ఎంత ఎదిగే చెట్టయినా ఇక్కడ ఒదగాల్సిందే

పద్మ.. పేరులోనే కాదు, పనిలోనూ అదే పరిమళం, అదే పచ్చదనం మనిషే కాదు మాట కూడా పూవు లాగానే మృదువుగా, మంత్రంలా.. పెద్ద పెద్ద అడవుల్నే అమాంతంగా ఖాళీ చేస్తున్న కాలంలో ఇంత ఇంటిపై అంత అడవిని పెంచడమంటే ఆషామాషీ పని కాదు ప్రతి మొక్కనూ పసిపిల్లలా లాలించే మాతృత్వపు మధురిమ కావాలి ఆ ప్రేమతోనే, ప్రకృతి పట్ల మమకారంతోనే తాను ఎక్కడకు వెళ్లినా ఒక మొక్కను దత్తత తీసుకుని తన తోటలో ప్రేమతో సాకుతుంది, సొబగులు అద్దుతుంది. నిజంగా.. ఆమె స్నేహితుల మాట అబద్ధం కాదు. పద్మ అంటేనే పట్టణానికి పల్లెటూరి పచ్చదనాన్ని, పరిమళాన్ని అద్దిన ఆకుపచ్చని తల్లి. tree 850 గజాల స్థలంలో 500 మొక్కలు..మాటలు కాదు, 500 మంది పిల్లల్ని పెంచుకున్నట్టే. ఒక హరిత ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టే. వాటికి రెండు పూటలా నీళ్లు పెట్టడం, 15 రోజులకోసారి ఎరువులు అందించడం,తెగుళ్లు వచ్చినపుడు కషాయాలు పిచికారీ చేయడం, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మల్ని కత్తిరించి కుదురుగా కూర్చోబెట్టడం, ఎప్పుడూ తడిగా, పచ్చగా ఉండేందుకు ఎండుటాకులతో దుప్పటి కప్పడం (మల్చింగ్), రాలిన ఆకులను పదిలంగా ఏరి అదనంగా ఎరువును తయారుచేయడం.. ఒకటా రెండా, ఇంట్లో పిల్లవానికి చేయాల్సిన అన్ని పనులు ఇక్కడ చేయాల్సిందే. అందుకే పినాక పద్మకు మొక్కల పట్ల వున్న ప్రేమను, ప్రాధాన్యాన్ని గుర్తించి, జి.హెచ్.ఎం.సి మనం మారుదాం.. మన నగరాన్ని మారుద్దాం అనే కార్యక్రమంలో బెస్ట్ టెర్రస్ హార్టికల్చరిస్ట్ అవార్డును కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆమె అనుభవాలన్నీ శ్రద్ధగా విని మీ ఇంటికి తప్పక వస్తానని అన్నారటాయన. పద్మ చిన్నతనంలో అమ్మమ్మ గారింట్లో పెరిగినపుడు (ఆతుకూరు, కృష్ణా జిల్లా) పెరట్లో తీగజాతులు నాటి ఊరంతా కూరగాయలు పంచేవారట. ఇప్పటికీ ఊరువెళితే పద్మా.. నువ్వెళ్లిపోయావు, మాకు కూరగాయలు లేకుండా పోయాయి అని అంటుంటారని, తనకు చిన్ననాటి నుంచి మొక్కల మీద ఆసక్తిని తన్మయంగా చెబుతుంటారావిడ. కుండీల్లో మొక్కలు పెంచీ పెంచీ తాను కూడా ఆ ఇంటి మీద ఒక మొక్కలా పచ్చగా నవ్వుతూ కనిపిస్తారావిడ. ఇరవై ఐదు వరుసల్లో ఇరవై మొక్కల చొప్పున 450 మొక్కలు, ఇంటి వసారాలో 50 మొక్కలు, మొత్తం 500 మొక్కలు ఈ ఇంటి ఒడిలో పెరిగాయంటే పరుసవేది లాంటి పద్మ స్పర్శే కారణం. మొక్కల పట్ల తన ప్రేమ, అభిరుచితో పాటు ఎన్నోరకాల పోషక ద్రావణాలను, ఎరువులను అందిస్తున్నారు. పద్మ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తమ ఇంటిలో అందుబాటులో ఉన్న పదార్థాలతో పోషక ద్రావణాలను తయారుచేసి అందిస్తున్నారు.

