మిద్దెకు అల్లుకున్న హరిత‘లత’

ఇంటి పంట
మూలాలు మరువక, తడి గుండెను వదలక మిద్దెపై పల్లె పెరటిని, తిరిగి సృజించిన తన్మయత్వం. భర్త, ఇద్దరు పిల్లలు, తోడు మొక్కలు ఇంటిని లతలా అల్లుకున్న అనుబంధాల సుగంధం. ఇంద్రధనస్సులా వరుసన విరిసిన పూలు చిన్న చిన్న కుండీల్లో విరగగాస్తున్న పండ్లు, కాంతులీనుతున్న లేత కూరగాయలు,ఆకుకూరలు ఎటుచూసినా ఒక సంతోషం.. ఒక సౌరభం ....... ఆరోగ్యమో,ఆనందమో ఆకుపచ్చని వైభవమో.. ఆశలు రేకెత్తించే రేపటికి వాగ్దానమో .. బీటలు వారిన గుండెలో చిగురాకుల రాగమో.. ఏమైనా అనిపించనీ ఎలాగైనా కనిపించనీ గూట్లో కొంచెం చోటిస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటోంది. ఆమెకది అందమైన అనుభవాల బడే కాదు, ఆకుపచ్చని మొక్కల మధ్య కలదిరిగిన అమ్మ పోతూ పోతూ మిగిల్చిన తన జ్ఞాపకాల ఒడి కూడా.. haritha-latha బీరంగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన లత, శ్రీనివాస రెడ్డి ఇంటి మిద్దె మీద అడుగుపెడితే ఒక హరితవనంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ మిద్దెతోట మొదలుపెట్టి నాలుగేండ్లే అయినా, లతకు ప్రకృతితో అల్లుకున్న అనుబంధం ఇప్పటిది కాదు. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా, పూలమొక్కలు నాటడం ఆమె అభిరుచి. అంతకుమించి మొక్కలంటే వ్యామోహం. 2008లో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు పూలమొక్కలు, కరివేపాకు ఒక పూలకుండీలో మామిడిచెట్టు నాటింది. కుండీలో మామిడిచెట్టేమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. నిజం గా కుండీ ల్లో పండ్ల చెట్లు ఎందుకు పెరుగవు? అనే ఆలోచన ఆమె మనసులో నాటుకుపోయింది. సొంత ఇల్లు కుట్టుకున్న తరువాత మొదట్లో కింద కొన్ని పూలమొక్కలు పెంచింది. చుట్టూ ఉన్న అపార్టుమెంట్ల నీడలో అవి సరిగా పెరుగకపోవడంతో వాటిని మిద్దెమీదికి మార్చింది.

పూలతో పాటు టమాటా, మిరప మొక్కలను నాటి, వాటి ఫలాలను భర్తకు చూపించడంతో ఆయన కూడా మిద్దె పంటపై ఆసక్తి చూపించాడు. మొక్కలకు తెగుళ్లు రావడం, ఎండిపోవడం వంటి సమస్యలు తొలుత నిరాశ పరిచినా, ఓటమి లేని వారికి అనుభవం రాదు.. అనుభవం లేనివారికి జ్ఞానం రాదు అనే నమ్మకంతో ముందుకు సాగింది. 206 గజాల స్థలంలో నిర్మించిన ఇంటి మీద, 1800 చదరపు అడుగుల మిద్దె తోటలో పలు పంటల సాగుకు సిద్ధమైంది. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా కూరగాయలు పండించాలనే ఆలోచనతో కూరగాయల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. పూల మొక్కలు, కరివేపాకు, ఆకుకూరలతో ఆరంభమై, పండ్ల చెట్లను పెంచడం వరకు సాగింది. మన పంట-మనం అనే భావన చాలా సంతృప్తిని కలిగిస్తుందంటారు లత.

tomato ఈ మిద్దెతోటలో 3 రకాల టమాటా (టమాటా, ఎరుపు-పసుపు చెర్రీ టమాటా), 4 రకాల వంకాయ (గుండ్రని నల్ల వంకాయ, పొడవైన నల్ల వంకాయ, పొడవైన తెల్ల వంకాయ. తెల్ల చారల వంకాయ), నాలుగు రకాల నిమ్మ (నాటు నిమ్మ, దబ్బనిమ్మ, గజనిమ్మ, స్వీట్ లైవ్‌ు), 3 రకాల జామ (నాటు జామ, 2 రకాల తైవాన్ జామ), డ్రాగన్‌ఫ్రూట్, సపోటా (2 చెట్లు), 3 అరటి చెట్లు, కాలిఫ్లవర్, క్యాబేజీ, చేమదుంప, దోస, ముల్లంగి, వంగ, మిర ప, ఆలుగడ్డలు వంటి పలురకాల కూరగాయలు ఆమె తోటలో కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటు కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర, చుక్కకూర, చామకూర, గోంగూర, ఆకుకూరలు వంటి తీగజాతి మొక్కలు తక్కువ స్థలంలో ఎక్కువ కాపు కాస్తున్నాయి. ఇక కుండీల్లో పెరుగుతున్న చిక్కుడు గుత్తులుగా కాస్తున్నది.

