసటిరోజు సాయంత్రం మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల పురుగుల గుడ్లు నశిస్తాయి. ఎప్పటికపుడు ఇలా చేసుకోవడం వల్ల పురుగులను నియంత్రించవచ్చు అంటారు. sharadha2 ప్రతీ తోటలో నేలిబీర పెడితే చాలా మంచిది. ఒక్కొక్క పువ్వు చాలా పెద్దగా ఉంటుంది. దానిలో పుప్పొడి విపరీతంగా ఉంటుం ది. దానికోసం తేనెటీగలు, పిట్టలు, సీతాకొకచిలుకలు విపరీతంగా రావడంతో పరపరాగ సంపర్కానికి అవకాశం ఎక్కువగా ఉండి అధిక ఉత్పత్తులు పొందవచ్చు అంటారు శారద. ఇక మా మిద్దె మీద ముల్లంగి, కారట్, బీట్‌రూట్ అన్నీ పండించగలిగాను గానీ, కాలిఫ్లవర్ పండించడం సాధ్యం కాలేదు. ఎన్నిసార్లు వేసినా పురు గు సమస్యను నియంత్రించలేకపోయాను. జీవామృతం పిచికారీ చేస్తే పువ్వు మొత్తం ముడుచుకుపోయి గట్టిపడుతున్నది. ఏం చేయాలో అర్థం కావడంలేదంటారు. ముందు చెప్పినట్టు ఆమెకు పచ్చదనమంటే పిచ్చి. ఎంతంటే మూడవ కొడుకు పుట్టే సమయంలో ఉదయం మూడున్నరకు లేచి, మొక్కలకు నీళ్లు పోసి తొమ్మిదన్నరకు సిజేరియన్‌కు వెళ్లారట. అదీ ఆమెకు మొక్కల మీద ఉన్న పిచ్చి. - కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455, నేచర్స్ వాయిస్

శారద మిద్దెతోట పంటలు

ఆకుకూరలు: పాలకూర,చుక్కకూర, గోంగూర, బచ్చలి, పొన్నగంటి, తోటకూర, గంగవావిలి, గలిజేరు (పునర్నవ),మెంతి,కొత్తిమీర, పుదీనా కూరగాయలు: వంకాయ, బెండ, టమాటా, చెట్టు చిక్కుడు, గోరుచిక్కుడు, చాలారకాల వంగ, పచ్చి మిర్చి, మునగ, కాలిఫ్లవర్, క్యాబేజి దుంపజాతులు: కందగడ్డ, ముల్లంగి, బీట్‌రూట్, చామదుంప తీగజాతులు: సొర, బీర, పొట్ల, దోస, చిక్కుడు, నేతిబీర, కాకర, దొండ (పొడుగు, పొట్టి) పండ్ల మొక్కలు: దానిమ్మ, జామ, సపోటా, కమలా ఫలం, స్వీట్ లైవ్‌ు, లెమన్, అంజీర్ పూల మొక్కలు: గులాబీ, మల్లె, చామంతి, లిల్లీ, బంతి (రెండు రకాలు) sharadha4