పత్తి సాగుచేసే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

cotton రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో చాలావరకు పత్తి తీత పూర్తైంది. మొదటి రెండుసార్లు ఏరిన పత్తిలో గులాబీరంగు పురుగు నష్టం పెద్దగా లేనప్పటికీ, రైతులు చివరిసారి ఏరిన పత్తిలో అంటే డిసెంబరు-జనవరి నెలలో తీసిన ప్రత్తిలో చాలాచోట్ల గులాబీరంగు పురుగు నష్టం కనిపించింది. పురుగు సోకిన పత్తి రంగు, నాణ్యతను కోల్పోవడమే కాకుండా, దూదిలోని గింజలను తినటం వల్ల పత్తి బరువు కూడా బాగా తగ్గుతుంది. ఆ విధంగా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి లేదా నష్టం ప్రస్తుతం మిగిలివున్న పంట అవశేషాలు (పంట మోళ్లు, జిన్నింగు మిల్లులో పత్తిని జిన్నిం గ్ చేయగా వచ్చే పత్తి గింజలు, వ్యర్థాలు మొదలగునవి) నిల్వచేసిన పత్తి ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా కొన్ని ముఖ్యమైన నివారణ చర్యలు ప్రస్తుత దశలో తప్పనిసరిగా చేపట్టాలి. తద్వారా గులాబీ పురుగు ఉనికి బాగా తగ్గి, వచ్చే పంట ఆరోగ్యంగా వుండే అవకాశం ఎక్కువగా వుంటుంది. కాబట్టి ప్రస్తుతం పత్తి పంటలో కింది చర్యలు పత్తి సాగు చేసే అన్ని ప్రాంతాల్లో, పత్తిని జిన్నింగ్ చేసే అన్ని మిల్లులలో తప్పనిసరిగా చేపట్టాలి.

1 పత్తి పంట కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో 200 రోజులకు మించి పొడిగించరాదు. నీటి వసతి ఉన్నచోట కూడా జనవరి మొదటి పక్షం కల్లా పత్తి తీత పూర్తి చేసి అనుకూలతను బట్టి స్వల్పకాలిక ఆరుతడి పంటలకు వెళ్ళాలి. ముఖ్యంగా పెసర, బొబ్బెర, తెల్ల నువ్వులు మొదలగునవి అనుకూల పంటలు.

2 పత్తి తీత పూర్తయిన వెంటనే పత్తి మోళ్లను పశువులతో, గొర్రెలతో మేపి, మోళ్లు ఎండగానే త్వరగా ట్రాక్టర్ షెడ్డర్ లేదా రోటావేటర్ సహాయంతో భూమిలో కలియదున్నాలి. తద్వారా పత్తి మోళ్లలో మిగిలివున్న పురుగు కోశస్థ దశలు నిర్మూలించబడటమే కాకుండా, పత్తి కట్టె భూమిలో మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. 3 పత్తి మోళ్లను ఏరూపంలోనైనా ఎక్కువ కాలం నిల్వ వుంచకుండా నిర్మూలించడం గులాబీరంగు పురుగు నివారణకు చాలా ముఖ్యం. పురుగు సోకిన పత్తిని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా త్వరగా అమ్మివేయాలి. తద్వారా నష్టం తగ్గుతుంది.

4 పత్తి మోళ్లను భూమిలో కలియదున్నిన తర్వాత ఎండకాలంలో (ఏప్రిల్/మే) లోతుదుక్కులు చేసినట్లయితే ఇంకా మిగిలిన పురుగు అవశేషాలు కూడా నశిస్తాయి.

5 నీటి వసతి వున్నచోట నీరు నిండుగా పెట్టి ఎండాకాలం దుక్కులు చేసినట్లయితే భూమిలోపల వున్న పురుగు కోశస్థ దశలు సమగ్రంగా నిర్మూలించబడతాయి.

6 పత్తి పంటకు-పంటకు మధ్య 4 నుంచి 6 నెలల వరకు భూమిపై ఏ మాత్రం ప్రత్తి పంట అవశేషాలు లేకుండా చేయాలి. తద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతి వచ్చే పంటపై బాగా తగ్గుతుంది.

7 మరీ ముఖ్యంగా జిన్నింగు మిల్లులో పురుగు ఆశించిన పత్తిని జిన్నింగు చేయగా వచ్చిన గింజలను, ఇతర వ్యర్థాలను త్వరగా తొలిగించాలి.

8 జిన్నింగు మిల్లుల లోపల, బయట చుట్టుపక్కల పత్తి గింజలను, ఇతర వ్యర్థాలను కుప్పలుగా పోసి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచాలి. 9 పత్తి జిన్నింగ్ సమయంలో జిన్నింగ్ తర్వాత, దూది, గింజలు మిల్లులో వున్నంత కాలం,గులాబీ రంగు పురుగు లింగాకర్షక బుట్టలను మిల్లు లోపల, బయట ఎకరా ఆవరణకు 20 చొప్పున పెట్టి, బుట్టలలో పడిన తల్లి పురుగులను ఎప్పటికప్పుడు వేరు చేసి ఒక గుంతలో వేసి కాల్చివేయాలి.

10 పంట పూర్తయిన వెంటనే పత్తి మోళ్ళను భూమిలో కలియదున్నటం, ఎండా కాలం లోతు దుక్కులు, పంటకు పంటకు మధ్య ఎడం ఎక్కువగా వుండటం, శుభ్రమైన జిన్నింగు మిల్లు ప్రాంతాలు పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని గణనీయంగా తగ్గించడానికి బాగా ఉపకరిస్తాయి. -డాక్టర్ బి. రాంప్రసాద్, కీటక శాస్త్రవేత్త -ఎ. సుదర్శనం, పత్తి ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్

More in రైతుబ‌డి :