బండ మీద బృందవనం

ఇంటి పంట
గుండెలో తడి ఉంది కాబట్టే, వాళ్లు బండ మీద కూడా పచ్చని వనాన్ని సృష్టించారు ఆ దంపతుల అనురాగ బంధంలానే కాలంతోపాటు దాని పరిమళం గుబాళిస్తున్నది. ఉదయాన్నే ఉడతలు, పిచ్చుకలు, రకరకాల పక్షుల సందళ్లు గోడల మీద, కుండీల మీదా ఎక్కడ చూసినా ముగ్గులు, వర్లీ చిత్రాలు తోట మధ్యలో జాజు రంగు టెర్రాకోట బొమ్మలు నూట యాభై ఏండ్ల నాటి అరుదైన రాతిచిప్పలు తోట మధ్యలో పొడవాటి పనస చెట్టుకు వేలాడే కుండల్లో గూళ్లు పెట్టుకున్న పిచ్చుకలు పచ్చగా విచ్చుకునే సింహాచలం సంపెంగల సువాసనలతో గుప్పుమనే ఈ బృందావనానికి ఆకుపచ్చని వందనం... miniature-garden ఎక్కడ ఆకు పచ్చదనం కనిపించినా మనసు పరవశించిపోవడం విష్ణువందన సహజ లక్షణం. ఆమె చదువుకునే రోజుల్లో వేములవాడ చుట్టుపక్కల విష్ణు వందన ఇంట్లో మాత్రమే రకరకాల పూలు, పండ్లు, కూరగాయల గార్డెన్ ఉండేవట. వాళ్ల అమ్మ ఆసక్తికి, తన అభిరుచి జత చేసి తోటను చాలా అందంగా తీర్చిదిద్దారు విష్ణువందన. పెళ్లయ్యాక హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో అపార్ట్‌మెంట్‌లో వున్నప్పుడు కూడా కుండీల్లో కొన్ని మొక్కలు పెంచారు. కానీ విశాల పెద్ద స్థలంలో గార్డెన్ పెంచాలన్న ఆలోచనతో, దూరభారమైనా అల్వాల్‌లోని జొన్నబండకు తరలారు ఈ దంపతులు. కానీ ఇక్కడ చూస్తే అడుగులోపల అంతా బండే. అందుకే ఈ ప్రాంతానికి జొన్నబండ అని పేరు. ఆ పరిస్థితుల్లో బండ మీద 15 అడుగుల ఎత్తు మట్టి పోసి తోటను సృష్టించా రు. మొదట దాని మీద లాన్ వేసి తరువాత మామిడి, జామ, సంపెంగ, వెదురు, టేబుల్‌పావ్‌ు మొక్కలను నాటారు. 450 గజాల స్థలంలో 250 గజాల్లో తోటను పెంచారు .అందులో కొంతభాగంలో తక్కువ ఖర్చుతో నీటికొలను, వాటర్ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తమ ఆకుపచ్చని కలను పరిపూర్ణం చేసుకున్నారు. మొక్కలతో పాటు దాదాపు పదేళ్ల కాలం కుందేళ్లు, తాబేళ్లు,రకరకాల పక్షులు పెంచారు. ఇద్దరూ ఉద్యోగస్తు లు కావడంతో వాటి సంరక్షణ కష్టమవడం ఒకవైపు, వాటిని బంధించడం సరికాదేమో ఆలోచన మరోవైపు.. దీంతో ఆ పనిని మానుకున్నారు. పూర్తిగా మొక్కల సంరక్షణవైపే దృష్టిపెట్టారు. miniature-garden2 వీరి పోషణలో ఎదగిన ఈ తోట అడుగడుగునా ముచ్చట గొలుపుతుంది. పెద్ద స్థలాన్ని ఆక్రమించే గార్డెన్‌ను చిన్న కుండీల్లో ప్రతిబింబించే మీనియేచర్ గార్డెన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లోతు తక్కువ, కొంచెం వెడల్పు ఉన్న ఒక చిన్న మట్టి కుండీలో చిన్న చిన్న గడ్డి మొక్కలు నాటి, మధ్యలో జేడ్, పైకస్, చైనా ప్లాంట్ మొక్కలను కత్తిరించి, కుదించి వాటి కింద బుద్ధుని ప్రతిమలు,అక్కడక్కడా చిన్న చిన్న ఇల్లు బొమ్మలు, పిల్లల బొమ్మలు అమర్చి మనసులో ఒక ఆకుపచ్చని అందమై న దృశ్యాన్ని ముద్రిస్తారు. వీటిని ఇంట్లో టేబుల్ మీద పెడితే గార్డెన్ అంతా కళ్లముందే ఉన్న ఫీలింగ్ కలుగుతుందంటారు. తోటలోనే కాదు ఇంట్లోనూ నీడలో పెరిగే మనీప్లాంట్ వంటి రకరకాల మొక్కలను గోడల మీద అందంగా అలంకరించారు. ఈ బృందావనంలో ఎక్కడ చూసినా బుద్ధుడు కనిపిస్తాడు. ఎందుకంటే, బుద్ధుడు అంటేనే ప్రశాంతత కదా అంటారామె నవ్వుతూ. మొదట్లో ఇంట్లో కూరగాయ లు పెంచాలన్న ఆలోచన లేకపోయింది. బయట నుంచి తెచ్చే కూరగాయలు, మఖ్యంగా కూరగాయల నుంచి ఒక రకమైన దుర్వాసన రావడంతో తమ తోటలోను, ఇంటిమీదా కూరగాయలు పండించాలనే ఆలోచన చేశారు. ఆకుకూరల నుంచి టమాటా, చెర్రీ టమాటా, వంకాయ, క్యాబేజి, కాకర, కాలిఫ్లవర్, బీట్‌రూట్, పొట్ల, దొండ వంటి పలురకాలు పండిస్తున్నారు. వారం లో మూడు రోజులు ఆకుకూరలు వస్తున్నాయి. వంకాయలు, టమాటలు రోజే వచ్చేవి. ఆ ఉత్సాహంతోనే కూరగాయల పెంపకం మీద మరింత శ్రద్ధ పెట్టారు. మొదట టమాటాకు పిండినల్లి (మీల్లీ బగ్) సమస్య వచ్చింది. వీటిని చేతితో నలిపేయడం, అప్పుడప్పుడూ వేపనూనె