పల్లి పంటలో మెళకువలు

ground-nut నూనె గింజల పంటల్లోకెల్లా పల్లి పంట ముఖ్యమైంది. వానకాలం పల్లి పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ పంటను సాగునీటి ఆధారంగా, వర్షాధారంగా సాగు చేయవచ్చు. ఈ పంట సాగు చేసేందుకు వర్షాధారంపై ఆధారపడిన రైతులు ఇప్పటికే దుక్కులు దున్నుకొని సరైన వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పల్లిలో చీడపీడల సమస్య అధికంగా ఉంటుం ది. కాబట్టి రైతులు దుక్కులు దున్నే నాటి నుంచే తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

వాతావరణం

పూతదశ, ఊడలు దిగే దశ నుంచి గింజ ఏర్పడే వరకు పంటకోత సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగితే పంటకు మేలు జరుగుతుంది. పల్లి పంట సాగుకు ఎర్రనేలలు అనుకూలంగా ఉంటా యి. ఎక్కువ బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో పంటలు వేయకూడదు.

విత్తన మోతాదు

వానలు సమృద్ధిగా పడితే ఈ పంటను జూలై మాసం చివరి వరకు విత్తుకోవచ్చు. గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. ఎకరాకు సుమారుగా 60 నుంచి 70 కిలోల విత్తనం అవసరం. ground-nut2

విత్తనశుద్ధి

విత్తనశుద్ధి కోసం మాంకోజెబ్ లేదా కార్బండిజమ్ మందును విత్తనానికి పట్టించాలి. ఈ పంట కొత్తగా సాగు చేసేటప్పుడు రైజోబి యం కల్చరును పట్టించాలి. విత్తేటప్పుడు సాలుసాలుకు మధ్యన, మొక్కమొక్కకు మధ్యన 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండాలి. విత్తనాన్ని గొర్రుతో గానీ లేదా నాగలిసాళ్లతో గాని విత్తాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకుంటే పదునులోపు మొలకెత్తే అవకాశం ఉంటుంది.

యాజమాన్య పద్ధతులు

దుక్కిలో విత్తనాలను విత్తేటప్పుడు నత్రజని 12 కిలోలు, భాస్వ రం 16 కిలోలు, పొటాషియం 20 కిలోలు చొప్పున ఒక ఎకరాకు వేసుకోవాలి. ఆఖరిదుక్కిలో 5 టన్నుల సేంద్రియ ఎరువు లు వేసుకోవాలి. ఎకరాకు 100 కిలోల సూపర్‌ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అలాగే 12 కిలోల యూరియాను విత్తే సమయంలో, 9 కిలోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. ఎకరాకు 200 కిలోల జిప్సంను తొలిపూత సమయంలో మొక్కల మొదళ్ల వద్ద సాళ్లల్లో వేసి మట్టిని కప్పాలి. తర్వాత పంట పెరిగే కొద్దీ నిపుణుల సూచనల ప్రకారం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -నగిరి హరీశ్, త్రిపురారం