మిరపలో విత్తనోత్పత్తి

రాష్ట్రంలో సంవత్సరమంతా మిరపసాగుచేయబడుతుంది. వినియోగ అవసరాల దృష్ట్యా ఏడాది అంతా డిమాండు ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో మిరప ఎప్పుడూ ఎక్కువ విస్తీర్ణంలోనే సాగవుతున్నది. విస్తీర్ణ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలు కూడా అవసరమే. అయితే వర్షాధారంగా, సాగునీటి ఆధారంగా ఈ పంట సాగు చేయబడుతుంది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతంలో సూటిరకాల సాగు అనువైనవి. కొంతమేరకు నీటి ఎద్దడిని కూడా తట్టుకునే సామర్థ్యం వీటికి ఉండటంతో వీటికి ఆదరణ పెరుగుతున్నది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వాలు విడుదల చేసిన, వివిధ వాతావరణ మండలాలలో పరీక్షించిన పలు సూటి మిరప రకాలు సాగులో ఉన్నాయి. వీటిలో రసంపీల్చే పురుగులను తట్టుకునేవి, నాణ్యమైన కాయలు, అధిక దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయి. రైతులు సూటి రకాలను సాగు చేసేటప్పుడు తమకు కావలసిన విత్తనాన్ని సొంతంగా తామే విత్తనోత్పత్తి ద్వారా తయారుచేసుకోవచ్చు. రాష్ట్రంలో సాగు చేయబడుతున్న అన్ని సూటి రకాలలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. అయితే వేర్పాటు దూరం, కల్తీల ఏరివేత, విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నియంత్రణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే నాణ్యమైన అధిక విత్తనోత్పత్తి సాధ్యమౌతుంది. red-chilli మిరపలో విత్తనోత్పత్తికి అనువైన వాతావరణం కావాలి. మిరప ఉష్ణ, ఉప-ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతుంది. సముద్రమట్టానికి 2000 మీటర్లఎత్తులోనూ పెరుగగలదు. 20-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మిరప ఉత్పత్తికి అనువైనది. అయితే ఈ పంట మంచును తట్టుకోలేదు. మధ్యస్థ వర్షాపాతంతో (60-120 సెం.మీ)లతో కూడిన వెచ్చని, ఆర్ధ వాతావరణం మొక్క పెరుగుదలకు అనువుగా ఉంటుంది. పొడి వాతావరణం కాయ పక్వానికి రావటానికి చాలా ఉపయోగపడుతుంది. 17-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా అధిక ఎండ తీవ్రతతో మిరపలో దిగుబడి పెరుగుతుంది. అయితే ఘాటు (కాప్సైసిన్ పాళ్లు) తగ్గుతుంది. కాయ రంగు కూడా తగ్గిపోతుంది. పూత అభివృద్ధి, కాయ ఏర్పడే దశలలో నేలలో తేమ తక్కువగా ఉంటే పూత, పిందె రాలుతుంది. కాయల పరిమాణం తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా ఉంటే కాయ అభివృద్ధి దారుణంగా పడిపోతుంది. అధిక రాత్రి ఉష్ణోగ్రతలతో కాప్సైసిన్ పాళ్లు పెరుగుతుంది.

పూత లక్షణాలు, సంపర్కం

మిరపలో పూలు సంపూర్ణంగా ఉంటాయి. 2-10 గంటల మధ్య పొద్దుగాల పూట పూలు విచ్చుకుంటాయి. ఆ తర్వాత గంట వ్యవధిలో పుప్పొడిరేణువులు విడుదల అవుతాయి. 8-10 గంటల మధ్య వీటి విడుదల గరిష్ఠంగా ఉంటుం ది. పూత వచ్చిన మొదటిరోజు కీలాగ్రం సంసిద్ధత, పుప్పొడి రేణువుల సామ ర్థ్యం గరిష్ఠంగా ఉంటాయి. అయితే వాతావరణ పరిస్థితులను బట్టిపూలు విచ్చుకోవటం, పుప్పొడి రేణువుల విడుదల ఆధారపడి ఉంటుంది.

వేర్పాటు దూరం

మిరప తరచుగా పరపరాగ సంపర్కం చెందే పంట. దీనికితోడు కూర మిరపతో కూడా సంపర్కం చెందుతుంది. కాబట్టి మిరపలోని రకాలతో పాటు, కూర మిరప రకాలకు దూరంగా విత్తనోత్పత్తి చేపట్టాలి. ఫౌండేషన్ విత్తనానికి 500 మీటర్లు, ధృవీకరణ విత్తనానికి 250 మీటర్ల వేర్పాటు దూరం కచ్చితంగా పాటించాలి.

నేలలు

కర్భన శాతం ఎక్కువగా ఉండి, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక, రేగళ్లు, నల్లరేగడి నేలలు మిరప పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార నేలలు అనుకూలం కాదు.

