పంట దిగుబడికి ఎరువులు అక్కరలేదు

fertilizers పంటలు పండాలంటే ఎరువులు చల్లాల్సిందేనా? రసాయన ఎరువులు వాడాల్సిందేనా? ఈ రెండు లేకుండా పంటలు పండించలేమా? ఆఖరికి పెంట కూడా కొట్టకుండా విత్తనాలు చల్లి నీళ్లు కడితే చాలదా.. ఈ ఆలోచనకు కార్యరూపమిస్తే ఎలా ఉంటుందో ఓ ఫార్మాసిస్టు ప్రయత్నించాడు. ఒకటీ రెండు పంటలు కాదు.. ఏకంగా నాలుగేండ్లుగా ఎనిమిది పంటలు పండించి అందరినీ అబ్బురపరిచాడు. ఎరువులు చల్లి, మందులు కొట్టి పంటలు పండించిన బంధువులు, గ్రామస్తుల కంటే అధికంగానే దిగుబడి సాధించి శభాష్ అనిపించుకున్నాడు. మందులు చల్లకుండా వడ్లు పండిస్తాడట! చదువుకున్నోడికి ఏం తెలుసు.. ఇక చూద్దాం. ఎంత పండిస్తాడోనంటూ రోజూ అవమానించిన నోళ్లు ఇప్పుడు ప్రశంసలతో ముంచేస్తున్నారు. అందరూ బియ్యం కిలో రూ.25 కి అమ్మితే అతడేమో రూ.60లకు పైగానే విక్రయిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. ఇదెక్కడో కాదు.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాలలో ఎంఫార్మాసీ చదివిన కల్లెట్ల అరుణ్‌సాగర్ సాధించిన పంట దిగుబడి.

ఆలోచన ఇలా..

ఎంఫార్మసీ చదివిన అరుణ్‌సాగర్‌కు తన ప్రాంతంలో ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి బాగా తెలుసు. అసలే కరువు ప్రాంతం. ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బందులకు గురవుతున్న జనం. ప్రతిరోజూ ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే తప్ప నిద్రపట్టని దుస్థితి. ఇలాంటి దుస్థితిలో ఇంకనూ మందులు, రసాయనాలు చల్లి పండించిన పంటలనే తినడం వల్ల మరింతగా ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలాంటప్పుడు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల వచ్చే ఆర్థిక నష్టమేమి టో చూడాలనుకున్నాడు. ఎలాగైనా నష్టం వచ్చినా ఎరువులు చల్లకుండా, మందులు కొట్టకుండా వడ్లు పండించాలని నిర్ణయించుకున్నాడు. ఊర్లో తన కుటుంబానికి ఉన్న పొలంలోనే ప్రయోగం చేయాలనుకున్నాడు. వరంగల్ బీపీటీ రకం విత్తనాలనే ఎంచుకున్నాడు. మండలంలో మిగిలిన గ్రామాల్లోని చెరువులు ఎండిపోయాయి. కానీ కొట్టాలలోని చెరువులో మాత్రం ఏ కాలమైనా నీళ్లు ఉండటం గమనార్హం. వర్షపు నీటి కాపాడుకుంటున్నారు. దాంతో చెరువు కింది బోరుబావుల్లో నీళ్లకు డోకా లేదు.

క్రమేణా పెరిగిన దిగుబడి

మొదటి ఏడాది అర ఎకరంలో ఎంత కష్టపడినా నిరాశే మిగిలింది. 50 శాతం తాలే వచ్చింది. దాంతో ఊర్లో చూసిన వాళ్లందరూ అవమానించారు. అయినా వెనుకడుగు వేయలేదు. మొదటి ఏడు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో ఏడాది 13 క్వింటాళ్లు, మూడో ఏడాది 16 క్వింటాళ్లు, నాలుగో ఏడాది 18 క్వింటాళ్ల దిగుబడిని సాధించాడు. మందులు, రసాయనాలు చల్లిన వారి కంటే అధిక దిగుబడిని పొందాడు. దీంతో అవమానించిన నోళ్లన్నీ ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి. అదనంగా పైసా ఖర్చు లేకుండా అధిక దిగుబడిని సాధించిన అరుణ్‌సాగర్ ఓ పెద్ద రైతుగా మారాడు. సాధారణ పద్ధతిలో అరెకరంలో 8 క్వింటాళ్లు కూడా రావడం లేదు. సాధారణ పద్ధతిలో పండించిన బియ్యాన్ని కిలో రూ.25 నుంచి రూ.30 వరకు పలుకుతున్నది. కానీ అరుణ్‌సాగర్ సేంద్రియ పద్ధతిలో పండించడంతో డిమాండు పెరిగింది. దాంతో కిలో రూ.60లకు పైగానే పలుకుతున్నది. పైగా తక్కువ విస్తీర్ణంలో వేయడం వల్ల తన బంధుమిత్రులకే సరిపోవడం లేదు. ఇలాంటి సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యం అంటూ కార్పొరేట్ కంపెనీలైతే కిలో రూ.150 నుంచి రూ.200లకు విక్రయిస్తున్నారు. అందుకే ఇప్పుడు అరుణ్‌సాగర్ సేంద్రియ విధానాన్ని తెలుసుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు వస్తున్నారు. fertilizers2

