ఆయిల్‌ఫామ్‌లో తెల్లదోమ నివారణ

oil-farm పామాయిల్ తోటలకు వ్యాప్తి చెందుతున్న సర్పిలాకార తెల్లదోమ వల్ల రైతులు గత నెలరోజుల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతకాలం ఇతర దేశాలకు, రాష్ర్టాలకు పరిమితమైన ఈ దోమ గత రెండు నెలల నుంచి తెలంగాణకు వ్యాప్తి చెందినట్లు ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ సాగు చేసే రైతులను అప్రమత్తం చేయడానికి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. తొలుత అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ దోమ ఉధృతిని అక్కడి పరిశోధకులు గుర్తించారు. 2016 సంవత్సరంలో కేరళ, తమిళనాడు రాష్ర్టాలలోని కొబ్బరితోటలను ఆశించింది. 2017 సంవత్సరంలో ఈ దోమ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 2019 ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ ప్రాంతంలోని ఆయిల్‌ఫామ్ పంటలకు వ్యాప్తి చెందినట్లు అధికారు లు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెల్లదోమ దాదాపు 20 రకాల పంటలపై ప్రభావం చూపుతుందన్నారు. మొక్కల ఆకులపైనే కాకుండా ఇతర ప్రాంతాలపై భాగాలపై కూడా గుడ్లను పెడుతుందని స్పష్టమైం ది. ఆకుల అడుగు భాగం దళసరిగా ఉండే సపోట, మామిడి మొక్క ల్లో ఈ దోమ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని తెలిపారు. అయితే కొబ్బరి, ఆయిల్‌ఫామ్‌లలో ఈ తెల్లదోమ తన జీవన చక్రాన్ని పూర్తి చేసే అవకాశం ఉన్నది.

తెల్లదోమ వ్యాప్తి..

ఈ తెల్లదోమ 25 మి.మీ శరీర ఆకృతిలో తెల్లటి రెక్కలు కలిగి, వాటిపై గోధుమ వర్ణన చారలు కలిగి ఉంటుంది. సాధారణ తెల్లదోమ కంటే ఈ సార్సిలాకర తెల్లదోమ పొడువు ఎక్కువగా ఉంటుంది. ఆకుల అడుగు భాగాన నడుమ ఈనె సమీపంలో వర్తులాకారంలో గుడ్లు పెడుతుంది. చీడ ప్రభావం బట్టీ ప్రతీ ఆకుపై 13-30 వరకు వర్తులాకారంలో గుడ్లను గుర్తించవచ్చు. ఈ రకం చీడ గుడ్లను పెట్టే సమయం లో చుట్టూ మైనంలాంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ పదార్థం గుడ్లు పొదిగే వివిధ దశలలో ఇతర జీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. గుడ్డు పసుపు, బంగారు రంగులలో 0.3 మి.మీ పొడువు ఉంటుంది.

నష్ట ప్రభావం

తెల్లదోమ ఎదిగిన కొద్దీ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తూ నష్టాన్ని కలుగజేస్తాయి. అవసరానికి మించి రసాన్ని పీల్చడం ఈ దోమల ప్రధాన లక్షణం. తద్వారా రసం మధు బిందువుల రూపంలో అదే మొక్క కింద గాని ఆకుల మీద కానీ పడుతుంది. జిగటగా ఉండే ఈ బిందువులు సూర్యకిరణాలు ప్రసరించగానే మెరుస్తుంటాయి. వాతావరణంలో ఉండే ఇతర శిలీంధ్రాలు ఆకర్షించబడి వాటి మీద సైతం వృద్ధి చెంది నల్లటి మసిపూతను కలుగజేస్తాయి. దీనిమూలంగా ఈ ఆకులపై నల్లటి మసిపొర ఏర్పడి ఆకులు, మొక్కలలో ఎదుగుదల ఆగిపోతుంది. చివరికి మొక్క ఆకులు ఎండి, తద్వారా మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ చీడ ప్రభావం నామ మాత్రమే అయినప్పటికీ మొక్కల ఆకులపై నల్లమసి ఏర్పడితే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది.

oil-farm2

యాజమాన్య పద్ధతులు..

ఈ తెల్లదోమకు పరాన్న జీవిని ఉపయోగించడం ద్వారా చీడను నివారించవచ్చు. దీంతో ఈ దోమల ఉధృతి పెరుగకుండా ప్రభావకారిగా పనిచేస్తుంది. దోమలకు సహజ శుత్రువులైన పరాన్నజీవులు వాటిని తిని, కీటకాల వృద్ధి ద్వారా సహజపద్ధతిలో నివారించుకోవచ్చు. రసాయన మందుల వాడకం వల్ల సహజంగా చీడలను నివారించే పరాణజీవుల పెరుగుదల, అవరోధంతో పాటు ఈ దోమ సమస్య మళ్లీ పెరుగకుండా చూసుకోవచ్చు. ఒక లీటరు నీటిలో ఒక మిల్లీలీటర్ వేపనూనె (10000 పీపీఎం, 10 గ్రాముల రిన్‌సర్ఫ్ పిచికారీ చేయడం ద్వారా 97 శాతం ఈ చీడను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు) రిన్‌సర్ఫ్ మైనం పదార్థాన్ని కలిగించే గుణం ఉన్నందున ఈ దోమ పిల్లదశలోనే బయటకు వచ్చేటట్లు చేస్తుంది. ఈ విధంగా బయటపడిన దశల మీద వేప నూనె ద్రావణం సమర్థవంతంగా పనిచేసి కీటకాల నిర్మూలనకు దోహదం చేస్తుంది. నేల మీద ఉన్న కలుపు మొక్కలకు మసి పొరలు లేని పచ్చని ఆకులు రావడం ద్వారా దీని ఉధృతి తగ్గుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చీడ ప్రభావం ఉన్న ప్రాంతం నుంచి మొక్కలు తీసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చీడ ప్రభావంలేని మొక్కలను ఎంచుకుని నాటుకోవాలి. పిచికారీ చేసిన తర్వాతనే నర్సరీ నుంచి మొక్కల ను తీసుకోవాలి. వ్యాధి సోకిన ప్రాంతంలో లేని రైతులు తప్పనిసరిగా వేప నూనె పిచికారీ చేసుకోవాలి. చీడ వ్యాప్తి చెందుతున్న ప్రాంతంలోని తోటలు, చీడ సోకిన తోటలు, సోకని పరిసర ప్రాంతాలలో ఉన్న తోటలకు సైతం వేప నూనె పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా 10వేల పీపీఎం వేప నూనె లేదా 2 మిల్లీలీటర్ల రిన్‌సర్ఫ్‌తో వేపనూనె కలుపుకుని వాడుకోవచ్చు. -మద్దెల లక్ష్మయ్య, 90107 23131 ఖమ్మం వ్యవసాయం

anasuya

అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం తెల్లదోమ తెలంగాణలో వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మామిడి, జామ తోటలకు సైతం ఈ చీడ ప్రభావం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. అయితే ఆయిల్‌ఫామ్ పంటలకు సోకితే తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉన్నది. సంబంధిత రైతులు దీనిపట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ రకం తెల్లదోమ కనిపించిన వెంటనే తక్షణం సమీప ఉద్యాన అధికారులకు గానీ, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకవెళ్లాలి. వారి సలహాల మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలి. - జీ అనసూయ, 7997725126, ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి

More in రైతుబ‌డి :