ఎరువులు

దుక్కి తయారీ సమయంలో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళు ్లబాగా చివికిన పశువుల ఎరువును వేయాలి. అట్లనే 65 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, ౩౦ కిలోల పొటాష్ పోషకాలను ఇచ్చే ఎరువులను వాడాలి. ఒక వంతు నత్రజని, సిఫార్సు మేరకు భాస్వరం, పొటాష్‌లను చివరిగా పొలం తయారప్పుడు వేయాలి. మిగతా నత్రజనిని ప్రధాన ప్రధాన పొలంలో మొక్కలు నాటిన ఆరు వారాల తర్వాత వేయాలి.

విత్తన మోతాదు:

ఎకరానికి 400 గ్రాములు వాడాలి.

విత్తేసమయం:

వానకాలంలో జూలై- ఆగస్టు, యాసంగిలో అక్టోబర్,-నవంబర్ నెలల్లో విత్తటం పూర్తిచేయాలి. విత్తనోత్పత్తి చేపట్టదగిన రకాలు: పూసా జ్వాలా, భాగ్యలక్ష్మీ, ఆంధ్రజ్యోతి, సింధూర్, కిరణ్, అపర్ణ, భాస్కర్, ప్రకాశ్, స్థానికంగా సాగు చేస్తున్న ఇతర సూటి రకాలు. red-chilli3

ప్రధాన పొలంలో నాటడం

5-6 వారాల వయసున్న నారును, బాగా దుక్కి చేసిన ప్రధాన పొలంలో 60X45 సెం.మీ దూరంలో నాటుకోవాలి. నారు మొక్కలు సేకరించే ముందే నారుమడిని తడుపాలి. సాయంత్రం వేళల్లో నాటాలి. నాటిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. ప్రధానపొలంలో మొక్కలు నాటిన 4,5 రోజుల తర్వాత ఎక్కడైనా మొక్కలు చనిపోయి ఖాళీలు ఏర్పడితే వాటిని పూరించాలి. ఆ వెంటనే రెండవ తడి ఇవ్వాలి. మిరప వేళ్లు భూమి పైపొరల్లోనే ఉంటాయి. కాబట్టి తక్కువ వ్యవధుల్లో నీటి తడులివ్వాలి. వాతావరణాన్ని బట్టి వేసవిలో అయితే 4-7 రోజులు, చలికాలంలో అయితే 12-15రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి. మంచు ఎక్కువగా పడుతున్నప్పుడు నీటి తడులిస్తే నేలలో తేమ ఉంటుంది. మిరప మందకొడిగా పెరుగుతుంది. కలుపుతో పోటీని తట్టుకోలేదు. కాబట్టి కలుపు నివారణ సమర్థవంతంగా చేపట్టాలి. ప్రధాన పొలంలో నాటిన 3-4 రోజులలోపు హెక్టారుకు ఒక కిలో పెండిమిథాలిన్ కలుపు మందు ను పిచికారీ చేసి కూడా రసాయన పద్ధతుల ద్వారా కలుపును నివారించవచ్చు.

పూత, పిందెరాలుట

ఆగస్టు-సెప్టెంబర్‌లలో పంట మొదటి దశలో పూత, పిందె రాలుతుంది. దీనిని అధిగమించడానికి 10 పీపీఎం నాఫ్తలిన్ అసిటిక్ ఆమ్లం (4.5 మీటర్ల నీటిలో ఒక మి.లీ ప్లానాఫిక్స్ కలిపి) పూత సమయంలో పిచికారీ చేయాలి. మొదటి పిచికారీకి మూడు వారాల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి.

కల్తీల ఏరివేత

నాణ్యమైన విత్తనోత్పత్తిలో కల్తీల ఏరివేత చాలా ముఖ్యమైన దశ. ఈ దశలో ఒక్కొక్క కాయ ఆధారంగా కాకుండా మొక్క ఆధారంగా కల్తీలను గుర్తించి ఏరివేయాలి. శాఖీయ దశలో ఆకుల పరిమాణం ఆధారంగా, ఆకారం, రంగు ఆధారంగా పూత, కాయలలో కల్తీలను గుర్తించాలి. గుర్తించిన వెంటనే తొలిగించాలి. మొదటి శాఖీయ దశలో, పూత దశలో, పూర్తి కాయ వచ్చిన దశలో కనీసంగా మూడు కల్తీల ఏరివేతలు చేపట్టాలి. ఆకు ఎండు తెగులు, ఆంత్రాక్నోజ్ సోకిన మొక్కలు, వైరస్, విత్తనం ఆశించే తెగుళ్లు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు తొలిగించాలి.

కోత, విత్తన సేకరణ

మిరపపైనే బాగా ఎండిన ఎర్ర మిరప కాయలను కోసి, ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా ఎండిన కాయల నుంచి విత్తనం సేకరించాలి. ఆ తర్వాత విత్తన తేమను 8 శాతానికి వచ్చేలా నీడలో ఆరబెట్టాలి. విత్తన దిగుబడి: రకాన్ని బట్టిహెక్టారుకు 3-5 క్వింటాళ్లు విత్తనం లభిస్తుంది. red-chilli2 dr-p-saidaiah