పల్లి నిల్వకు మూడు పొరల సంచులు

groundnuts ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్ సూదిని మొదటిసారిగా 2011 నుంచి పల్లీల నిల్వ కోసం ఈ సంచుల ను ఉపయోగించడంపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు. పర్డ్యూ యూనివర్సిటీ సహకారంతో సాగిన ఈ పరిశోధనలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో అనంతపురం జిల్లాలోని కొద్దిమంది ఎంపిక చేసిన రైతులకు ఈ మూడు పొరల సంచులను ప్రయోగాత్మకంగా ఇచ్చి వారిని పల్లి నిల్వకు ఉపయోగించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత రైతుల అభిప్రాయాలను సేకరించినప్పుడు వారు ఈ సంచులు చాలా బాగా పనిచేశాయని చెప్పారు. సంప్రదాయ పద్ధతిలో జనపనార/గోనె సంచులను ఉపయోగించి పల్లి కాయలను నిల్వ చేసినప్పుడు, బ్రూచిడ్ అనే పురుగు త్వరితగతిన వృద్ధి చెంది తీవ్ర నష్టం కలుగజేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మూడు పొరల సంచులను ఉపయోగించినప్పుడు కీటకాలను సమర్థవంతంగా నిలువరించి పల్లికాయల నాణ్యతను కాపాడుకోవచ్చని తేలింది. అంతేగాకుండా వేరుశనగలో విత్తన మోతాదు అధికం. ఎకరానికి దాదాపు 60-80 కిలోల విత్తనం వాడాలి. రైతులు తాము పండించిన వేరుశనగ కాయలను మరలా వచ్చే కాలానికి అంటే దాదాపు 6-8 నెలల వరకు ఈ సంచులలో నిల్వ చేసుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. ఇక్రిశాట్ వారి పరిశోధనలో విత్తన మొలక శాతం కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ సంచులు పల్లి కాయలను కాపాడినట్లు తేలింది. ఈ శాస్త్రీయమైన వేరుశనగ కాయల నిల్వను గుర్తించిన ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్ సూదిని పర్యవేక్షణలో యాభై వేల పిక్స్ సంచులను 17 జిల్లాల్లోని రైతులకు వేరుశనగ నిల్వ కోసం ఇప్పటికే పంపిణీ చేసింది. వ్యవసాయ శాఖ దీన్ని ఒక పథకంగా అమలుచేస్తూ రైతులకు 90 శాతం సబ్సిడీపై ఈ సంచులను అందజేసింది. dr-hari-kishan-sudini