గుండె నిండా అలుముకున్న పండుగ

ఇంటి పంట
ఇక్కడ.. పూజకోసం పూలు బయట నుంచి కొననవసరం లేదు తినడానికి కూరగాయలు బయట నుంచి తేనవసరం లేదు అవసరమైన పండ్లకు అనవసర ఖర్చే లేదు చిన్న చిన్న అవసరాల కోసం బయటకు పరిగెత్తనవసరం అంతకన్నా లేదు. ఆహారం, ఆరోగ్యం, ఆనందం అంతా ఒక్కచోటే. ఇంట్లో సగం అవసరాలకు ఇళ్లు దాటనవసరం లేనిప్రకృతి ఆధారిత జీవనం. నాలుగు గోడలు, కిటికీలు, తలుపులు కాదు ఇల్లంటే.. గూడంటే ఇలాగే ఉండాలి. నిండుగా, గుండె నిండా అలుముకున్న పండుగలా.. garden షణ్ముఖ తండ్రి గారికి గులాబీ మొక్కలంటే చాలా ఇష్టం. ఎంతం టే, ఇంట్లో రకరకాల రంగుల గులాబీ మొక్కలతో ఒక తోట పెంచేం త. ఆ ప్రభావం షణ్ముఖ మనసులో అలాగే ఉండిపోయింది. పెళ్లయ్యాక ఊరి నుంచి తెచ్చుకున్న చామంతులు, గులాబీలతో అమీర్‌పేట ఇంట్లో రెండో అంతస్థు నింపేసారు. అదీ పగిలిపోయిన నీటితొట్లలో. అలా చేస్తూనే నేరేడ్‌మెట్‌లో ఉన్న తమ 300 గజాల ఖాళీ స్థలంలో 40 రకాల గులాబీలు, కొన్ని కొబ్బరి మొక్కలు, నిమ్మ మొక్కలు ఊరి నుంచి తెచ్చి నాటారు.తరువాత 1990వ దశకంలో అదే స్థలంలో 100 గజాల్లో ఇళ్లు కట్టుకున్నారు. 200 గజాల్ల చెట్లకు వదిలేసారు. ఇంటి ముందు పందిరి వేసి తీగజాతి కూరగాయలు, మిద్దెమీద పూల మొక్కలు పెంచారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యం దంపతులు పదేళ్ల క్రితం బి.హెచ్. ఇ.ఎల్‌లో ఇళ్లు కట్టుకోవడంతో ఇక్కడ తన ఆలోచనలను అమలు చేసారు. ముందు ఖాళీ స్థలంలో 50 రకాల వివిధ గులాబీలు వేసుకున్నారు. ఇంటిమీద కుండీల్లో చామంతులు, టమాటా, వంగ, బీర, కాకర పెట్టుకున్నారు. మూడేళ్ల పాటు అలాగే పెంచుకున్నారు. తోటను విస్తరించి మెల్లగా అన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలు పెంచడం మొదలుపెట్టారు. ఇంటిముందు పందిరివేసి సొరపాదును పాకించారు. దానికి వరుసగా వేలాడే గుండ్రని సొరకాయలు చాలా అందమైన దృశ్యరూపా న్ని మన కళ్లముందు ఆవిష్కరిస్తాయి. అందమే కాదు, ఎండాకాలంలో ఈ సొర తీగ తన చల్లని పందిరిగాలితో ఇళ్లంతా ఆహ్లాదాన్ని నింపిందట. ఇక ఇంటిముందు ఆగాకరకు చక్కని పందిరి వేసారు. ఒక స్టాండ్‌కు అడ్డంగా, నిలువుగా కట్టెలు కట్టి తాళ్లతో రెండు అంతస్థుల్లో చిన్న పందిరి వేసారు. ముచ్చటగొలిపే ఈ మినీ పందిరి ఒక్క క్షణం మనల్ని కట్టిపడేస్తుంది. గోడకు పారే గులాబీరంగు డ్రాగన్ ఫ్రూట్స్ నోరూరిస్తాయి. పెరట్లో చిన్న చిన్న టబ్బుల్లో పెంచే రకరకా ల తామరలను (వాటర్ లిల్లీస్) చూస్తే అచ్చెరువొందాల్సిందే. ఇక ఈ ఇంట్లో కిందా పైనా ఎటుచూసినా మొక్కలే. కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, పండ్లమొక్కలు, ఎడారి మొక్కలు, ఔష ధ మొక్కలు. రోజువారీ జీవితానికి అవసరమైన అన్నిరకాల మొక్క లు ఒకే దగ్గరికి చేర్చిన