మొదటి పోషక ద్రావణ తయారీ

రెండు కోడిగుడ్లు, 200 గ్రా నూనె (వేపనూనె, కొబ్బరినూనె, వేరుశనగనూనె, నువ్వులనూనె కలిపి), కొంచెం నీరు కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారు. బాగా కలిసిన ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు పోస్తారు. 50 ఎం.ఎల్. ద్రావణాన్ని 1 లీటర్ నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేస్తారు. దీన్ని ఉదయం మాత్రమే మొక్కలకు అందించాలి. సాయంత్రానికి ఆ వాసన పోతుంది. సాయంత్రం అందిస్తే ఆ వాసన రాత్రంతా ఉండి పందికొక్కులను ఆకర్షిస్తుందని పద్మ తన అనుభవంతో చెబుతున్నారు. tree2

రెండవ పోషక ద్రావణ తయారీ

అరకేజీ ఆవచెక్క (మస్టర్డ్ కేక్), అరకేజీ వేరుశనగ చెక్క, 100 కేజీల నల్లబెల్లం మూడింటిని 20 లీటర్ల బకెట్లో కలిపి, పైన పలుచని గుడ్డ కప్పి, 2 రోజులు నీడలో ఉంచాలి. తయారైన ద్రావణాన్ని 5 లీటర్ల చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు అందిస్తారు. వర్మికంపోస్టును నీటిలో కలిపి అందించడం మూడవ పద్ధతి. ఈ మూడు పోషక ద్రావణాలను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్చి మార్చి అందిస్తారు. ఇక వంటింటి వ్యర్థాలను గేటు దాటనీయకుండా, ఇంట్లోనే కంపోస్టు చేసి మొక్కలకు ఎరువుగా అందిస్తున్నారు. మొదటగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని కింది నుంచి అంగుళం ఎత్తులో సగం వరకు దానిని కత్తిరించాలి. బాటిల్ మూతను తీసివేసి రెండు అంగుళాల పైన చుట్టూతా రంధ్రాలు చేస్తారు. కుండీలో మొక్క పక్కన మట్టిలో బాటిల్ గుచ్చుతారు. పైనుంచి వంటింటి వ్యర్థాలు వేస్తారు. ఇది 6-7 రోజుల్లో కుళ్లిపోతుంది. రోజుకు రెండువైపులా మొక్కకు నీరు పోయడం వల్ల ఈ బాటిల్లోంచి ఊరిన చిక్కని ద్రావణం పలుచనైపోయి, మొక్కలు ఎలాంటి హాని చేయదు. మంచి పోషకాలను అందిస్తుంది. తరువాత ఈ కుళ్ళిన పదార్థాన్ని వానపాముల డబ్బాలో వేస్తే, అది 60-90 రోజుల్లో వర్మి కంపోస్టుగా తయారౌతుంది. వానపాముల ద్వారా ఈ వర్మీకంపోస్టే నా మొక్కలకు అసలైన బలం అంటారు పద్మ. వానపాములు దొరకని పక్షంలో బాటిల్లో కుళ్లిన పదార్థాన్ని ఒక కుండీలో వేయాలి. ఆ కుండీకి కింద రంధ్రం చేసి, దానిని కొబ్బరి పెంకు లేదా రాళ్లతో కవర్ చేయాలి. దాని మీద ఒక పొరగా మట్టివేసి, పైన బాటిల్లో కుళ్లిన పదార్థాన్ని వేసి, పైన మళ్లీ మట్టి పొరగా వేసి, కుండీని ఎండ, వాన తగలని ప్రదేశంలో ఉంచాలి. 30 రోజుల్లో మంచి ఎరువు తయారవుతుంది. ఇక ఎండుటాకులు ఎక్కువగా దొరికే సమయంలో వాటిని సేకరించి, డిప్పలో వేసి, నిండుగా నీళ్లుపోయాలి. ఆకులు నీటిలో 34 రోజులపాటు నానిన తరువాత వాటిని గాలి చొరబడని సిమెంటు లేదా ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి, మూత గట్టిగా బిగించి, చెట్టు కింద నీడలో ఉంచాలి. నెలరోజుల్లో మెత్తని ఎరువు తయారవుతుంది. earth-worms ఈ రకమైన సహజ పోషక ద్రావణాలు, ఎరువులు అందిస్తూ కుండీల్లో మల్చింగ్ చేయడం ద్వారా మొక్కలు ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతుంటాయి. రోడ్డు పక్కన దొరికే కానుక ఆకు, తోటల్లో రాలిన ఆకులు, గోనెసంచులతో మల్చింగ్ చేస్తారు. దీనివల్ల మల్చింగ్ చేసిన పొర కింది