సొంతంగా తయారీ

కొట్టాలలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఫార్మసిస్టు అరుణ్‌సాగర్ ఏ మందులు చల్లడం లేదు. కానీ సొంతంగా జీవామృతాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఆవు మూత్రంతో మందులను రూపొందిస్తున్నాడు. బ్రహ్మాస్త్రం(ఉమ్మెత్త, వేప, జిల్లెడు, సీతాఫలం, పల్లేరుకాయల మిశ్రమం) కషాయాన్ని తయారుచేస్తున్నాడు. దాన్ని రెండు కిలో ల బ్రహ్మాస్ర్తాన్ని 20 కిలోల ఆవు మూత్రంలో ఉడికిస్తాడు. ఏడు కిలోల వరకు ఆవిరి అవుతుంది. దీన్నే కీటక నాశనకారిగా వినియోగిస్తున్నాడు. ఒక లీటరు కషాయంలో వెయ్యి లీటర్ల నీట్లో కలిపి పంటకు స్ప్రే చేస్తున్నాడు. దాంతో ఎలాంటి తెగులు రావడం లేదు. ఇలాగే దశపర్ణి కషాయం(పది రకాల ఆకుల వినియోగంతో చేసేది)ను కూడా వినియోగించొచ్చు. కానీ అరుణ్‌సాగర్ మాత్రం ఐదు ఆకుల మిశ్రమంతోనే అధిక దిగుబడిని సాధిస్తుండటం గమనార్హం. - శిరందాస్ ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి organic-agriculture

సేంద్రియ వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం

మా ప్రాంతం కరువు, ఫ్లోరైడ్‌తో ఇబ్బంది పడుతున్నది. అయినా వ్యవసాయాధారిత గ్రామాలే. కానీ మందులు, రసాయనాలు లేకుండా ఏ పంట పండించడం లేదు. అందుకే ప్రజలంతా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి వాటికి చరమగీతం పాడాలంటే నాణ్యమైన ఆహారమే శ్రేయస్కరం. అందుకే సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి నిరూపించాలనుకున్నా. గ్రామభారతి సంస్థలో అనేక విధానాలను అధ్యయనం చేశాను. జీవామృతం, బ్రహ్మాస్త్రం వంటి వాటితోనే అధిక దిగుబడిని సాధిస్తున్నాం. మొదట మా ఊరోళ్లందరూ అవమానించారు. మన ఊర్లో ఇలాంటివి చెల్లవన్నారు. దిగుబడి రాదన్నారు. నిజంగానే రెండేండ్ల వరకు దిగుబడి తక్కువగానే ఉన్నది. ఆ తర్వాత భూమి స్వభావం మారింది. ఇప్పుడు వాళ్ల కంటే ఎక్కువ దిగుబడి సాధ్యమవుతున్నది. వాళ్లు బియ్యాన్ని కిలో రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. మేం కిలో బియ్యానికి రూ.60లకు పైగా పలుకుతున్నది. అది కూడా మేం మా బంధు మిత్రులకే విక్రయిస్తున్నాం. సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యాన్ని కార్పొరేట్ కంపెనీలు రూ.200 వరకు అమ్ముతున్నాయి. మేం వరితో పాటు మక్కజొన్న కూడా ఇదే విధానంలో పండించాం. మా ఊరంతటినీ సేంద్రియ వ్యవసాయం చేయాలన్న లక్ష్యం తో పని చేస్తున్నాం. - కల్లెట్ల అరుణ్‌సాగర్, యువ రైతు, కొట్టాల, మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లా