వైనం ముచ్చటగొలుపుతుంది. ఇంట్లో పచ్చదనం కాదు, పచ్చదనం మధ్యలో ఇళ్లు కట్టుకున్నట్టుగా ఉంది. వీటన్నిటినీ చూసుకోవడానికి షణ్ముఖ రోజుకు దాదాపు నాలుగు గంటలపాటు మొక్కల మధ్యే గడుపుతారు. తమ ఇంటిలోని మొక్కలు ఇంత ఆరోగ్యంగా పెరగడానికి పాటింగ్ మిక్స్ దగ్గర నుంచే జాగ్రత్తలు పాటిస్తున్నారు. పాటింగ్‌మిక్స్‌లో 30 శాతం ఎర్రమట్టి, 30 శాతం వర్మికంపోస్ట్, 20 శాతం కోకోపిట్, 10 శాతం నీవ్‌ుకేక్ లేదా వేపపిండి మిశ్రమంగా ఉండేలా చూసుకున్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి దగ్గరగా ఉన్న గోశాల నుంచి ఆవుపేడ, మూత్రం తీసుకవచ్చి జీవామృతం, ఘన జీవామృతం తయారుచేసి వాడుతున్నారు. అంతేకాక కూరగాయల వ్యర్థాలను పేస్ట్ చేసి బకెట్‌లో వేసాక, ఘన జీవామృతం కానీ ఎండిన పేడ గానీ దాని పైన పొరగా వేస్తారు. బకెట్‌నిండిన తరువాత 15 రోజుల్లో ఎరువు తయారవుతుంది. బకెట్ కింద టబ్ పెట్టి, బకెట్ అడుగు రంధ్రంలోంచి పడిన ఎరువు ద్రావణాన్ని 1:10 నిష్పత్తిలో కలిపి వారానికి ఒకసారి మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. మొక్కలకు పురుగు పట్టకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్త చర్యగా వారానికి ఒకసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. తామరకు జీవామృతం వాడటం వల్ల ఆకులు విశాలంగా, పూలు ముదురు రంగులో, పెద్దగా పూస్తున్నాయి. ఒకవేళ మొక్కలకు పేనుబంక వస్తే నీవ్‌ుఆయిల్ వాడుతున్నారు. 1లీటర్ నీటికి ఒక మూత నీవ్‌ు ఆయిల్, కొంచెం సర్ఫ్ కలిపి పిచికారీ చేస్తారు. అపుడు కూడా తెగులు కంట్రోల్ కాకపోతే వెల్లుల్లి, మిర్చి కలిపి మిక్సీ పట్టి, రాత్రి పూట గిన్నెలో వేసి కొంచెం నీరు పోసి, ఉదయం వడగట్టి 1: 10 నిష్పత్తిలో పిచికారీ చేస్తే పూర్తిగా నియంత్రణలోకి వస్తుందంటారు షణ్ముఖ. ఇక మందారలో పసుపు పురుగు కాండాన్ని పట్టి నెమ్మదిగా పైకి వ్యాపిస్తుంది. దీనికి వెల్లుల్లి, మిర్చి కషాయం బాగా పనిచేస్తుంది. మొదట కాండాన్ని బ్రష్‌తో శుభ్రపరిచి తరువాత ఈ కషాయాన్ని వాడాలంటారు. garden2 ఇన్ని జాగ్రత్తలతో అన్నిరకాల మొక్కలు పెంచడం ఒక ఎత్తైతే, ఆర్కిడ్స్ పూలమొక్కలు పెంచడం కొంచెం కష్టమైనదేనంటారు షణ్ముఖ. ఆర్కిడ్స్‌కు ఎండ తగలకూడదు, నీడలో ఉంచాలి. కొబ్బరి బోండాను కట్‌చేసి నీళ్లలో వారంపాటు నానబెట్టాలి. అది మెత్తగా అయిన తరువాత దానిని కుండీలోపల చుట్టూపెట్టి మధ్యలో మొక్క నాటాలి. మొక్క చుట్టూతా బొగ్గు, ఇటుక ముక్కలు ఉంచాలి. ఇవ న్నీ మొక్క నిలబడేట్టు చుట్టూతా గట్టిగా కూర్చాలి. పొద్దున సాయం త్రం నీటిని పిచికారీ చేయాలి. శ్రమ అనిపించినా, ఒకసారి పూలు పూశాక మొత్తం తోటకే అందం తెస్తాయి ఆర్కిడ్స్. ఈ పూలు ఆ తోటకు అందం తెస్తే,తోట మాత్రం ఆమె జీవితానికే