పిచికారీ చేయడంతో సమస్యను అధిగమించగలి గారు. miniature-garden4 ఇక ప్రకృతి వనరుల వినియోగం, పునర్వినియోగం పట్ల కూడా వీరికి ఉన్న అవగాహన నగరవాసులందరికీ స్ఫూర్తి కావాలి. ఇంట్లో నుంచి చెత్త బయటికి వెళ్లదు. కాలిపోయే ఆకులు ఒక కుండీలో (పొడి చెత్త),కూరగాయల వ్యర్థాలు (తడి చెత్త) మరొక కుండీలో వేసి ఎరువు తయారుచేసుకుంటున్నారు. మిద్దె మీద పడే వర్షపు నీరు ను పైపుల ద్వారా భూమిలోకి పంపించి ప్రతి చుక్కనూ ఒడిసిపట్టి తోటకూ, ఇంటికీ నీటి కరువు రాకుండా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. మొక్కల మీద వీళ్లకు ఎంత ప్రేమంటే, ఇన్నేళ్ల కాలం లో ఇద్దరూ కలిసి జంటగా బయటకు వెళ్లడం అరుదు. ఒకవేళ వెళ్లినా ఉదయం వెళ్లినా సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రావాల్సిందే. లేకపోతే నీళ్లు లేక వాడిపోయిన చెట్లను చూస్తే మాకు కష్టం, అవెప్పుడూ పచ్చగా కళకళలాడితేనే మా ఇంటికి కళ అంటారు విష్ణువందన. పక్షుల భాష / అర్థం కాలేదా/ చెట్లు నాటినందు కు/ప్రశంసలవి..అని ఆమె తన నానీల్లో రాసుకున్నట్లు, వాళ్లు తోటలో ఉదయం చెట్లకు నీళ్లు పెట్టినపుడు ఆకుల మీద నీటి బిందువులతో పక్షులు సయ్యాటలాడుతుంటా యి. పక్షులు రావడంతో అవి తిని పారేసిన విత్తనాలను తోటలు పడి అక్కడ కూడా జామ, కరివేపాకు, మొక్కలు కనిపిస్తాయి. అవి ఎవరికైనా ఇవ్వవచ్చనే ఉద్దేశంతో అలాగే వదిలేసామంటారామె. వేములవాడలో ప్రముఖకవి మామిడిపల్లి సాంబశివ శర్మ జీవితం రచనల మీద పీహెచ్‌డీ చేసిన విష్ణువందనలో సామాజిక సృ్పహ ఎక్కువ. miniature-garden3 అసలు జనం రకరకాల విషయాల మీద గంటలు గంటలు సమయం వృథా చేస్తున్నారు. వనరులను విచ్చలవిడిగా వాడుతున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. వాడుకోవ డం తెలుస్తుంది. కానీ ఇవ్వడం తెలియడం లేదు. సంపాదన మీద ఉన్న దృష్టి మన ఉనికికి ఆలంబన గా ఉన్న ప్రకృతి మీద ఎందుకు ఉండదనేది ఆమె ప్రశ్న. పక్క బిల్డింగ్ వాళ్లు కొంచెం స్పేస్ వదలకపోవడం వల్ల వెలుతురు లేక ఇష్టంగా పెంచుకున్న పది రకాల మల్లెలు పోయినపుడు నా బాధ చెప్పనలవిగాదంటారామె. 15 ఏండ్ల కిందట మేం జొన్నబండకు వచ్చినపుడు ఇక్కడ వానకాలంలో రోడ్ల మీద విపరీతంగా ఆరుద్ర పురుగులు కనిపించేవి. నగరం క్రమంగా కాంక్రీట్ జంగి ల్ కావడంతో ఇప్పుడవి కనిపించకుండా పోయాయి. అలా కళ్లముందే అరుదైన పక్షులు, మొక్కలు మాయమైపోయాయి. మనిషి మనుగడకు అమ్మలా ఆలంబనగా నిలిచే ప్రకృతికి అణువంతైనా తనవంతు బదులు తీర్చుకోవాలనే తపన అందరిలో ఉంటే ఇలాంటి పరిస్థితి రాదంటారామె. ప్రకృతి పట్ల సామాజిక బాధ్యతతో తన ఆలోచనలకు అక్షరరూపమిచ్చి నానీలు, ఫొటోలకు కొటేషన్లు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు పోస్ట్ చేస్తుంటారు. గత సంవత్సరం వరకు విష్ణువందన ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఉద్యోగం వదిలేసి పూర్తి కాలం మొక్కల ఒడిలోనే సేద తీరుతున్నారు. రామక్రిష్ణ ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. మొక్కలంటే ఇద్దరికీ ఆసక్తి. ముఖ్యంగా విష్ణువందనకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమకు భర్త రామక్రిష్ణ ఎప్పుడూ తోడుగా నిలుస్తున్నారు. మనుషులు ఇద్దరూ ఒకటిగా, భావాలు ఒక్కటిగా గడపడమే ఆనంద జీవితానికి ఇరుసుగా భావించే ఈ దంపతులు తమ జీవితం మొత్తం తోట చుట్టూనే మలుచుకున్నారు. నిమ్మ గడ్డి, నిమ్మ ఆకులు, తులసి, టీ పౌడ ర్ కలిపి సేంద్రియ బెల్లంతో చేసుకున్న టీ తాగుతూ తోట మధ్యలో కూర్చుని, తమ స్పర్శతో ఎదిగి వచ్చిన పచ్చని మొక్కల్ని తనివితీరా చూసుకుంటూ సాయంత్రం వేళ ల్లో సేద తీరుతుంటారు. ఇల్లంటే కేవలం మనుషులే కాదు, నాలుగు మొక్క లు ..వాటి మధ్య నిండైన నవ్వులు.. -కె.క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్ వాయిస్