భాగంలో ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధరకాల సూక్ష్మ జీవరాశితో కూడిన సూక్ష్మ వాతావరణం వృద్ధి చెందుతుంది. పెద్ద కుండీల మీద చిన్ని చిన్న కుండీలు ఉంచడం వల్ల వాటికింది ఎప్పుడూ తడిగా ఉండి, వానపాములు తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తుంటాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు తెగుళ్ల సమస్యలు తప్పదంటారు పద్మ. పేనుబంకకు పసుపు, బూడిద కలిపి జల్లుతారు. తెల్లనల్లికి, వైట్ ఫ్లై సమస్యకు గంజి, ఇంగువ, కుంకుమ రసం కలిపి పిచికారీ చేస్తారు. అగ్న్యాస్తం పిచికారీతో సపోటకు పట్టిన పురుగు సమస్యను పరిష్కరించుకున్నారు. చాలామంది మొక్కలకు చీమల సమస్య గురించి సతమతమవుతుంటారు. ఇందుకు దాల్చిన చెక్క, పసుపు, మెంతులపొడి కలిపి జల్లితే కొంతవరకు పరిష్కారం దొరుకుతుంది అంటారు పద్మ. ఇక పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే, ఎర్రమట్టి 30 శాతం, వర్మికంపోస్టు 30 శాతం, ఎండుటాకుల కంపోస్టు 30 శాతం, ఇసుక 10 శాతం కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో నింపుతారు పద్మ. చాలామంది కోకోపిట్ కూడా వాడుతుంటారు. కాని వరిపొట్టు, వేరుశనగ గింజల పొట్టును మిక్సీ వేసుకుని వాడుకుంటే సరిపోతుందంటారామె. ఒక అడవిలో ఎంత సహజంగా మొక్కలు పెరుగుతాయో, అంతే సహజంగా, జాగ్రత్తగా మొక్కలు పెంచబట్టే ఇక్కడ ఎక్కడ చూసినా తేనెటీగలు కనిపిస్తాయి. ముఖ్యంగా మిద్దెతోటల్లో ఫలదీకరణం (పాలినేషన్) సమస్య ఉంది. పూర్తి సహజ పద్ధతుల్ని అనుసరించడం వల్ల తేనెటీగలు చేరి, మిద్దెతోటల్లో మంచి ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంది అంటారు పద్మ. మరి అంత పెద్ద పెద్ద చెట్లు కూడా ఇంత చిన్న కుండీల్లో ఎలా కుదురుకున్నాయని అడిగితే, పూలు, కాయలు వచ్చిన తరువాత పైభాగంలో కొమ్మలను పూర్తిగా కత్తిరిస్తాం. అప్పుడు చెట్టు కొమ్మల పక్కన మళ్లీ చిగురు వచ్చి ఎదుగుతాయే తప్ప పైకి పెరగవు అని చెప్పారు పద్మ. ఐదో ఏడులోకి అడుగుపెట్టిన ఈ తోటలో ఎటు చూసినా అచ్చెరువొందాల్సిందే. tree3 అసలు ఏ సీజన్‌లో కాసే పండైనా, పూసే పూవైనా ఇక్కడ దొరకాల్సిందే. పద్మ పదిహేనేళ్ల కిందట నానమ్మ ఇంట తెచ్చిన మర్రి, జువ్వి మహావృక్షాలు చిన్న చిన్న కుండీల్లో చిన్న పాపల్లా ఒదిగిపోవడం, పండ్ల చెట్లకు తాళ్లు కట్టి కూరగాయలకు వర్టికల్ పందిళ్లు వేయడం, మూడడుగుల నిమ్మచెట్లు గుత్తులు గుత్తులుగా కాపు కాయడం, నలభై అడుగులకు పైగా పెరిగే సీమచింత ఆరడుగుల్లో కాయలు కాయడం.. ఇలా అడుగడుగునా ఆశ్చర్యాలు.. ఆనందాలు. అయితే ఇదంతా నా ఒక్కదాని వల్ల కాదు. మా ఆయన శ్రీనివాస్, అమెరికాలో ఉండే ఇద్దరు పిల్లలు శ్రీమంత్, యశ్వంత్ ఎప్పటికప్పుడు కొత్త మొక్కల్ని ఈ తోటలోకి ఆహ్వానించడం వల్లే ఇదంతా సాధ్యమైందంటారు పద్మ. ఇంతకీ ఈ గార్డెన్ వల్ల మీకేం ప్రయోజనమంటే, రసాయనాలు లేని కూరగాయలు,ఆసుపత్రి అవసరం లేని ఆరోగ్యం, పర్యావరణానికి ప్రయోజనం,ఎండాకాలంలో పట్టపగలు ఎ.సి అవసరం లేని చల్లదనం,అన్నిటికీ మించి ఆత్మసంతృప్తి.. నిజమే..ప్రకృతి తోడుగా జీవించే ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి. - కె. క్రాంతికుమార్ రెడ్డి నేచర్స్ వాయిస్