అందం తెచ్చిం ది. ఆ మార్పు గురించి ఆమె చెబుతుంటే ఆమె కళ్లలో కాంతి కనిపించింది. ఒకప్పుడు పిల్లల ఫోన్‌ల గురించి ఎదురుచూసేదాన్ని. ఇపుడు వాళ్లు ఫోన్ చేస్తే, నేను లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఆ సమయంలో నేను ఎక్కువ సమయం తోటలో గడుపుతాను. మేడమీదకు వెళితే నాకెవరూ గుర్తుకురారు. మొక్కలే నా పిల్లలు అన్నట్లుగా అదో ప్రపంచంలోకి వెళ్లిపోతాను. దీంతో మానసికి ప్రశాంతతతో పాటు ఆరోగ్యం చాలా బాగుంటుంది. కూరగాయల ఖర్చు, హాస్పిటల్ ఖర్చు తగ్గుతుంది. మేమైతే ఐదారేళ్ల నుంచి అసలు హాస్పిటల్‌కు వెళ్లాల్సిన అవసరమే రాలేదంటారు షణ్ముఖ. అందుకే ఇంటిపంటల్లో ప్రతి ఒక్కరూ తమకున్న పరిధిలో, నిత్యం అవసరమైన అన్నిరకాల మొక్కలు కొన్ని కొన్నిగా నాటుకోవాలంటారు. ముఖ్యంగా ప్రతీ ఆరోగ్య సమస్యకు హాస్పిటల్‌కు పరిగెత్తకుండా మన ఇంట్లోనే తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు పెంచాలంటారు. తిప్పతీగ జ్వరాలు, జలుబులు వచ్చినపుడు చాలా ఉపయోగపడుతుంది. మామిడి అల్లాన్ని నిమ్మరసంలో నానబెట్టి, రెండురోజులపాటు ఎండలో ఉంచి నమిలితే అజీర్తి సమస్య సులువుగా తగ్గుతుంది. వావిలాకు వేడినీటిలో మరగబెట్టి గర్భిణీ స్రీలకు స్నానం చేయిస్తే వళ్లునొప్పులు తగ్గుతాయి. ఇన్సులిన్ ఆకును రెండుపూట లా పరిగడుపున వాడితే రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. మల్టీవిటమిన్ ఆకులు నమిలితే ప్రత్యేకంగా విటమిన్ ట్యాబెట్స్ అవసరం లేదు. లక్ష్మీతరుణి ఆకులను నీటిలో మరగబెట్టి తాగితే క్యానర్ సమస్యకు, స్త్రీల నెలసరి సమస్యల నియంత్రణకు ఉపయోగపడుతుంది అంటూ తమ ఇంటిలో పెంచుతున్న ఔషధ మొక్కల ప్రాముఖ్యాన్ని ఆమె చెప్పుకుంటూ పోతుంటే, తనకు మొక్కల మీద ఉన్న శ్రద్ధ అర్థం అవుతుంది. ఇక తోటకు కావలసిన విత్తనాలను ఎప్పటికపుడు పంట చివరలో సొంతంగా కట్టుకుంటున్నారు. కారట్, క్యాబేజి, కాలిఫ్లవర్, బీట్‌రూట్ విత్తనాలను మాత్రం బయట కొనవలసిందే అంటారు. విత్త నం తనతోట వరకే పరిమితం చేయకుండా, ఇంటిపంటలు చేసుకునేవారందరికీ అందుబాటులో ఉంచుతున్నారు షణ్ముఖ. మట్టిలో నాటే విత్తనాలే కాదు, తన అనుభవాలను కూడా ఎప్పటికపుడు ఎదుటివారితో పంచుకుంటుంటారు షణ్ముఖ. -ఇంటిపంటలు పెంచాలనుకునేవారు మొదట ఆకుకూరలతో ప్రారంభించాలి. ఇవి సులువుగా పెంచుకోవచ్చు. -రెండోదశ లో టమాటా, వంగ, మిరప, బెండ పెంచుకోవాలి. -టమాటా మొక్కలకు బూజు తెగులు వస్తుంది. అది మట్టిలోంచి వేరుకు పట్టేస్తుంది. దీనివల్ల మెల్లగా మొక్క చచ్చిపోయింది.