Cucumber ఇని నాలుగు చెట్లుంటే ఇంటికి సరిపోతాయి. చెట్టు మీద ఆకు కంటే మిరపకాయలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆకుకూరల కోసం ప్రత్యేకంగా సిమెంట్ రింగులు వాడుతున్నారు. సిమెంటు రింగులు వేసేటప్పుడు దీనికి మధ్యభాగంలో బీవ్‌ు ఉండే లా జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్ద కుండీల్లో వంగ, క్యారె ట్, వంటి కూరగాయలను బహుళ పంటల పద్ధతిలో పండిస్తున్నారు. కుండీలోని మామిడి మొక్క కింద ఖాళీస్థలంలో నాలుగు వంగ మొక్క లు నాటారు. ఒక సిమెంటు రింగులో కొత్తిమీర, మెంతికూరను, మరో రింగులో పాలకూర, చుక్కకూర, చామదుంపను పండిస్తున్నారు.

cabbage పండ్లరకాలకు వస్తే రకరకాల కుండీల్లో బొప్పా యి, బత్తాయి, స్టార్‌ఫ్రూట్, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, ఖర్జూర. వాటర్ యాపిల్, చీనీ, 4 రకాల మామి డి (చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, పునాస) యాపిల్ బేర్, సీతాఫలం, నిమ్మ, పెద్ద ఉసిరి, పప్పు ఉసిరి పండిస్తున్నారు. కుండీలో పెరుగుతున్న దానిమ్మ విరివిగా కాస్తున్నది. సీతాఫలం విపరీతంగా కాస్తున్నది. ఇవి ఉన్నవి రెండు చిన్న చెట్లే అయినా ఎక్కువ కాయలు కాస్తున్నాయి. ఒకటి, రెండు కొమ్మలే ఉన్నా అంజీర విరామం లేకుండా కాస్తున్నది. పైన్ యాపిల్ పెట్టిన 18 నెలలకు కాపుకొచ్చింది. అసలు పైన్ యాపిల్‌కు ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదంటారు లత. చిన్న చిన్న కుండీల్లో ఇంత పెద్ద పండ్లముక్కలు ఎలా పెంచుతున్నావని చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. ఏడేండ్ల మొక్కనైనా కుండీ సైజును బట్టి కత్తిరింపులు చేసుకుంటే ఏ చట్టైనా పెద్దవృక్షంలా పెరుగదు అంటారామె.

వాటర్ యాపిల్ పెద్ద సైజు పెరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ డ్రమ్ము కింది భాగాన్ని కట్ చేసి అందులో నాటారు. పండ్ల మొక్కలు పెద్ద కుండీల్లో పెట్టాల్సి ఉంటుంది కనుక వాటిని బీవ్‌ు పై ఉంచితే బరువు సమస్య తీరుతుంది. ఇక మిద్దె చుట్టూతా సిమెంటు ఇటుకలు వరుసగా పేర్చి, పొడవాటి మడులు చేసుకున్నారు. సొర, బీర, కాకర, పొట్ల, చిక్కు డు, బచ్చలి తీగ వంటి తీగజాతులను, ముల్లంగిని వీటిలో పెంచుతున్నారు. కుండీల్లో మడిలో మట్టి బీటలు వారినట్టయితే మొక్క తొందరగా దెబ్బతింటుంది కాబట్టి 1-1-1 నిష్పత్తిలో ఎర్రమట్టి-వర్మికంపోస్ట్-కోకోపిట్ వాడుతున్నారు. మట్టి వదులుగా ఉండి, వేర్లు చొచ్చుకుపోవడానికి కోకోపిట్‌ను వాడుతున్నారు.

guava కోకోపిట్ మట్టిలో ఎక్కువ తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. మొక్క నాటే ముందు వేపపిండిని చల్లుకుని, వేరుతెగులు సమస్య రాకుండా చూసుకుంటున్నారు. ఆకుముడత, పేనుబంక రాకుండా వేపనూనె స్ప్రే చేస్తున్నారు. మట్టిలో తేమశాతాన్ని బట్టి, కాలాన్ని బట్టి మొక్కకు నీరు అందిస్తున్నారు. తోటలో రాలిన ఎండుటాకులను కంపోస్టులో వాడుతున్నారు. ఇప్పుడామె తన మిద్దెతోట అనుభవాలను ఫేసుబుక్‌లో సీరియల్‌గా రాస్తున్నారు. కొత్తగా మిద్దెతోట పెంచుకోవాలనుకునే వారికి స్ఫూర్తి పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి.

ridge-guard మిద్దెతోట అందించే ఆహారం, రుచి, ఆరోగ్యం, ఆనందం అన్న నాలుగు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆదివారం వస్తే మాకు సందడే సందడి. పిల్లలు సెలవుల్లో ఉత్సాహంగా తోటపనిలో సాయపడుతున్నారు. తోట ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కపూట పైకి రాకపోయినా, చూసుకోకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. పిల్లలతో గడిపినట్టే మొక్కలతోనూ గడుపుతానంటున్నారు లత. -కె. క్రాంతికుమార్ రెడ్డి, నేచర్స్ వాయిస్ ఫొటోలు: రవికాంత్ సిరిపంగి

More in రైతుబ‌డి :