పద్మవనంలో పెరుగుతున్న మొక్కలు

పండ్ల రకాలు

జామ, చైనా జామ, తైవాన్ జామ, నిమ్మ, గజనిమ్మ, స్వీట్ లైవ్‌ు, టేబుల్ నిమ్మ, దబ్బకాయ, నారింజ, టర్కీ అంజూర్, పూనా అంజూర్, ఆపిల్ బేర్, దానిమ్మ, సపోట, కమల, బత్తాయి, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, ఫాల్సా (బంగ్లాదేశ్), ఇండియన్ చెర్రీ, బార్బడాస్ చెర్రీ, నేరేడు (నాటు), నేరేడు(హైబ్రిడ్), స్టార్ ఫ్రూట్, చింత, సీమ చింత, స్వీట్ టామరిండ్ (చైనా), వాక్కాయ, పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి, అవకాడో, మామిడి (5 రకాలు..రసాలు, చెరుకు రసాలు, తైవాన్ మామిడి, రుమాలియా, బంగినపల్లి), డ్రాగన్ ఫ్రూట్, లిచి, న్యూజిలాండ్ యాపిల్, సిమ్లా ఆపిల్, కొబ్బరి, పనస, అరటి, బొప్పాయి, సీతాఫలం, ద్రాక్ష, వెలగ, రేగు

కూరగాయ మొక్కలు

టమాటా, వంగ, బ్రాకోలి, క్యాబేజి, బెండ, క్యారట్, మునగ, పచ్చి మిర్చి

తీగ జాతి మొక్కలు

బీర, సొర, కాకర, దొండ, దోస, పొట్ల

ఆకుకూరలు

పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, తీగబచ్చలి, కేరళ బచ్చలి, కొత్తిమీర, పుదీనా

పూల మొక్కలు

చామంతి, గులాబీ, మందార, గన్నేరు, డెజర్ట్ రోజ్ (15 రకాలు), కనకాంబరం, మరువం, ఆర్కిడ్, నిత్యమల్లి, బంతి, బ్రహ్మకమలం, పీస్ లిల్లీ, కలువ, పూదానిమ్మ, మల్లె (7 రకాలు..బొడ్డు మల్లె, దొంతర మల్లె, పొడవు మల్లె, విరజాజి, సూది మల్లె, డబుల్ మల్లె, త్రిబుల్ మల్లె)

ఔషధ మొక్కలు

తులసి, అలోవెరా, ఇన్సులిన్, జేడ్ (చైనీస్ తులసి)

సుగంధ ద్రవ్యాలు

లవంగాలు, మిరియాలు, యాలకులు, జాజిపత్రి

వృక్ష జాతులు

మర్రి, వేప, జువ్వి, అగ్నిపూలు, రావి, సైకస్, నల్లతుమ్మ, మారేడు. వీటితో పాటు అత్తిపత్తి (టచ్ మి నాట్), ఆముదం, తమలపాకు, మక్కజొన్న, నిమ్మగడ్డి వంటి పలురకాల మొక్కలు ఈ మిద్దెతోటలో కనిపిస్తాయి. (ఇతర వివరాలకు పద్మగారిని సంప్రదించవలసిన నంబరు 9440643065)