విష్ణువందన ఇంటి మీద పెంచుతున్న మొక్కలు

వృక్షాలు

పైకస్, రావి, మర్రి, వేప, నిమ్మ, ఉసిరి, మేడి, ఖర్జూర, మారేడు, జమ్మి, బాదం

కూరగాయల మొక్కలు

టమాటా, వంకాయ, మర్రి, కాలిఫ్లవర్, ముల్లంగి, రామములక, చెర్రీ టమాటా

ఆకుకూరలు

గంగవావిలి, పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, బచ్చలి, కరివేపాకు, గోంగూర

తీగ జాతులు:

కాకర, దొండ

పూల మొక్కలు

దేవ గన్నేరు, బిళ్ల గన్నేరు, గోవర్ధనం, గోరిం ట, సీత జడ,బ్లూ బెల్స్, గులాబీ, మందార (10 రకాలు), పారిజాతం, చామంతి, వాటర్‌లిల్లీ, కనకాంబరం, సంపెంగ, మల్లె (బొండు మల్లె, తీగ మల్లె), డే క్వీన్, నూరవరహాలు ( 4 రంగులు), కాగితం పూలు (బోగన్ విల్లియా)

పండ్ల మొక్కలు

మామిడి, జామ, పనస, మల్బరీ, అల్ల నేరేడు, అరటి, బొప్పాయి

దుంప జాతులు

అల్లం, పసుపు, కారట్, బీట్ రూట్, ముల్లంగి, ఆలుగడ్డ

ఔషధ మొక్కలు

తమలపాకు, తులసి, కలబంద (అలోవెరా), బిళ్ల గన్నేరు, నిమ్మ గడ్డి, సరస్వతి ఆకు అలంకరణ మొక్కలు జేడ్ (చైనా తులసి) ఆక్సిజన్‌ను అధికంగా అందించే మొక్కలు స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ వీటితోపాటు మరువం, తమలపాకు ఇంకా ఊరు పేరు తెలియని మొక్కలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. (మరిన్ని వివరాలకు విష్ణువందన కాంటాక్ట్ నెం. 70130 19213)