ఇంటిపంటలే ఆరోగ్యానికి ఇంధనం

ఎక్కడి పంటలు అక్కడే పండించుకుని ఏపూటకాపూట సహజంగా పండిన తాజా కూరగాయలను తినడమనేది శారీరక,మానసిక ఆరోగ్యానికి మాత్రమే పరిమితమైనది కాక దూరప్రాంతాల నుంచి రవాణా ఖర్చులు,ఇంధనం ఆదా చేయడం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నది. ఇంటిపంట అనేది కేవలం ఇంటికి సంబంధించినదే కాదు, జాతి వనరుల పరిరక్షణకు చెందినది కూడా.. అందుకే ఫుడ్ మైల్స్‌ను తగ్గించే లోకల్లీ గ్రోన్ అనే కాన్సెప్ట్‌కు విదేశాల్లో చాలా విలువ ఉన్నది. మన దగ్గర కూడా వాటికి క్రమంగా ప్రాధాన్యం పెరుగుతున్నదంటారు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.3,శ్రీనికేతన్ కాలనీకి చెందిన పొట్లూరి రాజశేఖర్. home-crop రాజశేఖర్ 2017లో మొదట ఏడు (6 X3 =18 చదరపు అగుగులు) హై ఇంపాక్ట్ పాలిస్ట్రీన్‌తో తయారైన తొట్లతో 126 చదరపు అడుగుల మిద్దెతోటను ప్రారంభించారు. మట్టి అవసరం లేకుండా కోకోపిట్, వర్మికంపోస్ట్ (4:4:1) ను పాటింగ్ మిక్స్‌గా వాడారు. మట్టి ఎక్కువ వాడితే డాబాపై ఎక్కువ బరువు పడే ప్రమాదం వున్నది. బరువు తక్కువగా ఉండటం వల్ల కోకోపిట్‌ను ఎక్కువగా ఉపయోగించారు. మడిలోని ఆరు అడుగుల లోతు ఎరువు మిశ్రమంలో 6 రకాల ఆకుకూరలు, క్యాబేజి, కాలిఫ్లవర్, బెండ, టమాటా, వంగ, మిర్చి వంటి కూరగాయలను పండించారు. వీటితో పాటు ప్రతీ బెడ్‌లోను ఒక తీగజాతి మొక్క నాటి (సొర, దొండ, కాకర, బీర, చిక్కుడు) ఇన్సులేటెడ్ జి.ఐ వైర్ పందిరి మీదకు పాకించారు. మొదట్లో కొంత దొండ, బీర, సొర, టమాటాను తెగుళ్లు కొంత ఇబ్బందిపెట్టాయి. దొండను గొంగలి పురుగు ఆశించినపుడు ఆకుల్ని ఎప్పటికపుడు తెంచి బయటపడేసేవారు. చిక్కుడును పేనుబంక (ఆకు వెనుక భాగంలో నల్లగా,చిన్నగా కనిపించే ఆఫిడ్స్) ఆశించినపుడు 30 ఎం.ఎల్ ఎడిబుల్ వెనిగర్‌ను 1లీ. నీటిలో కలిపి పిచికారీ చేశారు. టమాటా, సొర, బీర ఆకుల వెనుక తెగుళ్ల సమస్య వచ్చినపుడు పసుపు నీళ్లు చల్లి, దానిపై కట్టె బూడిద చల్లారు. ఒకసారి తోట తన నియంత్రణలోకి వచ్చి, మొక్కలు కుదురుకున్నాక చిన్న చిన్న తెగుళ్ల సూచన కనిపించినపుడు,15 రోజులకొకసారి వేపనూనెను నీటిలో కలిపి ఆకుల పైన, వెనుక భాగంలో పూర్తిగా తడిసేంత వరకు పిచికారీ చేస్తున్నారు. home-crop2 ఇక ఆకుకూరలకైతే ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదంటారు. క్యాబేజి,కాలిఫ్లవర్‌ను పెద్ద స్ధాయిలో సాగు చేసేటపుడు విపరీతంగా రసాయనాలు వాడతారు. కానీ ఇంటిమీద చిన్నస్థాయిలో పండించినపుడు,ఇక్కడ ఎలాంటి రసాయనాలు ఉపయోగించం కాబట్టి అంత పెద్దగా పెరగవు అంటారు రాజశేఖర్. తెగుళ్ల సమస్య తగ్గి, పచ్చగా విప్పారాక దొండ రోజుకు అర కేజీ చొప్పున కాసేది. 