అందుకు మొక్క నాటేటపుడే ట్టి,ఎరువు మిశ్రమంలో వేపపిండి తప్పక కలపాలి. -ఎడారి మొక్కలు (కాక్టస్, సకులెంట్స్) మొక్కలకు 20 రోజులపాటు నీరు పోయకపోయినా తట్టుకుంటాయి. ఆకు కూరలకు రోజ్‌క్యాన్‌తో నీరు పోస్తే మంచిది. కూరగాయ మొక్కలకు ఉదయం, సాయంత్రం కొద్దికొద్దిగా నీరు పోయాలి. -చలికాలంలో కారట్, బీట్‌రూట్, క్యాబేజి, కాలిఫ్లవర్ నాటుకోవాలి. ఇవి వర్షాకాలం పెడితే నీరు ఎక్కువై దుంప కుళ్లిపోతుంది. ఎండాకాలం బెండ,దోస,తోటకూర,గంగవావిలి చాలా బాగా వస్తాయి. -కంటెయినర్‌లలో నీరు నిలువ ఉంచకూడదు. ఎక్కువైన నీరు ఎప్పటికపుడు బయటకు వెళ్లేలా ఒకవైపు రంధ్రం (అవుట్‌లెట్) చేసుకోవాలి. -వంగ ఒక్కో రకం కనీసం 5 మొక్కలు నాటుకోవాలి. బెండ 30 మొక్కలు నాటుకోవాలి. వీటిలో పోయేవి పోను, సరిగా కాయనివి మరికొన్ని పోను, మిగిలిన వాటి నుంచి ఒక కుటుంబానికి సరిపోయేన్ని కూరగాయలు వస్తాయి. -ఆకు కూరలకు 6-8 ఇంచుల లోతు కుండీ, కూరగాయలకు (వంగ, టమాటా,బెండ) 12 ఇంచుల కుండీ,తీగజాతికి ఒకటిన్నర అడుగులలోతు, పండ్ల మొక్కలకు 2 అడుగులు.. కాక్టస్, సకులెంట్స్‌కి 4-5 ఇంచుల మొక్కలు, పూలమొక్కలకు 1అడుగు లోతు కుండీలు ఉండాలి. g గ్రోబ్యాగ్స్‌లో చాలా సులువుగా మొక్కలు పెంచుకోవచ్చు. వీటిని ఎక్కడికైనా సులువుగా మార్చుకోవచ్చు. garden3

షణ్ముఖ ఇంటిమీద పెరుగుతున్న మొక్కలు ఆకుకూరలు

చుక్కకూర, తోటకూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, మునగ, ముల్లంగి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూరగాయలు: ఆనప (2 రకాలు), బీర,చిక్కుడు (4రకాలు), బెండ(2 రకాలు), దొండ, కాకర(3రకాలు), ఆగాకర, టమాటా(4రకాలు), వంగ(5రకాలు),మిర (6రకాలు), దోస, ఉల్లి, వాక్కాయ, కాప్సికం, బీట్‌రూట్, నిమ్మ, క్యారట్, కాలిఫ్లవర్, క్యాబేజి, రెడ్ క్యాబేజి. ఔషధ మొక్కలు: తులసి, లక్ష్మీతులసి, లవంగ తులసి, యాలకులు, ఇరియాలు, వావిలి, కలబంద, వామాకు, నల్లేరు, సరస్వతి ఆకు,బచ్చలి, పొన్నగంటి, ఇన్సులిన్, లక్ష్తీతరుణి, మారేడు, తిప్పతీగ, మరువం, తమలపాకు, మల్టీవిటమిన్, బిళ్లగన్నేరు, ఉసిరి, అల్లం, మామిడిఅల్లం, పసుపు పండ్ల మొక్కలు: మామిడి, జామ, దానిమ్మ, సపోటా, స్ట్రాబెర్రి, మల్బరి, పనస, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ పూల మొక్కలు: చామంతి, గులాబీ , తామర, కనకాంబరం,మల్లె, నందివర్ధనం,గరుడ వర్ధనం, నూరవరహాలు, మందారం, లిల్లి, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, బ్రహ్మకమలం, పారిజాతం, శంఖుపుష్పం, ఆర్కిడ్స్, అడేనియం, గ్రౌండ్ ఆర్కిడ్స్, రాఖి ఫ్లవర్, హెల్కోనియా, జాక్విమోంటియా, ఇపోమియా హార్స్‌ఫాలియా, అరిస్టోలోచియా, బోగన్ విల్లియా, క్యాంప్‌సిస్ వీటితోపాటు పలురకాల ఎడారిమొక్కలు (కాక్టస్,సకులెంట్స్) పెంచుతున్నారు. -ఇతర వివరాలకు షణ్ముఖ గారిని సంప్రదించవలసిన నెంబర్ 95054 13131 -కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455 నేచర్స్‌వాయిస్