మొలక శాతం పరీక్షలే ప్రామాణికం

seeds-examine సాగులో విత్తనాలకు చాలా ప్రాధాన్యం ఉన్నది. నాణ్యమైన విత్తనం కీలకం. సిఫార్సు చేసిన మేరకు మొక్కల సాంద్రత ఉంటేనే ఉత్పాదకత, దిగుబడి మేలుగా ఉండి సాగు గిట్టుబాటు అవుతుంది. ఒక్కొక్క పంటలో సిఫార్సు చేసిన విత్తేదూరం ఆధారంగా ఎకరాలో ఉండాల్సిన మొక్కల సంఖ్యను కచ్చితంగా ఉండేట్లు చూసుకోవాలి. ఇందుకు మొలక శాతం అత్యంత కీలకం. మార్కెట్‌లో లభించే ధృవీకరణ విత్తనం లేదా ట్రూత్‌ఫుల్లీ లేబల్డ్ విత్తనం కచ్చితంగా భారత కనీస విత్త న ధృవీకరణ ప్రమాణాలను అనుసరించి విత్తనాలు ఉత్పత్తి చేయాలి. ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా లేకుండా ఉంటే వినియోగదారుల ఫోరంలో సైతం ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు. పొలంలో వేసినతర్వాత మొలక శాతం తక్కువగా ఉంటే పంట నష్టం జరుగుతుంది. కాబట్టి పొలంలో విత్తటానికి ముందే మొలకశాతం పరీక్షించుకోవాలి. మరీ తక్కువగా ఉంటే విత్తనశుద్ధి పద్ధతుల ద్వారా మొలక శాతం పెంచుకోవాలి. ముఖ్యంగా హైబ్రిడ్ విత్తనాల ఖర్చు ఎక్కువ. కాబట్టి ముందస్తుగా కచ్చితంగా మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. విత్తన పరీక్షలు శాస్త్రీయంగా ప్రయోగశాలల్లో లేదా రైతులు కూడా సొంతంగా పరీక్షించుకోవచ్చు. కచ్చితంగా 400 విత్తనాలు పరీక్షలో వాడాలి. 100 విత్తనాలు ఒక గ్రూపుగా అలా నాలుగు గ్రూపులు లేదా 50 విత్తనాలతో 8 గ్రూపులు లేదా 25 విత్తనాలు 16 గ్రూపులుగా పరీక్షించుకోవచ్చు. ఇసుక మాధ్యమంగా: మరీ చిన్నగా లేదా పెద్దగా లేని సమ పరిమాణం ఉన్న ఇసుకను మాధ్యమంగా వాడాలి. అయితే శిలీంధ్రాలు, విషపు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇసుకను తడిపి 1-2 సెం.మీ. లోతులో విత్తనం నాటాలి. ఆ తర్వా త కొద్దిగా బలంతో వాటిని మట్టిలో అదమాలి. విత్తన వ్యాసార్థానికి 1.5 రెట్ల దూరంలో నాటాలి. మక్కజొన్న తప్ప మిగతా పంటల విత్తనాలకు ఇసుక నీటిని నిలుపుకునే సామర్థ్యంలో 50 శాతం, పెద్ద పరిమాణం విత్తనాలు, మక్కజొన్న, అపరాల విత్తనాలకు ఇసుక నీటి నిలుపు సామర్థ్యంలో 60 శాతం నీటి తేమ ఉండేలా చూసుకోవాలి. కాగితం మాధ్యమంగా విత్తన మొలక శాతం పరీక్ష: ఈ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది. ఫిల్టర్ పేపర్ లేదా టవల్ క్రాప్ట్ పేపర్ లేదా బ్లాటర్ కాగితం ఇందుకు వాడవచ్చు. అయితే వేగంగా నీటిని తీసుకునే సామర్థ్యం కాగితాలకు ఉండాలి. బాక్టీరియా లేదా శిలీంధ్రం ఆశించి ఉండరాదు. మొలకల వేర్లు పెరిగేలా ఉండాలి. దానిలోకి చొచ్చుకుని పోకుండా ఉండాలి. కాగితం పైన: నీటితో తడిపిన ఫిల్టర్ కాగితం పెట్టి ప్లేట్‌లో ఉంచి, విత్తనాలు ఒకటి, రెండు పొరల్లో ఉంచాలి. సూర్యరశ్మి సోకే చోట ఉంచి మొలక శాతం పరీక్షించాలి. కాగితాల మధ్య: రెండు కాగితపు పొరల మధ్య విత్తనాలు ఉంచి, గుడ్డలలో నిలువుగా చుట్టి ఉంచాలి. తరచుగా తడుపుతూ తేమ కనీసంగా ఉండేలా చూడాలి. ప్రిచింగ్ (ముందస్తు చలితో శుద్ధి) శరీర ధర్మ సుప్తావస్థ ఉన్న విత్తనాలను ప్రి-చిల్లింగ్‌తో మొలక శాతం పెంచవచ్చు. వ్యవసా య, కూరగాయల విత్తనాలను 5 డిగ్రీలు-10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలో ఏడు రోజుల పాటు, చెట్టు విత్తనాలతో సహా ఇతర విత్తనాలను 3-5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య 7-10 రోజుల పాటు ఉంచితే మొలక శాతం పెరుగుతుంది. ప్రి డ్రైయింగ్: మరికొన్ని మొక్కల విత్తనాలు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఏడు రోజుల పాటు ఉంచితే మొలకెత్తుతాయి. రసాయనాలతో శుద్ధి: 0.2 శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణం శుద్ధితో మొలక పరీక్షకు ఉపయోగించే మాధ్యమాన్ని తడుపాలి. లేదా 50 పీపీయం జిబ్బరెలిక్ ఆమ్లంతో కూడా శుద్ధి చేసిన మాధ్యమంలలో విత్తనాన్ని మొలక పరీక్షకు ఉంచి లెక్క కట్టుకోవాలి. dr-a-geetha