10 టమాటా మొక్కల నుంచి ఒక్కరోజు 4కేజీల ఉత్పత్తి వచ్చింది. అది నా తోటలో రికార్డ్ అంటారు రాజశేఖర్. తోటను విస్తరించి మొత్తం 2000 చదరపు అడుగుల స్థలంలో కేవలం నాలుగోవంతును మిద్దెతోటగా మలిచారు. మొక్కల పెంపకానికి ట్రఫ్‌లతో పాటు మట్టి కుండీలు, ఫెల్ట్‌తో చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. పెద్ద మడులలో (ట్రఫ్) రెండు మూడు రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఒకే మడిలో పలురకాల పంటలు పండించడం వల్ల తెగుళ్ల నియంత్రణ చాలా సులువంటారు. ఇక మొక్కలకు తగిన నీటిని అందిస్తూ,తీగజాతి కూరగాయల నీడలో క్యారట్,బీట్‌రూట్‌ను (నాలుగు నెలల పంట కాలం) మండే ఎండల్లోనూ పండిస్తున్నారు. వీటన్నిటి నుంచి నెలకు సుమారుగా 30-40 కేజీల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి సుమారుగా ఇంట్లోని ఏడుగురికి సరిపోతున్నాయి. ఒకప్పుడు నెలకు కూరగాయలకు 2500 రూపాయలు ఖర్చు అయితే, ప్రస్తుతానికి 500 మాత్రమే ఖర్చు అవుతుందంటున్నారు రాజశేఖర్. అసలు ఇంటికి అవసరమైన ప్రతిదీ మన ఇంట్లోనే పండిచుకోవాలనే ఆలోచనతో కొద్దిమొత్తంల వేరుశనగ కూడా పండించారాయన. home-crop3 ఇక ఇంటిపంటల్లో విత్తనాలు, ఎరువు మిశ్రమం, కుండీతో పాటు నీటి యాజమాన్యం చాలా కీలకమైందంటారు రాజశేఖర్. మొక్కలకు ఎక్కువ నీళ్లు పెట్టడం కూడా మంచిది కాదు. దానివల్ల కింద తడి ఎక్కువగా ఉండి మొక్కకు మిల్లీబగ్ లాంటి తెగుళ్లు ఆశించే అవకాశం అధికంగా ఉంది. సాధారణంగా ఒక ట్రఫ్‌కు (6 X 3) సాయంత్రం వేళలో 10 లీటర్ల నీరు పెడితే సరిపోతుంది. తొట్టిలోని మట్టిలో ఒక ఇంచు లోతుకు వేలు పెట్టి చూసినపుడు తడి తగిలితే మొక్కకు వెంటనే నీరు అవసరం లేదని అర్థం. ఒకవేళ పూర్తిగా పొడిబారితే మాత్రం తగినంత నీళ్లు పోయాలి. కాలాలననుసరించి నీటి యాజమాన్యం పాటించాలని రాజశేఖర్ తన అనుభవంలో చెబుతున్నారు. ఎప్పటికపుడు కావలసిన పోషకాల కోసం మాత్రం నెలకోసారి మాగిన పశువుల ఎరువు మడుల్లో వేస్తున్నారు. home-crop4 ఇక అరోమాటిక్ ప్లాంట్స్‌ను ఇండోర్‌లో పెంచుకుంటే వాతావరణాన్ని శుద్ధిచేసి, ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. ఇండోర్‌లో స్నేక్‌ప్లాంట్‌ను వంటివి పెంచుకుంటే గాలిలో ఆక్సిజన్ స్ధాయిని పెంచుతాయని అంటారు. ఎలాంటి ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టవ్‌‌సు అవసరం లేకుండా చాలా కంపెనీలు ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలు కావాలనుకునేవారు గచ్చిబౌలిలోని ప్రభుత్వరంగ సంస్థ EPTRI ( Environmental Protection Training and Research Institute) ఇండోర్‌లో పెంచుకునే మొక్కలు గురించి అవగాహన కల్పిస్తూ, మొక్కలను అందుబాటులో ఉంచింది. నేను కూడా అక్కడి నుంచే అవగాహన పొందానని అంటారాయన. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో అమ్మేవి ఎంతవరకు నిజమో తెలియదు కాబట్టి, ఉన్న కొద్ది స్థలాన్ని వినియోగించుకుని కూరగాయలు పండించుకోవాలని నగరవాసులకు సూచిస్తున్నారు రాజశేఖర్. కాయకష్టానికి మించిన వ్యాయామం లేదు అని మహాత్మాగాంధీ చెప్పినట్టు, మిద్దెతోటలో ఉదయం, సాయంత్రం గంట సేపు పనిచేస్తే దానిని మించిన శారీరక, మానసిక వ్యాయామం లేదు. ఒకసారి మనం పండించుకుని తింటే మళ్లీ బయటకొనాలనే ఆలోచనే రాదు. ప్రకృతిలోకి రోజూ వెళ్లడం పట్టణవాసులకు సాధ్యం కాదు కాబట్టి,దానికి ప్రతిరూపమైన మిద్దెతోటను ఏర్పాటు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయంటారాయన. - కె.క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్ వాయిస్ home-crop5